అసలు గుర్తింపే ప్రశ్నార్థకం...! | New Angle Found In Women Trafficking | Sakshi
Sakshi News home page

అసలు గుర్తింపే ప్రశ్నార్థకం...!

Published Mon, Mar 12 2018 3:51 AM | Last Updated on Mon, Mar 12 2018 10:09 AM

New Angle Found In Women Trafficking - Sakshi

మనుషుల అక్రమ రవాణా పద్ధతుల్లో మార్పులు పెనుసవాల్‌గా పరిణమిస్తున్నాయి. మహిళలు ముఖ్యంగా చిన్నపిల్లల అక్రమ రవాణా సమస్య తీవ్ర రూపం దాల్చుతోంది. అక్రమ విధానాల్లో ఇది ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగిపోతుండడంతో కలకలాన్ని రేపుతోంది.   స్త్రీలు, అమ్మాయిలను మాయమాటలు, తప్పుడు వాగ్దానాలతో మోసం చేసి ఇతరదేశాలకు తరలిస్తున్న అక్రమార్కులు కొత్త కొత్త పద్ధతులు అనుసరిస్తున్నారు. ఈ విధంగా తరలిస్తున్న వారి ప్రాథమిక గుర్తింపు, జాతీయత అనేవి కూడా తుడిచిపెట్టుకు పోయేలా చివరకు భారత్‌ పౌరులుగా వారి గుర్తింపు, మనుగడే ప్రశ్నార్థకంగా మారేలా చేస్తున్నారు.

గప్‌చుప్‌గా దాటించేస్తున్నారు..
దేశంలో ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఇలాంటివి ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి.  విదేశాల్లో మంచి జీతమొచ్చే ఉద్యోగం ఉందంటూ స్థానిక ఏజెంట్లు నమ్మించి మహిళలు, అమ్మాయిలను ఇతర దేశాలకు తీసుకెళుతున్నారు. చైనా, థాయ్‌లాండ్, సింగపూర్, మయన్మార్‌ తదితర దేశాల్లో ఇళ్లల్లో  పనిమనిషిగా లేదా చిన్న పిల్లల సంరక్షణ వంటి పనులు చేసే వారికి డిమాండ్‌ ఉందని, ఆహారంతో పాటు వసతి కల్పిస్తాంటూ మంచి జీతాన్ని ఎరగా చూపుతున్నారు.   స్థానికంగా అంతగా ఉపాధి అవకాశాలు లేని కారణంగా  ఈ మోసపు మాటల పట్ల అమ్మాయిలు ఆకర్షితులవుతున్నారు. ముందుగా ఈ ప్రాంతాల నుంచి వారిని మయన్మార్‌కు తీసుకెళుతున్నారు. మిజోరం బాలికలను సరిహద్దులోని మయన్మార్‌ గ్రామానికి, మణిపూర్‌కు చెందిన వారిని మరో పట్టణానికి తరలిస్తున్నారు. వీరిని అతి సులభంగా ద్విచక్రవాహనాలపై సరిహద్దు దాటించేస్తున్నారు.

మారుపేర్లతో మయన్మార్‌ పాస్‌పోర్టులు...
భారత్, మయన్మార్, గమ్యస్థాన దేశం ఇలా మూడు అంచెల్లో ఈ ఏజెంట్ల నెట్‌వర్క్‌ వ్యవస్థ పనిచేస్తోంది. వారు అక్కడకు చేరుకోగానే ఆధార్‌కార్డు, మొబైల్‌ ఫోన్లు, ఇతర డాక్యుమెంట్లను ఏజెంట్లు తీసేసుకుంటున్నారు. యాంగాన్, తదితర చోట్లకు చేరాక ఈ అమ్మాయిలను వారి రూపురేఖల ఆధారంగా విభజిస్తున్నారు. అందంగా ఉన్న వారిని బ్యూటీపార్లర్‌లలో, ఇతరులను ఇళ్ల పనుల్లో శిక్షణ నిచ్చి అక్కడి నుంచి మరో దేశానికి పంపించే ఏర్పాట్లు చేశారు. సింగపూర్, థాయ్‌లాండ్‌లకు వెళ్లేందుకు వీలుగా బర్మా భాషలో వారికి శిక్షణనిచ్చి వారికి మారుపేర్లతో  మయన్మార్‌ పాస్‌పోర్టులు సిద్ధంచేస్తున్నారు. మరో దేశానికి చేరిన వెంటనే ఏజెంట్లు వారి పాస్‌పోర్టులు సైతం లాగేసుకుంటున్నారు.  బాధితులు ఎక్కడున్నారు, ఏమి చేస్తున్నారనే విషయాన్ని కనుక్కోవడం కూడా వారి కుటుంబసభ్యులకు అసాధ్యంగా మారుతోంది.

ఈ నేపథ్యంలో మిస్సింగ్‌ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఈ విధంగా తీసుకెళుతున్న మహిళలు లేదా బాలికల్లో అధికశాతం మందిని ఇతర దేశాలకు అక్రమంగా రవాణా చేస్తున్న ఉదంతాలు పెరుగుతున్నాయి. అయినా బాధితులు తమ గుర్తింపును కోల్పోయి, కొత్త పేర్లతో చెలామణి అవుతుండడంతో అధికారులు దానిని కనిపెట్టడం కష్టసాధ్యంగా మారుతోంది. ఈ విధంగా మిజోరం నుంచి సింగపూర్‌కు వెళ్లిన 17 ఏళ్ల మెర్సీ ఆత్మహత్యకు పాల్పడితే, ఆమె భౌతికకాయాన్ని భారత్‌కు తీసుకురాలేక పోయారు. ఆమె తల్లితండ్రులు కూడా పేదవారు కావడంతో అక్కడకు వెళ్లేందుకు డబ్బులతో పాటు పాస్‌పోర్టు లేక కనీసం చివరిచూపు కూడా దక్కించుకోలేకపోయారు. మెర్సీ మయన్మార్‌ పాస్‌పోర్టుపై అక్కడకు వెళ్లినట్టు అప్పుడే బయటపడింది.
–సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement