సాక్షి, న్యూఢిల్లీ : ఐదేళ్ల క్రితం దేశ రాజధాని వీధుల్లో సైకోథెరపీ చదువుతున్న యువతి హత్యాచార ఘటన ‘నిర్భయ ఉదంతం’గా సంచనలం రేపిన విషయం తెలిసిందే. నిందితులను శిక్షించాలంటూ దేశ యువత మొత్తం నగరం నడిబొడ్డుకు చేరి చేపట్టిన ఆందోళన ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. తన కంటతడి మరే తల్లికీ రావొద్దని.. ఈ మేరకు కఠిన చట్టాల రూపకల్పన కోసం జరుగుతున్న ఉద్యమాల్లో నిర్భయ తల్లి ఆశాదేవి పాలు పంచుకున్నారు.
అయితే ఆమె ఇప్పుడు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అందుకు ఓ ప్రత్యేక కారణం ఉందని ఆమె అంటున్నారు. ఆశా దేవి తనయుడు(23) ప్రస్తుతం భారత నావికా దళానికి ఎంపికయ్యాడు. అందుకు రాహుల్ అందించిన ప్రోత్సాహమే కారణమంట. ‘‘సోదరి మరణం అనంతరం నా కొడుకు కుంగిపోయాడు. చదువుల మీద దృష్టిసారించలేకపోయాడు. ఆ సమయంలో ఆయన(రాహుల్) ఫోన్ చేసి మాట్లాడారు. సాధించాల్సింది ఎంతో ఉందంటూ నా కుమారుడిని ప్రేరేపించారు’’ అని ఆమె చెప్పారు.
2013లో సీబీఎస్‌సీ పరీక్షలు అయిపోగానే రాయ్ బరేలీ(రాహుల్ నియోజకవర్గం)లోని ఇందిరా గాంధీ రాష్ట్రీయ అర్బన్ అకాడమీలో అతనికి సీటు దక్కింది. దీంతో ఆ కుటుంబం మొత్తం అక్కడికి మకాం మార్చింది. ఆ సమయంలో ఆర్మీ ప్రవేశ పరీక్షలకు సిద్ధమైన ఆ కుర్రాడు.. అది కష్టతరమని భావించాడు. ఆ సమయంలో రాహుల్ సూచన మేరకు పైలెట్ ట్రెయినింగ్ కోర్సులో చేరి లక్ష్యాన్ని సాధించగలిగాడు. దాదాపు ప్రతీ రోజూ రాహుల్ మాట్లాడి చదువు గురించి ఆరా తీసేవాడంట. జీవితంలో వెనకడుగు వెయొద్దని.. ముందుకు సాగాలిని చెప్పేవాడంట. మొత్తానికి ట్రైనింగ్ విజయవంతంగా పూర్తి చేసుకున్న అతగాడికి ఇప్పుడు గుర్‌గ్రామ్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో చోటు దక్కింది. తమ కుమారుడు ఇప్పుడు ఈ స్థాయికి చేరాడంటే.. అందుకు రాహుల్ అందించిన ప్రోత్సాహమే కారణమని ఆశాదేవి చెబుతున్నారు.
రాహుల్ మాత్రమే కాదు.. ఆయన సోదరి ప్రియాంక కూడా తమకు తరచూ ఫోన్ చేసి ఆరోగ్యం గురించి వాకబు చేసేదని ఆశాదేవి తెలిపారు. నిర్భయ తండ్రి ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో ఉద్యోగం చేస్తుండగా, వారి చిన్న తనయుడు పుణేలో ఇంజనీరింగ్ చేస్తున్నాడు.
తీహార్ జైలుకు నోటీసులు...
నిర్భయ ఘటనలో దోషులను ఉరి తీయాలని సుప్రీం కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. తీర్పు వెలువడి ఐదు నెలలు గడుస్తున్నా జైలు అధికారుల నుంచి ఎలాంటి చర్యలు లేకపోవటంతో ఆశా దేవీ ఢిల్లీ మహిళా కమిషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో మహిళా సంఘం జైలు అధికారులకు నోటీసులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment