ఛత్తీస్‌లో నక్సల్స్ పంజా
మందుపాతర పేలుడులో ఇద్దరు జవాన్ల బలి
ఎన్‌కౌంటర్లో ముగ్గురు నక్సల్స్ మృతి
చింతూర్(ఖమ్మం), న్యూస్‌లైన్: ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ భద్రతా బలగాలపై పంజా విసిరారు. సుక్మా జిల్లాలో ఆదివారం నక్సల్స్ మందుపాతర పేల్చడంతో ఇద్దరు సీఆర్‌పీఎఫ్ అధికారులు మృతిచెందగా, 12 మంది జవాన్లు గాయపడ్డారు. మరోపక్క.. బీజాపూర్ జిల్లా లో శనివారం రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టు దళ కమాండర్లు చనిపోయారు.
సుక్మా జిల్లాలోని బోధ్‌రాజ్ పదార్ గ్రామ సమీప అడవుల్లోకి కూంబింగ్‌కు వెళ్లిన ‘కోబ్రా’, సీఆర్‌పీఎఫ్, జిల్లా పోలీసు విభాగానికి చెందిన 400 మంది జవాన్ల కదలికను పసిగట్టిన మావోలు దారి కాచి భారీ మందుపాతర పేల్చారు. తర్వాత ఇరుపక్షాల మధ్య కాల్పులు జరిగాయి.
పేలుడులో సీఆర్‌పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్ నిహాల్ ఆలం, కానిస్టేబుల్ రాజీవ్ రావత్ అక్కడికక్కడే మృతిచెందారు. ఎస్‌ఐ హృదయ్‌వర్మ, సీఆర్‌పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్ రత్నేశ్వర్, కానిస్టేబుళ్లు ప్రమోద్, మహేష్ శర్మ, జితేందర్, దినేశ్ యాదవ్, మహంతి, అసిస్టెంట్ కానిస్టేబుల్ నెహ్రులాల్ కాశ్యప్‌లు తీవ్రంగా గాయపడడంతో వారిని హెలికాప్టర్‌లో రాయ్‌పూర్ ఆస్పత్రికి తరలించారు.
శనివారం రాత్రి మహారాష్ట్ర సరిహద్దులోని బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలకు, నక్సల్స్ మధ్య జరిగిన హోరాహోరీ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు నక్సల్స్ దళ కమాండర్లు మృతిచెందారు. వీరిలో భార్యాభర్తలు ఉన్నారు. ఛత్తీస్, మహారాష్ట్ర పోలీసులు బడే కాకిలేర్ అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తుండగా నక్సల్స్ తారసపడ్డారు. ఇరుపక్షాలు కాల్పులు జరుపుకున్నాయి.
ఘటనాస్థలంలో ఇద్దరు పురుషులు, ఓ మహిళా నక్సల్స్ మృతదేహాలు కనిపించాయి. మృతులను బీజాపూర్ జిల్లా పల్లెవాయి గ్రామానికి చెందిన గంగలూరు దళ కమాండర్ చైతు అలియాస్ నవీన్ మండావి, జైపేలీ గ్రామానికి చెందిన కమాండర్ మాసె తెల్లం(నవీన్ భార్య), సాగిమేటాకు చెందిన మిలీషియా కమాండర్ సన్ను ఉద్దేలుగా గుర్తించారు.