రక్షణరంగ కొనుగోళ్లపై కొత్త విధానం
రక్షణమంత్రి మనోహర్ పారికర్
అవినీతికి తావులేని వ్యవస్థ ..
దేశ ప్రయోజనాలకు పెద్దపీట
ప్రైవేట్ కంపెనీల సమస్యలూ తీరుస్తాం
‘స్వావలంబన’ సదస్సుకు
ముఖ్యఅతిథిగా వచ్చిన పారికర్
సాక్షి, హైదరాబాద్: రక్షణ రంగ కొనుగోళ్లకు సంబంధించిన అడ్డంకులను తొలగించే ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. అవినీతి రహిత, దేశీయ కంపెనీలకు సమాన అవకాశాలు కల్పించే సరికొత్త విధానానికి మూడు, నాలుగు నెలల్లోనే తుది రూపునిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఫోరమ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ నేషనల్ సెక్యూరిటీ (ఫిన్స్) ఆధ్వర్యంలో ‘సెల్ఫ్ రిలయన్స్ ఇన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్’ అన్న అంశంపై శనివారం జాతీయ సదస్సు ప్రారంభమైంది. హైదరాబాద్లో రెండు రోజులపాటు జరగనున్న ఈ సదస్సుకు రక్షణ శాఖ మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మనోహర్ పారికర్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారు అన్న పేరు భారత్కు గర్వకారణం కాదని, దేశ రక్షణకు సంబంధించిన కీలక అంశాలపై ఇతర దేశాలపై ఆధారపడటం మన విదేశాంగ విధానాన్ని కూడా ప్రభావితం చేస్తుందన్నారు. అందుకే మన అవసరాల కోసం మనమే రక్షణ రంగ ఉత్పత్తులను తయారు చేసుకోవాలని చెప్పారు. భారత్లో తయారైన రక్షణ రంగ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు అనేక దేశాలు ఆసక్తి చూపుతున్నాయన్నారు. అయితే స్వావలంబన సాధించేందుకు విధానాలపరంగా మనకు మనమే అనేక అడ్డంకులు, చిక్కుముళ్లను ఏర్పరచుకున్నామని అభిప్రాయపడ్డారు.
నిషేధమొక్కటే మార్గం కాదు...
అవకతవకలకు పాల్పడ్డారనో... మరో కార ణం చేతనో రక్షణ రంగానికి పరికరాలను సరఫరా చేసే కంపెనీలపై విచక్షణా రహితంగా నిషేధం విధించడం సరికాదని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో టాట్రా ట్రక్కుల కంపెనీపై నిషేధం విధించడాన్ని ప్రస్తావిస్తూ... త్రివి ద దళాల్లో దాదాపు 7,000 టాట్రా ట్రక్కులుం టే.. నిషేధం ఫలితంగా కీలకమైన ఆయుధ వ్యవస్థలను మోసుకెళ్లే దాదాపు పదిశాతం ట్రక్కులు మూలనపడ్డాయని తెలిపారు. కంపెనీలు చేసే తప్పుల కన్నా దేశ ప్రయోజనాలకే తాను ఓటు వేస్తానని అన్నారు. టాట్రా ట్రక్కులకు అవసరమైన విడి భాగాలు, సరికొత్త వాహనాల తయారీకి దేశీయంగానే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’ ద్వారా రక్షణ రంగ ఉత్పత్తులు దేశీయంగానే తయారు కావాలని రక్షణశాఖ భావిస్తోందన్నారు. రక్షణ రంగ పరి కరాలు తయారీ కంపెనీల సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. అంతకుముందు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ సత్వర పారిశ్రామికీకరణ రాష్ట్ర అభివృద్ధికి కీలకంగా భావిస్తున్నట్లు తెలిపారు.
ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్
రక్షణ రంగంలో స్వావలంబన సాధించడమే కాకుండా... మేక్ ఇన్ ఇండియా స్థాయి నుంచి మేడ్ బై ఇండియా స్థాయికి భారత్ ఎదగాలని అందుకు ఇదే సరైన తరుణమని ఫిన్స్ అధ్యక్షుడు లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) బి.షేకట్కర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫిన్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అధ్యక్షుడు మేజర్ జనరల్ ఎ.బి.గోర్తి, జనరల్ సెక్రటరీ వి.శ్రీనివాసరావు, ఫిన్స్ సెక్రటరీ జనరల్ బాల్దేశాయి, లెఫ్టినెంట్ జనరల్ వి.ఎం.పాటిల్, ఎయిర్ మార్షల్ ఆర్.సి.బాజ్పాయి, సదస్సు ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు ఏకే మహంతి, కె.రామచంద్రమూర్తి (సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్) తదితరులు పాల్గొన్నారు.