
సాక్షి, చెన్నై: ప్రసవ సమయంలో వైద్యులు చేసిన తప్పిదం మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. చికిత్స చేసిన వైద్యులు కడుపులో సూదిని వదిలేశారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. రామనాథపురం జిల్లా ఉచ్చిపల్లికి చెందిన కార్తిక్ కట్టడ నిర్మాణ కార్మికుడు. అతని భార్య రమ్య (21). గర్భిణిగా ఉన్న ఆమెకు గత 19న ఉచ్చిపల్లి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ప్రసవం అయ్యింది. తరువాత రమ్యకు కడుపు నొప్పి, రక్త స్రావం ఏర్పడడంతో బంధువులు ఆమెను బుధవారం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ రమ్యకు స్కాన్ చేసి చూడగా కడుపులో సూది ఉన్నట్టు గుర్తించారు. ప్రసవం సమయంలో సూదిని లోపలే ఉంచి కుట్లువేసినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం ఆపరేషన్ కోసం ఆమెను మదురై ఆసుపత్రికి తీసుకెళ్లారు. రమ్యకు శస్త్రచికిత్స మూలంగా సూదిని తొలగించనున్నారు.
ప్రసవ సమయంలో మహిళ కడుపులో సూదిని పెట్టి కుట్లు వేయడాన్ని ఖండిస్తూ ఆమె బంధువులు ఉచ్చిపల్లి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని ఆసుపత్రిని ముట్టడించారు. ప్రసవం చేసిన సమయంలో కుట్లు వేసిన నర్సులు సూదిని లోపల పెట్టడం ఏమిటని మండిపడ్డారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ వీరరాఘవరావు మదురై ఆసుపత్రి డీన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు కారణమైన వైద్యులను, నర్సులను విధుల్లోనుంచి తొలగించారు.
Comments
Please login to add a commentAdd a comment