న్యూఢిల్లీ/తేజ్‌పూర్: నమస్తే! అంటూ సరిహద్దుల్లో చైనా సైనికుల్ని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ పలకరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శనివారం సిక్కింలోని నాథులా సరిహద్దును ఆమె సందర్శించినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రతిగా చైనా సైనికులు కూడా నవ్వుతూ నమస్తే చేశారు. ‘నమస్తే అంటే అర్థం తెలుసా’ అని సీతారామన్ చైనా సైనికుల్ని ప్రశ్నించగా వారు కొంత అయోమయంగా ముఖం పెట్టారు. సాయపడేందుకు భారత సైనికులు ముందుకు రాగా రక్షణ మంత్రి వారిస్తూ.. వారినే సొంతంగా అర్థం చెప్పనివ్వండి అని సూచించారు.
కొద్దిసేపటి అనంతరం ఒక చైనా సైనికుడు నవ్వుతూ.. ‘నమస్తే అంటే మిమ్మల్ని కలిసినందుకు ఆనందంగా ఉందని అర్థం’ అని చెప్పాడు. నమస్తేను మీ భాషలో ఏమంటారు? అని సీతారామన్ ప్రశ్నించగా.. ‘ని హావ్’ అంటూ చైనా సైనికులు సమాధానమిచ్చారు. ఈ వీడియోను రక్షణ మంత్రిత్వ శాఖ ఆదివారం తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది. మరోవైపు ఆదివారం అస్సాంలోని తేజ్‌పూర్ ఎయిర్ బేస్ వద్ద సైనిక సన్నద్ధతపై సీనియర్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అధికారులతో సీతారామన్ సమీక్షించారు. సుఖోయ్ యుద్ధ విమానాల సన్నద్ధత, ఇతర అంశాలపై మంత్రి సమీక్షించారని రక్షణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment