
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖపట్నంలో భారత నౌకాదళ సెయిలర్‌గా పనిచేస్తున్న మనీష్‌కుమార్ గిరి అలియాస్ సబి గిరిని ఉద్యోగం నుంచి తొలగించారు. 'నేవీ' అధికారులకు సమాచారం ఇవ్వకుండా 'లింగమార్పిడి' శస్త్రచికిత్స చేయించుకున్నందుకు సబిగిరిపై వేటు పడినట్టు తెలుస్తోంది. సొంత అభీష్టం మేరకే సబిగిరీ లింగమార్పిడి పరీక్ష చేయించుకుందని, భారత నౌకాదళ నిబంధనల ప్రకారం ఆమె (లేదా అతడిని) ఉద్యోగంలో కొనసాగించడం కుదరదని నేవీ పేర్కొంది. అయితే, నౌకాదళం తీసుకున్న ఈ నిర్ణయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారత త్రివిధ దళాల్లోకి మహిళలను సైతం తీసుకోవాలని, యుద్ధశిక్షణ రంగంలో వారిని నియమించాలని భావిస్తున్న తరుణంలో ఈ నిర్ణయం.. ప్రతికూలమైనదేనని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఏడేళ్ల కిందట విశాఖపట్నంలో నేవీ సెయిలర్‌గా చేరిన మనీష్‌కుమార్ గిరి కొన్ని నెలల కిందట 22 రోజుల సెలవు తీసుకున్నాడు. ఈ సమయంలో అతడు ఢిల్లీ వెళ్లి ప్రత్యేకంగా 'లింగ మార్పిడి' ఆపరేషన్ చేయించుకొని.. సబీగా మారాడు. అనంతరం ఉద్యోగంలో తిరిగి చేరిన అతని ప్రవర్తనలో మార్పు రావడంతో అధికారులు ఈ విషయం గుర్తించారు. తాజాగా సబీగిరి మీడియాతో మాట్లాడుతూ తనను ఉద్యోగంలోనుంచి తొలగించాలన్న నేవీ నిర్ణయాన్ని తప్పుబట్టారు. శరీరంలో అవయవాలు మారాయన్న కారణంతో తాను మానసికంగా 'అన్‌ఫిట్' అని ముద్రవేసి ఉద్యోగం నుంచి తీసేశారని, నేవీ నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళుతానని సబిగిరీ అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment