‘కుంభమేళా’లా జనమొస్తే.. మీరేం చేస్తారు? | Narendra Modi in America 'ring fenced' against summons | Sakshi
Sakshi News home page

‘కుంభమేళా’లా జనమొస్తే.. మీరేం చేస్తారు?

Published Sun, Sep 28 2014 2:02 AM | Last Updated on Wed, Oct 17 2018 4:36 PM

‘కుంభమేళా’లా జనమొస్తే.. మీరేం చేస్తారు? - Sakshi

‘కుంభమేళా’లా జనమొస్తే.. మీరేం చేస్తారు?

న్యూయార్క్ మేయర్‌తో మోదీ చర్చలు
 
 న్యూయార్క్: పట్టణాల ఆధునీకరణ ప్రాజెక్టుపై బాగా దృష్టి పెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ మేరకు న్యూయార్క్ మేయర్ బిల్ డి బ్లాసియోతో సమావేశమయ్యారు. పెద్ద నగరాలకు ఎదురవుతున్న సమస్యలు.. ముఖ్యంగా ఉగ్రవాదం, ప్రజలకు ఇళ్ల నిర్మాణం వంటి వాటిపై చర్చించారు. ఒకవేళ భారత్‌లోని కుంభమేళా లాంటి సందర్భాలు వస్తే భారీగా తరలివచ్చే తొక్కిసలాటలు జరగకుండా చూడడం ఎలా? వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించడం ఎలా వంటి అంశాలపై మాట్లాడారు. అలాగే సెప్టెంబర్ 11 దాడుల తర్వాత న్యూయార్క్ పోలీసులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని అడిగి తెలుసుకున్నారు. కాగా అహ్మదాబాద్‌తో సోదర నగర సంబంధమున్న కొలంబస్ నగరం.. నరేంద్ర మోదీ తొలి అమెరికా పర్యటనను పురస్కరించుకుని ప్రశంసాపూర్వక ప్రకటన విడుదల చేసింది.

క్యాన్సర్ నిపుణుడితో మోదీ భేటీ: ప్రముఖ కేన్సర్ నిపుణుడు, నోబెల్ బహుమతి గ్రహీత ప్రొఫెసర్ హెరాల్డ్ వర్ముస్‌తో మోదీ న్యూయార్క్‌లో సమావేశమయ్యారు. ప్రజారోగ్య రంగంలో జరుగుతన్న పరిశోధనల్లో సాయం చేసేందుకుగాను భారత్‌కు రావాల్సిందిగా ఆయన్ను ఆహ్వానించారు. 74 ఏళ్ల హెరాల్డ్ వర్ముస్ 1960లలో ఉత్తరప్రదేశ్ బరేలీలోని ఓ ఆసుపత్రిలో తన అప్రెంటిస్‌షిప్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన అమెరికా నేషనల్ కేన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో డెరైక్టర్‌గా ఉన్నారు. 30 నిమిషాలపాటు ఆయనతో సమావేశమైన మోదీ.. పలు అంశాలపై చర్చించడంతోపాటు కేన్సర్ పరిశోధనల్లో భారత్‌కు సహకరించాల్సిందిగా కోరారు.

గ్రౌండ్ జీరోవద్ద మోదీ నివాళి: న్యూయార్క్‌లో 2001 సెప్టెంబర్ 11న అల్‌కాయిదా ఉగ్రవాదులు వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట టవర్లపై జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి మోదీ గ్రౌండ్ జీరో స్మారక చిహ్నంవద్ద  నివాళులర్పించారు. 9/11 మ్యూజియంను కూడా సందర్శించారు. కాగా, మోదీ గౌరవార్థం భారతీయ సంతతికి చెందిన అమెరికన్లు ఆదివారం న్యూయార్క్ మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో సభకు 46మంది అమెరికా ప్రతినిధులు హాజరుకానున్నారు.
 
 మోదీకి సమన్లు అందిస్తే రూ. 6 లక్షలు
 అమెరికా మానవ హక్కుల సంస్థ నజరానా  

 
 ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజయవంతంగా కోర్టు సమన్లు అందజేసినవారెవరికైనా సరే 10 వేల అమెరికన్ డాలర్లను (సుమారు రూ.6 లక్షలు) నజరానాగా ఇస్తామని అమెరికన్ జస్టిస్ సెంటర్ (ఏజేసీ) ప్రకటించింది. అరుుతే భద్రతా వలయంలో ఉన్న ప్రధానికి అలా సమన్లు జారీ చేయగల అవకాశమే లేదని భారత్ స్పష్టం చేసింది. 2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్లకు సంబంధించి మానవహక్కుల సంస్థ ఏజేసీ మోదీపై దావా దాఖలు చేసింది. తాజాగా ప్రధాని అమెరికా పర్యటన నేపథ్యంలో.. నగరంలో ఆయన పాల్గొనే పలు కార్యక్రమాల సందర్భంగా సమన్లు జారీ చేసే ఏ వ్యక్తికైనా 10 వేల అమెరికన్ డాలర్లు ఇస్తామని ఆ సంస్థ ప్రకటించినట్లు న్యూయూర్క్‌కు చెందిన లీగల్ అడ్వైజర్ గురుపత్వంత్ సింగ్ పన్నున్ తెలిపారు. మోదీకి సమన్లు అందజేసిన వ్యక్తి అందుకు సంబంధించిన ఫొటో కానీ లేదా వీడియోను అందుకు రుజువుగా తేవాల్సి ఉంటుందని చెప్పారు. సమన్ల జారీకి ఏజేసీ స్వయంగా సైతం కొంతమందిని ఏర్పాటు చేసుకుంది. న్యూయూర్క్ రాష్ట్ర చట్టాల మేరకు 10 అడుగుల దూరం నుంచైనా, సంబంధిత వ్యక్తిపై పత్రాలను విసిరివేయడం ద్వారానైనా సమన్ల జారీ ప్రక్రియను పూర్తి చేయవచ్చని ఏజేసీ పేర్కొంది. ఇలా చేసినా సమన్లు జారీ అరుునట్టుగానే పరిగణిస్తారు. యూఎస్ ఫెడరల్ కోర్టు గురువారం మోదీకి సమన్లు జారీ చేసింది. అందులో మోపిన అభియోగాలకు 21 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement