కొత్త కోడలి వినూత్న పోరాటం
బీహార్‌లోని బేగుసరాయి జిల్లాలో పెళ్లి వాయిద్యాల మధ్య అత్తారింటికి కొత్త కోడలి బారాత్ బయల్దేరింది. పిల్లల కేరింతల మధ్య ముత్తయిదువులు తోడు రాగా పెళ్లిదుస్తుల్లో ముస్తాబైన ప్రీతి కుమారి పెళ్లి పాటలకు అనుగుణంగా డాన్సు చేస్తూ రాగా మరీ ముందుకు సాగింది. అలా ఆ బారాత్ మక్దూంపూర్ గ్రామంలోని పెళ్లి కొడుకు ఇంటి వరకు వెళ్లింది. కొత్త కోడలిని మంగళ హారతులతో ఇంట్లోకి ఆహ్వానించేందుకు అత్తారింటి నుంచి ఎవరూ బయటకు రాలేదు. పైగా లోపలి నుంచి తలుపులు గడియ పెట్టుకొని 'నువ్వు మా కోడలివి కాదు. ఇక్కడి నుంచి వెళ్లిపో' అంటూ చీత్కారాలు, ఈసడింపులు వినిపించాయి. పెళ్లి కూతురు ప్రీతి కుమారి తన అత్తారింటి ముందున్న చెట్టు కింద కూర్చొని వినూత్న పోరాటం ప్రారంభించారు.
ఇరుగుపొరుగు వారు ఓ మంచం తెచ్చి పెళ్లి కూతురుకి తమవంతు సాయం చేశారు. అత్తారింటిలోకి తనను అనుమతించే వరకు తన పోరాటం సాగుతుందని, చావనైనా చస్తానుగానీ పుట్టింటికి తిరిగి వేళ్లనంటూ ఆమె భీష్మించుకు కూర్చుంది. శనివారం ప్రారంభమైన ఆమె పోరాటం మంగళవారం కూడా కొనసాగింది. ఇంత జరుగుతున్నా పెళ్లి కొడుకు ధీరజ్ ఠాకూర్ జాడ మాత్రం కనిపించలేదు.
వాస్తవానికి ఇదే జిల్లాలోని భరౌల్ గ్రామానికి చెందిన ప్రీతి కుమారికి, ఓ ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న ధీరజ్ ఠాకూర్‌కు గత ఏడాది ఏప్రిల్ నెలలోనే పెళ్లి జరిగింది. సంప్రదాయ కుటంబమైన ఠాకూర్ తల్లిదండ్రులు ఈ పెళ్లిని అంగీకరించలేదు. పైగా తమ కుమారుడిని కిడ్నాప్ చేసి మరీ పెళ్లి చేశారంటూ పెళ్లికూతురు తల్లిదండ్రులపై కేసు కూడా పెట్టారు. మేజరైన పెళ్లి కొడుకు తన ఇష్టప్రకారమే పెళ్లి చేసుకున్నాడని తెలిసి పోలీసులు అంతటితో కేసును వదిలేశారు. అయితే పెళ్లి కూతురుతో కాపురం పెట్టకుండా పెళ్లికొడుకు తల్లి దండ్రులు అతన్ని కట్టడి చేశారు. దాంతో ఏడాది కాలంగా పుట్టింట్లోనే ఉండిపోయిన ప్రీతి ఎలాగైనా అత్తారింటిలో అడుగు పెట్టేందుకు ఈ వినూత్న ఆందోళన చేపట్టారు. ఈ విషయం తెలిసిన సామాజిక కార్యకర్తలు, మహిళా హక్కుల కార్యకర్తలు రంగప్రవేశం చేసి పెళ్లికొడుకు తల్లిదండ్రులను ఒప్పించేందుకు శతవిధాల ప్రయత్నించారు. తమ బొందిలో ప్రాణం ఉండగా ధీరజ్‌కు జరిగిన పెళ్లిని అనుమతించే ప్రసక్తే లేదని ఆతని తల్లిదండ్రులు మొండికేస్తున్నారు. కట్నం కింద ఐదు లక్షల రూపాయలతోపాటు సంప్రదాయబద్దంగా కానుకలు చెల్లించాలని వారు కోరుతున్నట్లు ప్రీతి కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఇప్పటివరకు ఆ రెండు కుటుంబాల మధ్య రాజీ కుదరలేదు.