నెల్లూరు విద్యార్థి అనుమానాస్పద మృతి
- బెనారస్ వర్సిటీలో ఐఐటీ చదువుతున్న జైభీమ్ రాజు
- హాస్టల్ మూడో అంతస్తు నుంచి దూకాడంటున్న స్నేహితులు
- తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వని వర్సిటీ అధికారులు
- హత్యను ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటున్న తల్లిదండ్రులు
నాయుడుపేట టౌన్ (సూళ్లూరుపేట): ఉత్తరప్రదేశ్ వారణాసిలో ఉన్న బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఐఐటీ ద్వితీయ సంవత్సరం (మైనింగ్ ఇంజనీరింగ్) చదువుతున్న నెల్లూరు జిల్లా విద్యార్థి దారా జైభీమ్ రాజు (19) అనుమానాస్పదస్థితిలో మరణించాడు. రాజు ఒంటికి నిప్పంటిం చుకుని కళాశాల హాస్టల్ మూడో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్న ట్లుగా అతడి స్నేహితులు మంగళవారం రాత్రి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అయితే బుధవా రం సాయంత్రం వరకు బెనారస్ ఐఐటీ కళాశాల అధికారుల నుంచి కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం అందకపోవ డం పలు అనుమానాలకు తావిస్తోంది. తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ రాజు తల్లిదండ్రులు విలపిస్తున్నారు.
మార్చిలోనే వచ్చి వెళ్లాడు..
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని గిండివారితోటకు చెందిన దారా వెంకటకృష్ణయ్య రైల్వే టీసీ. ఆయన కుమారుడు జైభీమ్ రాజుకు ఇంటర్‌లో మంచి ర్యాంక్ రావడంతో రెండేళ్ల క్రితం బెనారస్ హిందూ యూనివర్సిటీ ఐఐటీ కళాశాలలో చేరాడు. ప్రతిరోజు క్రమం తప్ప కుండా తల్లి భాగ్యమ్మతో మాట్లాడుతుండే వాడు. మార్చిలో సెలవులు ఇవ్వడంతో 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు సొంతూరిలో ఉండి వెళ్లాడు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం నుంచి జైభీమ్ ఫోన్ చేయకపోవ డంతో తల్లి భాగ్యమ్మ రెండు, మూడుసార్లు అతనికి ఫోన్ చేసినా ఎవరూ తీయలేదు. దీంతో ఆందోళనకు గురైన ఆమె అతడి స్నేహితులకు ఫోన్ చేయగా ఏదేదో చెబుతూ వచ్చారు. రాత్రి 9 గంటల సమయంలో జైభీమ్ రాజు శరీరానికి నిప్పంటించుకుని హాస్టల్ మూడో అంతస్తు నుంచి కిందకి దూకేశాడని, ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు స్నేహితులు సమాచారం అందించారు.
తమ కుమారుడిని ఎవరో హత్య చేసి తగులబెట్టి మిద్దెపై నుంచి పడేసి ఉండొచ్చునని మృతుని తండ్రి వెంకటకృష్ణయ్య విలేకరుల ఎదుట ఆరోపించారు. బుధవారం మధ్యాహ్నం బంధువులతో కలసి ఆ మేరకు స్థానిక సీఐ రత్తయ్య, ఎస్సై మారుతీకృష్ణలకు ఫిర్యాదు చేశారు. కళాశాల హెచ్‌ఓడీ సంజయ్‌శర్మతో సీఐ ఫోన్లో మాట్లాడగా.. మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో జైభీమ్ రాజు సెల్‌కు ఒక ఫోన్ రాగా కోపంగా మాట్లా డటం అక్కడి విద్యార్థులు గమనించారని ఆయన చెప్పారు.
తర్వాత రాత్రి 8 గంటల ప్రాంతంలో రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పారు. అంతకుముందు హాస్టల్ వార్డెన్ తరంగ్‌కు ఫోన్ చేసి మాట్లాడగా అతను.. కళాశాల వద్ద ఏమి జరిగిందో తెలియదని విద్యార్థులను అడిగి చెబుతాననడం గమనా ర్హం. దీంతో జిల్లా ఎస్పీతో మాట్లాడి అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకునేలా చర్యలు చేపడతామని స్థానిక పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో రాజు కుటుంబసభ్యులు బుధవారం వారణాసికి బయలుదేరి వెళ్లారు.