Nathula
-
నమస్తేను చైనీస్‌లో ఏమంటారు?
-
నమస్తేను చైనీస్‌లో ఏమంటారు?
న్యూఢిల్లీ/తేజ్‌పూర్: నమస్తే! అంటూ సరిహద్దుల్లో చైనా సైనికుల్ని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ పలకరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శనివారం సిక్కింలోని నాథులా సరిహద్దును ఆమె సందర్శించినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రతిగా చైనా సైనికులు కూడా నవ్వుతూ నమస్తే చేశారు. ‘నమస్తే అంటే అర్థం తెలుసా’ అని సీతారామన్ చైనా సైనికుల్ని ప్రశ్నించగా వారు కొంత అయోమయంగా ముఖం పెట్టారు. సాయపడేందుకు భారత సైనికులు ముందుకు రాగా రక్షణ మంత్రి వారిస్తూ.. వారినే సొంతంగా అర్థం చెప్పనివ్వండి అని సూచించారు. కొద్దిసేపటి అనంతరం ఒక చైనా సైనికుడు నవ్వుతూ.. ‘నమస్తే అంటే మిమ్మల్ని కలిసినందుకు ఆనందంగా ఉందని అర్థం’ అని చెప్పాడు. నమస్తేను మీ భాషలో ఏమంటారు? అని సీతారామన్ ప్రశ్నించగా.. ‘ని హావ్’ అంటూ చైనా సైనికులు సమాధానమిచ్చారు. ఈ వీడియోను రక్షణ మంత్రిత్వ శాఖ ఆదివారం తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది. మరోవైపు ఆదివారం అస్సాంలోని తేజ్‌పూర్ ఎయిర్ బేస్ వద్ద సైనిక సన్నద్ధతపై సీనియర్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అధికారులతో సీతారామన్ సమీక్షించారు. సుఖోయ్ యుద్ధ విమానాల సన్నద్ధత, ఇతర అంశాలపై మంత్రి సమీక్షించారని రక్షణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. -
చైనా సైనికులతో ముచ్చటించిన నిర్మలా
న్యూఢిల్లీ : ‘నమస్తే’ అంటే అర్థం మీకు తెలుసా? అంటూ రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చైనా సైనికులను ప్రశ్నించారు. శనివారం సిక్కిం సరిహద్దులో గల నాథులాలో ఆమె పర్యటించారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) సైనికులతో నిర్మలా మచ్చటించిన వీడియోను రక్షణ శాఖ ట్వీటర్లో పోస్టు చేసింది. చైనా అధికారులను పరిచయం చేసుకునే క్రమంలో వారికి చేతులు జోడించి నమస్కరించారు హోం మంత్రి. మీకు నమస్తే అంటే ఏంటో తెలుసా? అని వారిని ప్రశ్నించారు. గ్రీటింగ్స్ అని భారత సైనికులు చెప్పబోగా.. వారిని వారించి చైనా సైనికులను చెప్పాలని కోరారు. అనంతరం చైనీస్ భాష(మాండరిన్)లో ‘నమస్తే’ పదానికి అర్థం(నిహో) ఏంటని వారిని అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత సైనికులు, మంత్రి పరస్పరం ‘నమస్తే’ చెప్పుకున్నారు. ఈ సందర్భంగా సైనికులకు మంత్రికి మధ్య ట్రాన్స్‌లేటర్‌గా వ్యవహరించిన సైనికాధికారిని నిర్మలా అభినందించారు. తన పేరు వాంగ్ అని చెప్పుకొచ్చిన సైనికాధికారి, తమ భాషలో వాంగ్ అంటే ‘రాజు’ అని అర్థం అని చెప్పారు. అందుకు స్పందించిన నిర్మలా సో మనకు ట్రాన్స్‌లేటర్‌గా కింగ్ ఇక్కడ ఉన్నారన్నమాట అని చమత్కరించారు. డోక్లాంలో చైనా రోడ్డు నిర్మాణం చేపట్టడంతో ఇటీవల ఇరు దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం చైనా డోక్లామ్ నుంచి సైనికులను ఉపసంహరించుకునేందుకు అంగీకారం తెలిపింది. అయితే, డోక్లామ్‌కు 10 కి.మీ. దూరంలోని చుంబీ వ్యాలీలో చైనా మళ్లీ రోడ్డు నిర్మాణం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో.. చైనా సరిహద్దుల్లో రక్షణ మంత్రి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. -
చనిపోయినా సరిహద్దు భద్రత..!
న్యూ ఢిల్లీః మరణించినా ఆ సిపాయి కర్తవ్యం కొనసాగుతూనే ఉంది. భారత సైనిక దళంలో చేరి, హిమాలయపర్వతాల్లోని ఎత్తైన ప్రాంతమైన.. భారత్-చైనా సరిహద్దు నాతుల్లాలో బాధ్యతలను నిర్వహిస్తూ... దురదృష్ట వశాత్తు అతడు ప్రాణాలు కోల్పోయాడు. అయితేనేం ఇప్పటికీ అతని ఆత్మ అక్కడ సరిహద్దు కాపలా బాధ్యతలను చేపడుతున్నట్లు స్థానికులే కాదు... తోటి సైనికులూ నమ్ముతారు. విచిత్రంగా ఉంది కదూ... విదేశీ ఆక్రమణ దారులనుంచి మాతృభూమిని కాపాడటంలో భారత సైనికుల త్యాగం మరువలేనిది. అయితే 1968 లో మృతి చెందిన బాబా హర్బజన్ సింగ్.. ఇప్పటికీ సరిహద్దుల్లో తన బాధ్యతలు ఆత్మ రూపంలో నిర్వహిస్తున్నట్లుగా అంతా విశ్వసిస్తారు. సిక్కింలో భారీ వరదల కారణంగా సైనికులను ఇరత ప్రాంతాలకు తరలించే పనిలో ఉన్న హర్బజన్..వరద బీభత్సానికి దురదృష్ట వశాత్తు నీటిలో కొట్టుకుపోయాడు. మాతృభూమి రక్షణలో భాగంగా విధినిర్వహణలోనే ప్రాణాలు వదిలాడు. తీవ్రమైన ప్రవాహంతో మూడు రోజులుదాకా అతడి శరీరం దొరకలేదు. ఇంతలో క్యాంపులోని ఓ సిపాయికి కలలో కనిపించిన హర్బజన్.. తన శరీరం ఉన్న ప్రాంతాన్ని సూచించాడని, అక్కడే తనకు సమాధి కడితే సరిహద్దులో బాధ్యతలను కొనసాగిస్తానని చెప్పినట్లు కథనం. అయితే సైనికుడి కలలో చెప్పినట్లుగానే చోక్యాచో ప్రాంతంలో హర్బజన్ శరీరం దొరకడంతో స్థానికులే కాక సైనికులూ విషయాన్ని నమ్మారు. అదే ప్రాంతంలో పూర్తి మిలటరీ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించి, సమాధిని కూడా కట్టారు. అతడు చనిపోయినా అక్కడే అతడి ఆత్మ సరిహద్దు భద్రతను కాపాడుతుందంటూ జనం నేటికీ నమ్ముతున్నారు. పంజాబ్ రెజిమెంట్ లోని 23వ బెటాలియన్ కు చెందిన హర్బజన్.. దేశంపై సిపాయిలకుండే ప్రేమను నిరూపించాడు. భారత సరిహద్దు ప్రాంతాల భద్రతను కాపాడే నిజమైన సైనికుడుగా మిగిలిపోయాడు. హర్బజన్ విషయంలో ఆర్మీ కూడా మనోభావాలను, నమ్మకాలను గౌరవించినట్లుగా కనిపిస్తుంది. హర్బజన్ ను హానరరీ కెప్టెన్ గా గుర్తించి, నేటికీ జీతాన్ని ప్రతినెలా హర్బజన్ కుటుంబానికి అందజేస్తుంది. అంతేకాదు అమర సైనికుడి గౌరవార్థం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14 ను సెలవుదినంగా పాటిస్తుంది. కొన్నేళ్ళ క్రితం వరకూ.. (హర్బజన్ అధికారిక విరమణ తేదీ వరకూ) ఆయన వాడిన వస్తువులను ప్యాక్ చేసి, సిపాయిలు.. హర్బజన్ స్వగ్రామానికి తీసుకెళ్ళి తిరిగి తీసుకురావడం నియమంగా పాటించారు. ఇటీవల భారత చైనా సరిహద్దు ప్రాంతమైన నాతుల్లాను సాధారణ పౌరుల సందర్శనా స్థలంగా కూడా మార్చారు. భారత్ చైనా సరిహద్దుల్లో ఇరుదేశాలూ నిర్వహించే శాంతి సమావేశాల్లో చైనా సైనిక అధికారులు హర్బజన్ సింగ్ కోసం ఓ కుర్చీవేసి గౌరవ సూచకంగా దాన్ని ఖాళీగా ఉంచడం కూడా కనిపిస్తుంది. కొందరు స్థానికులు హర్బజన్ సమాధిని దేవాలయంగా భావిస్తారు. తమ ప్రాంతాన్ని దేశాన్ని కాపాడమంటూ ప్రార్థిస్తుంటారు.