ముంబై : కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఓ ఆసక్తికర ప్రతిపాదన చేశారు. దేశ వ్యాప్తంగా యూరిన్‌ని నిల్వ చేసుకోగలిగితే యూరియాను దిగుమతి చేసుకోవాల్సిన పని లేదన్నారు. నాగ్‌పూర్‌లో నిర్వహించిన యువ సృజనాత్మక ఆవిష్కరణల కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గడ్కరీ ఈ ప్రతిపాదన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మనం దేశ ప్రజల మూత్రాన్ని నిల్వ చేసుకోగలిగితే.. విదేశాల నుంచి యూరియాను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా చాలా సొమ్ము ఆదా అవుతోంది. మానవ మూత్రం జీవ ఇంధనంగా ఉపయోగపడుతుంది. అందులో సల్ఫేట్, నైట్రోజన్ ఉంటాయ’ని తెలిపారు.
అంతేకాక ‘విమానాశ్రయాల్లో మూత్రాన్ని నిల్వ చేయమని గతంలోనే నేను కోరాను. కానీ నా ప్రతిపాదనను ఎవరూ అంగీకరించలేదు. కార్పొరేషన్ కూడా నా మాటలు పట్టించుకోలేదు. సనాతన ఆచారాలను పాటించే వారికి నా అద్భుతమైన ఆలోచనలు నచ్చవ’ని గడ్కరీ పేర్కొన్నారు. నూతన ఆవిష్కరణల ప్రాధాన్యం గురించి చెబుతూ.. మానవ వ్యర్థాల నుంచి జీవ ఇంధనాలను ఎలా ఉపయోగించుకోవచ్చో చెప్పడానికి దీన్నో ఉదాహరణగా చెప్పారు గడ్కరీ. ఇదే సమావేశంలో మరో ఉదాహరణ కూడా చెప్పారు. మనిషి వెంట్రుకల నుంచి అమినో యాసిడ్స్ ఉత్పత్తి అవుతాయని.. దాన్ని కూడా ఎరువుగా ఉపయోగించుకోవచ్చు అని తెలిపారు. ఫలితంగా పంట రాబడి మరో 25 శాతం పెరుగుతుందన్నారు. అమినో యాసిడ్స్‌ను మనం విదేశాలకు ఎగుమతి చేస్తున్నామని, 180 కంటైనర్ల జీవ ఎరువులను(బయో ఫెర్టిలైజర్స్) దుబాయ్ నుంచి కొనుగోలు చేస్తున్నామని నితిన్ గడ్కరీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment