సాక్షి, ముంబై: నవీముంబై మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్‌ఎంఎంసీ) ఎన్నికలు వచ్చే ఏడాది ఏప్రిల్‌లో జరగనున్నాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ బుధవారం ప్రకటించింది. మొదటిసారిగా ప్రభాగ్ స్థాయిలో ఎన్నికలు జరుగుతుండడంతో అన్ని పార్టీల నాయకులు వీటిపై దృష్టి సారించారు. ఈ ఎన్నికల్లో ఎలాంటి ఆరోపణలకు తావీయకుండా సంబంధిత అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఎన్నికల ప్రక్రియ అంతా కంప్యూటర్ ద్వారా పారదర్శకంగా జరిగే విధంగా తగు ఏర్పాట్లు చేస్తున్నట్లు కార్పొరేషన్ కమిషనర్ ఎ.ఎల్.జవ్హాడ్ పేర్కొన్నారు.
ఇందులోభాగంగా కమిషనర్, డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ మార్గదర్శకత్వంలో కార్పొరేషన్ అధికారులకు ఎన్నికల విధులను అప్పగించనున్నారు. లోక్‌సభ, శాసనసభ ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికలకు కూడా ఈవీఎంలతోపాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఙానాన్ని వినియోగించనున్నారు. ఎలాంటి మానవ తప్పిదాలకు తావీయకుండా గ్లోబల్ ఇన్‌ఫర్మేషన్ సిస్టం (జీఐఎస్) సాంకేతిక పరిజ్ఞానంతో కంప్యూటర్ ద్వారా ప్రభాగ్‌లను ఏర్పాటు చేశారు. సాధారణంగా ఒక వార్డులో రెండు ప్రభాగ్‌లు ఉంటాయి. జనాభాను బట్టి వాటిని విడదీయాల్సి ఉంటుంది.
అయితే ఇలా జీఐఎస్ పరిజ్ఞానంతో ప్రభాగ్‌లను విడదీయడం ఇదే మొట్టమొదటిసారి. ఆ ఘనత ఎన్‌ఎంఎంసీకే దక్కింది. ప్రభాగ్ స్థాయిలో ఎన్నికలు నిర్వహిస్తుండడంతో ఈసారి బరిలో దిగే అభ్యర్థుల సంఖ్య రెట్టింపయ్యే అవకాశముంది.
ఎన్‌ఎంఎంసీ ఎన్నికలు ఏప్రిల్‌లో
Published Wed, Nov 19 2014 10:36 PM | Last Updated on Sat, Sep 2 2017 4:45 PM
Advertisement