న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల మాజీ సీఎం, దివంగత నేత ఎన్డీ తివారి కుమారుడు రోహిత్ శేఖర్ తివారి(39) మరణించారు. ముక్కలోంచి రక్తం కారుతుండటంతో ఆస్పత్రికి తరలించే క్రమంలో మంగళవారం ఆయన మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. రోహిత్ తల్లి సాధారణ చెకప్‌ల నిమిత్తం ఆస్పత్రికి వెళ్లిన క్రమంలో రోహిత్ ఆకస్మికంగా అనారోగ్యానికి గురికావడంతో నౌకర్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో డిఫెన్స్ కాలనీ ఏరియాలోని తన నివాసం నుంచి సాకేత్‌లోని మ్యాక్స్ ఆస్పత్రికి తరలించేసరికే ఆయన మరణించారని తెలిపారు. రోహిత్ ఆకస్మిక మృతికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.
కాగా నారాయణ దత్ తివారీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా వ్యవహరించిన సమయంలో ఆయనపై లైంగిక ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. రాజ్‌భవన్‌లోనే తివారీ మహిళలతో రాసలీలలు సాగించారన్న వార్తలు కలకలంరేపడంతో ఆయన పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఇక 2008లో తివారీ తనకు జన్మనిచ్చిన తండ్రి అంటూ రోహిత్ శేఖర్ తివారీ పితృత్వ దావా దాఖలు చేశారు. కోర్టు డీఎన్‌ఏ పరీక్షలకు ఆదేశించగా రోహిత్ తివారీ కుమారుడేనని 2012 జులై 27న ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పు నేపథ్యంలో 2014 మార్చి 3న రోహిత్ శేఖర్‌ను తివారీ తన కుమారుడిగా అంగీకరించారు. 2014 మే 14న శేఖర్ తల్లి ఉజ్వలా తివారీని వివాహం చేసుకున్నారు. దీర్ఘకాలంలో కాంగ్రెస్‌లో కొనసాగిన తివారీ ఆశీస్సులతోనే 2017, జనవరి 18న ఆయన రోహిత్ శేఖర్ తివారీ బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment