
మరుభూమిలా మారిన దర్హారా
దర్హారా టవర్.. కఠ్మాండు నడిబొడ్డున ఠీవీగా తలెత్తుకొని కనిపించే రెండు శతాబ్దాల చరిత్ర గల ఈ చారిత్రక కట్టడం మరుభూమిలా మారిపోయింది. భూకంపంలో పూర్తిగా నేలమట్టమైంది. తొమ్మిది అంతస్తుల ఈ టవర్ శిథిలాల కింద 200 మందికిపైగా మంది సమాధి అయ్యారు. ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించిన దర్బార్ స్క్వేర్ కూడా తీవ్రంగా దెబ్బతింది.
కూలిన చరిత్ర
రాజరిక నేపాల్‌లో రాణి లలిత త్రిపుర సుందరి ఆదేశాల మేరకు 1832లో అప్పటి ప్రధానమంత్రి భీమ్‌సేన్ తపా ఆధ్వర్యంలో దీని నిర్మాణం జరిగింది. మిలటరీ అవసరాల కోసం, పరిసరాలపై నిఘా ఉంచడానికి ఈ శిఖరం లాంటి నిర్మాణం అప్పట్లో ఉపయుక్తంగా ఉండేది. క్రమేణా ఈ భారీ నిర్మాణం ఖాట్మండు నగరానికే ఒక ప్రధాన ఆకర్షణగా మారింది. ఆర్కిటెక్చర్ ఆఫ్ ఖాట్మండులో భాగంగా భీమ్‌సేన్ టవర్స్‌కు యూనె స్కో గుర్తింపు కూడా లభించింది. దీన్ని స్థానికంగా ధారహరగా వ్యవహరిస్తారు. అయితే, దీని నిర్మాణం పూర్తి అయిన రెండు సంవత్సరాల్లోనే ఈ ప్రాంతాన్ని భూకంపం వణికించింది. అయినా ఎన్నో భూకంపాలను తట్టుకొని నిలిచింది. కానీ 1934లో సంభవించిన మరో భూకంపంలో ఈ టవర్ దెబ్బతింది. దీన్ని అప్పటి పాలకుడు ధారహర మరమ్మతు చేయించారు. అప్పటి నుంచి ‘ధారహర’గా వ్యవహరించడం మొదలైంది. గత 80 సంవత్సరాల్లో ఏనాడూ ఎరగనంత తీవ్ర స్థాయి తాజా భూకంపంతో ఈ చారిత్రక భవనం పూర్తిగా ధ్వంసం అయినట్టే. ఇంత పెద్ద నిర్మాణం ఒక్కసారిగా కూలడంతో రేగిన దుమ్మూధూళీ ఖాట్మండు నగరాన్ని దట్టంగా ఆవరించింది.
దర్బార్ స్క్వేర్.. ధ్వంసం
కఠ్మాండులోని నేపాల్ పాత రాజభవనం ముందు నిర్మించిన పురాతన ప్లాజా ఇది. కఠ్మాండు దర్బార్ స్క్వేర్‌గా పిలుస్తారు. కఠ్మాండు వ్యాలీలోని మూడు దర్బార్ (రాజ భవనం) స్క్వేర్‌లలో ఇదీ ఒకటి. మల్లా, షా రాజుల హయాంలో మూడో శతాబ్దిలో నిర్మించిన ఈ మూడు దర్బార్ స్క్వేర్‌లనూ యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాలుగా గుర్తించింది. శనివారం నాటి భూకంపంలో కఠ్మాండు దర్బార్ స్క్వేర్ పూర్తిగా ధ్వంసం అయింది.