
20 వేల కోట్లతో రక్షణ కొనుగోళ్లు!
రక్షణ రంగానికి ప్రధాని నరేంద్రమోడీ పెద్దపీట వేశారు. విదేశీ సంస్థల నుంచి తేలికరకం హెలికాప్టర్లు కొనకూడదని, వాటిని భారతదేశంలోనే తయారు చేయించుకోవాలని నిర్ణయించారు. హెలికాప్టర్ల కొనుగోలుకు ఇంతకుముందు పిలిచిన గ్లోబల్ టెండర్లను రద్దుచేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేవలం భారతీయ పరిశ్రమల నుంచి మాత్రమే టెండర్లు ఆహ్వానించబోతోంది. దీంతో 'మేక్ ఇన్ ఇండియా' అంటూ స్వాతంత్ర్య దినోత్సవం రోజున మోడీ ఇచ్చిన పిలుపునకు భారతీయ రక్షణ రంగ పరిశ్రమలు స్పందించాల్సిన తరుణం ఆసన్నమైంది. ఈ కొనుగోళ్ల విలువ దాదాపు 20వేల కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ప్రస్తుతం ఆర్మీతో పాటు వైమానిక దళం కూడా చీతా, చేతక్ హెలికాప్టర్లనే ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి. వీటిలో దాదాపు 197 హెలికాప్టర్లకు కాలపరిమితి తీరిపోవడంతో వాటన్నింటినీ మార్చాల్సి ఉంది.
టాటా, రిలయన్స్, మహీంద్రా సంస్థలు సైనిక అవసరాలకు కావల్సిన సామగ్రిని ఉత్పత్తి చేసేందుకు ముందుకు వచ్చాయి. టాటా గ్రూస్ సంస్థలకు భారతదేశంలో హెలికాప్టర్ల ఉత్పత్తికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకునే దేశాల్లో భారతదేశం ఒకటిగా నిలుస్తోంది. రక్షణ రంగ కొనుగోళ్ల విలువ జీడీపీలో దాదాపు 2శాతం వరకు ఉంటోంది. ఇప్పుడు వీటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం మానేసి స్వదేశీ కంపెనీల నుంచి కొనుగోలు చేస్తే ఇక్కడ రక్షణ రంగంలో పరిశోధన, అభివృద్ధి మరింత మెరుగయ్యే అవకాశం కూడా ఉంటుంది. అయితే.. ఇలా సొంత దేశంలోనే హెలికాప్టర్లు తయారుచేయాలంటే మాత్రం దాదాపు ఐదేళ్ల వరకు సైన్యం వేచి ఉండాల్సిన అవసరం ఉంటుంది.