న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ పునర్విభజన బిల్లులను పార్లమెంట్ ఆమోదించడం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో గొప్ప సందర్భమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. కొందరి స్వార్థపూరిత సంకెళ్లలో నలిగిన అక్కడి ప్రజలకు స్వేచ్ఛ లభించిందని, వారు గొప్ప శుభోదయం కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. జమ్మూకశ్మీర్, లదాఖ్‌లకు సంబంధించిన బిల్లులకు పార్లమెంట్ ఆమోదం లభించడం ద్వారా సర్దార్ పటేల్‌కు నివాళులర్పించినట్లయిందన్నారు. ఆయనతోపాటు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, డాక్టర్‌ఎస్‌పీ ముఖర్జీ లాంటి వారు అఖండ భారతం కోసం తపించారని తెలిపారు. ‘మనమంతా ఎప్పటికీ కలిసికట్టుగా ఉండి 130 కోట్ల మంది భారతీయుల కలలను సాకారం చేద్దాం.
జమ్మూకశ్మీర్‌కు సంబంధించి మూడు బిల్లులను ఆమోదించిన ఈ రోజు మన పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్రలో ఇది చరిత్రాత్మకమైన రోజు’అని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం కోసం ఏనాడూ పనిచేయని కొందరు స్వార్థ పూరిత శక్తుల భావోద్వేగ బ్లాక్ మెయిల్ నుంచి కశ్మీర్ ప్రజలకు విముక్తి లభించిన రోజు. కొత్త శుభోదయం, మరింత మెరుగైన రేపటి కోసం ఎదురుచూస్తోంది’అని పేర్కొన్నారు. ‘ధైర్యం, సహనం ప్రదర్శించిన జమ్మూకశ్మీర్, లదాఖ్ ప్రాంతాల సోదరి సోదరీమణులు నా సెల్యూట్’అని తెలిపారు.
పార్లమెంట్ ఆమోదించిన మూడు బిల్లులు ఈ ప్రాంతాల ప్రజల అభివృద్ధికి ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలన్న చిరకాల కోరిక నెరవేరిన లదాఖ్ ప్రజలకు నా ప్రత్యేక అభినందనలు అని తెలిపారు. విభేదాలను మరిచి అన్ని ప్రాంతాల అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేయాలని జమ్మూకశ్మీర్ లదాఖ్ ప్రాంతాల ఎంపీలను కోరారు. హోం మంత్రి అమిత్ షా చేసిన కృషిని, చూపిన చిత్తశుద్ధిని మోదీ ప్రశంసించారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సభలను నడిపించిన తీరును మోదీ కొనియాడారు.
లదాఖ్ ఎంపీకి ప్రధాని ప్రత్యేక ప్రశంస
బీజేపీకి చెందిన లడాఖ్ ఎంపీ జమ్యంగ్ త్సెరింగ్ నమగ్యాన్‌ను ప్రధాని మోదీ అభినందించారు. జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతి పత్తి రద్దుతోపాటు లదాఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడంపై లోక్‌సభలో మంగళవారం జరిగిన చర్చ సందర్భంగా ఎంపీ త్సెరింగ్ ప్రసంగించారు. ‘లదాఖ్ ప్రాంతం వెనుకబడి ఉందంటే అందుకు కారణం ఆర్టికల్ 370, కాంగ్రెస్ పార్టీయే కారణం. ఆర్టికల్–370 రద్దు ద్వారా భారత ప్రథమ ప్రధాని నెహ్రూ పాల్పడిన తప్పిదాలను ప్రభుత్వం సరిచేసింది’అని పేర్కొన్నారు. ‘లదాఖ్‌ను కశ్మీర్‌లో విలీనం చేయాలంటూ 1948లో లదాఖ్ బుద్ధిస్ట్ అసోసియేషన్ నెహ్రూకు లేఖ రాసింది. కానీ, నెహ్రూ మా వినతిని అంగీకరించలేదు. తాజా నిర్ణయంతో కశ్మీర్ భవిష్యత్ ఉజ్వలంగా ఉండబోతోంది. జమ్మూకశ్మీర్ మొత్తం తమ ఆస్తిగానే భావించిన రెండు ప్రముఖ రాజకీయ కుటుంబాలకు మాత్రం పనిలేకుండా పోతుంది’అని అన్నా రు. అయితే, జమ్మూ కశ్మీర్ ప్రాంతాలకు కేంద్రం నుంచి నేరుగా నిధులు అందుతాయి కానీ, లదాఖ్‌కు అటువంటి అవకాశం లేదన్నారు. లదాఖ్ ప్రజలు ఇకపై త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేస్తారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment