కొత్త కారు కొంటారా.. టోల్ కోసం ఆగక్కర్లేదు!
కొత్తగా కారు కొనేటట్లయితే అలాంటి కార్లను టోల్ గేట్ల వద్ద ఆపాల్సిన అవసరం లేదు.
కారులో దూర ప్రయాణం చేయాలంటే అంతా బాగానే ఉంటుంది గానీ, టోల్‌గేట్ల వద్ద భారీగా నిలిచిపోయే వాహనాలను చూస్తేనే నీరసం వస్తుంది. ఒక్కో వాహనం కదిలేవరకు ఆగి.. చివరగా మన వంతు వచ్చాక అప్పుడు వెళ్లి, చిల్లర ఎంతుందో చూసుకుని కట్టాలి. అప్పుడు మాత్రమే అక్కడ గేటు తెరుచుకుని, మనం ముందుకు వెళ్లడానికి వీలవుతుంది. ఇలాంటి కష్టాలన్నీ త్వరలోనే తీరిపోతున్నాయి. మీరు కొత్తగా కారు కొనేటట్లయితే అలాంటి కార్లను టోల్ గేట్ల వద్ద ఆపాల్సిన అవసరం లేదు. ఎంచక్కా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోవడమే. అలాగని మనం ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదని అనుకోవద్దు. ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే మొత్తం చెల్లింపు అంతా అయిపోతుంది. అందుకోసం కొత్తగా వస్తున్న కార్లకు డిజిటల్ ఐడెంటిటీ ట్యాగ్ తప్పనిసరిగా అమర్చాలని కేంద్ర ప్రభుత్వం వాహన తయారీ సంస్థలను ఆదేశించింది. చాలా దేశాల్లో ఇప్పటికే అమలులో ఉన్న ఈ విధానాన్ని మన దేశంలో కూడా అమలు చేయాలని చెప్పింది.
పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత వీలైనంత వరకు నగదు రహితంగా చెల్లింపులు ఉండాలని, డిజిటల్ మార్గం అయితేనే మంచిదని చెబుతున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ లక్ష్యాలకు అనుగుణంగా ఉండటంతో పాటు.. టోల్ ప్లాజాల వద్ద భారీ క్యూలైన్లను నివారించేందుకు వీలుగా ఈ టెక్నాలజీని అమలుచేయాలని కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వశాఖ వాహన కంపెనీలకు సూచించింది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) ట్యాగ్‌లను అమర్చడం ద్వారా కార్లు టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం లేకుండా చూసుకోవచ్చని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ అన్నారు.
ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్‌లు అమర్చిన కార్లు వస్తుంటే.. టోల్ ప్లాజాల వద్ద ఉండే రీడర్లు వాటిని ముందుగానే గుర్తిస్తాయి. అప్పుడు ప్రీపెయిడ్ విధానంలో ఆ కారు యజమాని ముందుగా జమచేసిన మొత్తం లోంచి ఆ టోల్‌గేటుకు ఎంత కట్టాలో ఆ మొత్తం కట్ అవుతుంది. దాంతో.. ఇక కారు ఆగాల్సిన అవసరం లేకుండానే గేటు తెరుచుకుంటుంది. మనం ప్రయాణించే దూరాలను బట్టి ఎప్పటికప్పుడు ఆ మొత్తాన్ని రీచార్జి చేసుకుంటే సరిపోతుంది.