న్యూఢిల్లీ: ఢిల్లీ కంటోన్మెంట్‌లోని కరియప్ప పరేడ్ మైదానంలో ఉన్న ఎన్‌సీసీ (నేషనల్ క్యాడెట్ కోర్) గణతంత్ర దిన శిబిరాన్ని నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా సోమవారం సందర్శించారు. డీజీఎన్‌సీసీ లెఫ్టినెంట్ జనరల్ వినోద్ వశిష్ట్ ఆయనకుస్వాగతం పలికారు. క్యాడెట్లు ఆయనకు సమర్పించిన గౌరవ వందనం చూసి లాంబా ముచ్చటపడ్డారు. గౌరవ వందనం సమర్పించిన క్యాడెట్లలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాల వారు ఉన్నారు. క్యాడెట్లు సిద్ధం చేసిన జెండా వందనం ప్రదేశాలనుకూడా లాంబా పరిశీలించారు. అనంతరం ‘హాల్ ఆఫ్ ఫేమ్’ను ఆయన సందర్శించారు. క్యాడెట్లంతా సాయుధ దళాల్లో చేరి మాతృభూమికి సేవచేయాలని పిలుపునిచ్చారు.