జమ్మూకశ్మీర్‌కు ఎన్‌ఐఏ బృందం | NIA team to jammukasmir | Sakshi
Sakshi News home page

జమ్మూకశ్మీర్‌కు ఎన్‌ఐఏ బృందం

Published Wed, Jan 13 2016 12:58 AM | Last Updated on Sun, Sep 3 2017 3:33 PM

జమ్మూకశ్మీర్‌కు ఎన్‌ఐఏ బృందం

జమ్మూకశ్మీర్‌కు ఎన్‌ఐఏ బృందం

పఠాన్‌కోట్ దాడులపై దర్యాప్తు ముమ్మరం
♦ కతువా, సాంబా ప్రాంతాలను సందర్శించిన అధికారులు
♦ రెండోరోజూ సల్వీందర్ విచారణ
 
 న్యూఢిల్లీ/నోయిడా: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంలో ఉగ్రవాదుల దాడిపై దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మరింత విస్తృతం చేసింది. గత ఏడాది ఉగ్రవాదులు జమ్మూకశ్మీర్‌లోని కతువా, సాంబా జిల్లాల్లో సైనిక, పోలీసు శిబిరాలపై దాడులకు పాల్పడిన నేపథ్యంలో ఏవైనా ఆనవాళ్లు దొరుకుతాయనే ఉద్దేశంతో ఎన్‌ఐఏ బృందాలు ఆయా ప్రాంతాలను సందర్శించాయి. దాడులకు సంబంధించిన సారూప్యతలు, ఆపరేషన్ నిర్వహణ తీరుతెన్నులను కనుగొనేందుకు మంగళవారం అక్కడికెళ్లినట్లు ఎన్‌ఐఏ వర్గాలు తెలిపాయి. గత మార్చి 21న ఉగ్రవాదులు జమ్మూ-పఠాన్‌కోట్ హైవేలోని సాంబా సైనిక శిబిరంపై తుపాకులతో కాల్పులు జరిపారు.

అలాగే అంతకుముందు రోజు కతువాలోని రాజ్‌బాగ్ పోలీస్ స్టేషన్‌పై ముష్కరులు దాడి చేశారు. సాంబాలో ఆర్మీ క్యాంప్‌పై దాడులకు పాల్పడిన ఉగ్రముఠా భద్రతా బలగాలతో ఎక్కువసేపు పోరాడే ఉద్దేశంతో సరిపడా ఆహారం, ఇతరాలను వెంట తెచ్చుకున్నట్లు ఆ వర్గాలు చెప్పాయి. పఠాన్‌కోట్  ఎయిర్‌బేస్‌కి కవరేజ్ అందిస్తున్న మూడు సెల్‌ఫోన్ టవర్ల నుంచి వెళ్లిన కాల్స్ వివరాలివ్వాలని  ఎన్‌ఐఏ ఆయా కంపెనీలను కోరింది.

 పొంతనలేని సమాధానాలు.. గే పఠాన్‌కోట్‌లో దాడులకు ముందు ఉగ్రవాదులు కిడ్నాప్ చేసినట్లు భావిస్తున్న పంజాబ్ పోలీస్ అధికారి సల్విందర్ సింగ్‌ను ప్రధాన కార్యాలయంలో ఎన్‌ఐఏ వరుసగా రెండోరోజూ విచారించింది. సింగ్ పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని ఆయా వర్గాలు చెప్పాయి. దాడులకు ముందు పంజ్ పీర్ దర్గా నుంచి వస్తుండగా తనను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారని సింగ్ చెప్పిన మేరకు ఎన్‌ఐఏ.. ఆ దర్గా ఇన్‌చార్జి సోమ్‌రాజ్‌కు సమన్లు జారీచేసింది. ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడినట్లు భావిస్తున్న బమియాల్ గ్రామానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఈ దర్గా ఉంది. ఈ దర్గాకు తాను నిత్యం వెళ్తుంటానని సల్విందర్ సింగ్ చెప్పగా, దాడులకు ముందే మొదటిసారి సింగ్ దర్గాకు వచ్చినట్లు సోమ్‌రాజ్ చెప్పారు. అదేరోజు ఎస్పీ స్నేహితుడు రాజేశ్ వర్మ, వంటమనిషి మదన్‌గోపాల్ రెండుసార్లు దర్గా వద్దకు వచ్చారన్నారు. బుధవారం విచారణకు హాజరుకావాలని ఎన్‌ఐఏ మదన్‌గోపాల్‌కు సమన్లు ఇచ్చింది. అవసరమైతే సల్విందర్‌ను, మదన్‌గోపాల్‌ను కలిపి ప్రశ్నిస్తారని సమాచారం.

 పాక్‌ను నమ్మకుండా ఉండలేం: రాజ్‌నాథ్
 పఠాన్‌కోట్ దాడిపై భారత్ ఇచ్చిన సమాచారం మేరకు పాక్ చర్యలు తీసుకుంటుందన్న విశ్వాసముందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చెప్పారు. పాక్ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటామని చెప్పిందని, వారిని నమ్మకుండా ఉండేందుకు ఏ ఒక్క కారణమూ కనిపించలేదని నోయిడాలో అన్నారు.

 సస్పెన్స్‌లో భారత్, పాక్ చర్చలు
 భారత్, పాక్ విదేశాంగ శాఖ కార్యదర్శుల చర్చలపై అనిశ్చితి తొలగలేదు. ఇస్లామాబాద్‌లో ఈ చర్చలు ఈ శుక్రవారం(జనవరి 15) నుంచి ప్రారంభం కానుండగా.. పఠాన్‌కోట్ దాడి నేపథ్యంలో.. భారత్ పునరాలోచనలో పడింది. ఈ విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
 
 రూ. 20 ఇస్తే చాలు.. లోపలకు వెళ్లొచ్చు!

 ఉగ్రవాదులు దాడిచేసిన పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరానికి సంబంధించిన భద్రతాపరమైన లొసుగులు వెల్లడయ్యాయి. యుద్ధ విమానాలు, హెలికాప్లర్లుండే రక్షణపరంగా కీలకమైన పఠాన్‌కోట్ వైమానిక స్థావరంలోకి స్థానికులు యథేచ్ఛగా వెళ్లేవారని, అక్కడి భద్రతా సిబ్బందికి కేవలం రూ. 20 ఇచ్చి తమ పశువులను అదే ప్రాంగణంలో మేపుకునేవారని తేలింది. అక్కడి సెక్యూరిటీ సహకారంతో మిలటరీ క్యాంటీన్‌లో షాపింగ్ కూడా చేసేవారని కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు అందించిన నివేదికలో నిఘా వర్గాలు పేర్కొన్నాయి. వైమానిక స్థావరంలోకి ఇబ్బందులు లేకుండా వెళ్లేందుకు, అక్కడి దుకాణాల్లో షాపింగ్ చేసేందుకు కొందరు గుర్తింపు పత్రాలను సైతం రూపొందించుకున్నట్లు తేలిందన్నాయి. ఎయిర్ బేస్ చుట్టుపక్కల గుజ్జర్లు  నివసిస్తున్నారని, తమ పశువులను మేపుకునేందుకు వైమానిక స్థావరంలోని విశాల ఆవరణం అనుకూలంగా ఉంటుందన్న ఉద్దేశంతో వారు భద్రతా సిబ్బందికి లంచం ఇచ్చి పశువులతో సహా లోపలకు వెళ్లేవారని తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement