
గోరఖ్‌పూర్ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కిసాన్ సమ్మాన్ నిధి’ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఆదివారం ఆయన ఈ పథకాన్ని ఆరంభించారు. పలువురు రైతులకు చెక్కులు అందించిన ప్రధాని... అన్నదాతలను అన్నివిధాలా ఆదుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. కాగా ఐదు ఎకరాల లోపు భూమి, ఒక కుటుంబంలో ఒక పాస్‌బుక్ ఉన్న రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు.
ఈ పథకం ద్వారా కోటిమంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.2వేలు జమ కానున్నాయి. ఏడాదికి ఒక్కో రైతు ఖాతాలో రూ.6వేలు జమ అవుతాయి. మిగతా నగదు రెండు విడతల్లో కేంద్ర ప్రభుత్వం ...రైతుల ఖాతాల్లో వేయనుంది. ఈ పథకం తొలివిడతగా ఉత్తరప్రదేశ్, కర్ణాటకతో సహా 21 రాష్ట్రాల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులు రూ.6 వేల సాయం పొందాలంటే ఆధార్ నంబరు తప్పనిసరి.
ఇక తెలంగాణ రాష్ట్రం నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద తొలి విడతలో వ్యవసాయ పెట్టుబడి సాయం పొందడానికి మొత్తం 17 లక్షలకుపైగా రైతులు అర్హత సాధించారు. ఇందులో కొందరు రైతులకు ఆదివారం పెట్టుబడి సాయం జమ కానుంది. ఇప్పటికే 5 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు నిధుల విడుదలకు సంబంధించి టోకెన్లు ఇచ్చినట్లు వ్యవసాయశాఖ వర్గాలు పేర్కొన్నాయి. విడతల వారీగా రైతులందరికీ పెట్టుబడి జమ అవుతుందని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment