
జీతాలు రావు.. జీవితాలకూ దెబ్బే!
పెద్ద నోట్ల రద్దుతో ఇప్పటికీ పనిచేయని 25 శాతం ఏటీఎంలు వాటి మూతతో ఏటీఎం నిర్వహణ సంస్థల నష్టం రూ.600 కోట్లు నగదు సరఫరా చేసే క్యాష్ లాజిస్టిక్ సంస్థల నష్టం రూ.170 కోట్లపైనే ఏటీఎంల తయారీ, వాటితో ముడిపడి ఉన్న సంస్థలన్నీ నష్టాల్లోనే.. చివరికి సెక్యూరిటీ గార్డులనందించే ఏజెన్సీలపైనా ప్రభావం ఏటీఎంల ముందుండే సెక్యూరిటీ గార్డుల వేతనాల్లో కోత నగదు కొరతలో వైట్ లేబుల్ ఏటీఎంలు.. క్యాష్ లాజిస్టిక్ సంస్థల మూత ఈ ఏటీఎం ఆర్థిక వ్యవస్థ డిజిటల్ వైపు మళ్లడం ప్రశ్నార్థకమే!
ఏటీఎం అంటే.. ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్.. మన దృష్టిలోమాత్రం ఎనీ టైమ్ మనీ! కానీ పెద్ద నోట్ల రద్దు తర్వాత చాలా ఏటీఎంలకు అర్థం మారిపోయింది. ఇప్పుడు ఎనీ టైమ్ మూత! అనుకోవాల్సి వస్తోంది. ఎందుకంటే నోట్ల రద్దు నాటి నుంచి ఇప్పటిదాకా డబ్బుల ముఖం చూడని ఏటీఎంలు చాలానే ఉన్నాయి. దేశంలో నగదు వినియోగం తగ్గి డిజిటల్ వైపు మళ్లాలనేది ప్రభుత్వ సంకల్పం. అందుకోసం నగదు తక్కువగా అందుబాటులో ఉండేలా చేసి.. రకరకాల డిజిటల్ పేమెంట్ వ్యవస్థల్ని అందుబాటులోకి తెస్తోంది.
డిజిటల్ వైపు మళ్లితే.. జవాబుదారీతనం పెరుగుతుందని, పన్నుల వసూళ్లు పెరుగుతాయని ప్రభుత్వం చెబుతోంది.... కానీ ఇదంతా నోటుకు ఒకవైపు మాత్రమే. అదే మరోవైపు చూస్తే.. దారుణమైన పరిస్థితి కనిపిస్తోంది. ఏటీఎంలు పనిచేయకుంటే సామాన్యుల జీతాలు చేతికి రావు. ఏటీఎంల చుట్టూ అల్లుకున్న కొన్ని వేల జీవితాలు కూడా ఛిద్రమైపోతున్నాయ్. ఏటీఎంల చుట్టూ ఉన్న ఆర్థిక వ్యవస్థ కొన్ని వేల కోట్లు నష్టపోతోంది. ఆ వ్యవస్థపై ఆధారపడ్డ చిన్నాపెద్దా ఉద్యోగులంతా దిక్కులు చూస్తున్నారు. ఈ చీకటి కోణంపై ఈ వారం ‘ఫోకస్’.. (శ్రీనాథ్ అడెపు, సాక్షి బిజినెస్ బ్యూరో)
చిన్నపిల్లలు కథ చెప్పమని అడగ్గానే.. తల్లిదండ్రులైనా, తాతబామ్మలైనా మొదట చెప్పేది ఏడు చేపల కథే. ఎండలేని చేప వెనుక ఎంత నిర్లక్ష్యపు నెట్‌వర్క్ ఉందో చెప్పడమే ఆ కథ ఉద్దేశం. ఇప్పుడు అదే కథను ఏటీఎంలకు అన్వయిస్తే!? ఎందుకంటే ఎన్నో ఏటీఎంలున్నా చాలా వాటిలో డబ్బుల్లేవు.
కొన్నయితే తెరుచుకోవటమే లేదు. మరి ఏటీఎంకు వెళ్లి.. ఏటీఎం ఏటీఎం ఎందుకు డబ్బులివ్వటం లేదని అడిగితే అది ఏం చెబుతుంది? డబ్బులు లోడ్ చేయకుండా నేనెక్కడిస్తా అంటుంది.. లోడ్ చేసే సంస్థని అడిగితే బ్యాంకులు డబ్బులివ్వందే తామెలా పెడతా మంటాయి. మరి బ్యాంకుల్ని అడిగితే రిజర్వు బ్యాంకువైపు వేలు చూపిస్తాయి.. రిజర్వుబ్యాంకును అడిగితే.. డబ్బులెందుకు? డిజిటల్ లావాదేవీలు చేసుకోవచ్చుగా? అంటుంది. కానీ ఈ గొలుసులో బయటకు కనిపించకుండా దెబ్బతిన్న పాత్రలు చాలానే ఉన్నాయి. అవి జవాబుదారీ కాకపోయినా ప్రభావి తమయ్యాయన్నది మాత్రం పచ్చినిజం.
నష్టాల్లో సంస్థలు
ఈ ఏటీఎం గొలుసులో దెబ్బతిన్న వాటిలో మొదట చెప్పుకోవాల్సింది ఏటీఎం తయారీ సంస్థల గురించి.. తరవాత క్యాష్ లాజిస్టిక్ కంపెనీలు, నిర్వహణ సంస్థలు, ఏటీఎం సెక్యూరిటీ సంస్థల గురించి..! ప్రస్తుతం దేశంలోని 2,07,402 ఏటీఎంలలో 25 శాతం అంటే 51,850 ఏటీఎంలు మూతపడి ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ గొలుసు సంస్థలు రోజుకు రూ.5 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంటున్నాయి.
మూతపడిన ఏటీఎంల సంఖ్య ఇంకా ఎక్కువేనన్నది పరిశ్రమ వర్గాల మాట. ఆ లెక్కన నష్టమూ ఎక్కువే. నవంబర్ 9 నుంచి చూస్తే.. ఇప్పటిదాకా ఏటీఎం నిర్వహణ సంస్థలకు రూ.600 కోట్లు, నగదు సరఫరా చేసే లాజిస్టిక్ సంస్థలకు రూ.170 కోట్ల నష్టం వాటిల్లిందని ఆయా సంస్థలు చెబుతున్నాయి. అంటే రోజుకు రూ.5 కోట్ల చొప్పున మొత్తం రూ.770 కోట్ల నష్టం. ఇక సెక్యూరిటీ సంస్థలు, నిర్వహణ సంస్థల నష్టాన్ని కూడా కలిపితే ఇంకా పెరుగుతుంది.
ఏపీ, తెలంగాణల్లో 17 వేల ఏటీఎంలు
ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశంలో 52 బ్యాంకులు, 2,07,402 ఏటీఎంలున్నాయి. ప్రతి లక్ష మంది జనాభాకు 19.7 ఏటీఎంల చొప్పున అన్న మాట. మహారాష్ట్రలో అత్యధికంగా 24,829 ఏటీఎంలుండగా... తమిళనాట 23,728 ఏటీఎంలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి 17 వేల ఏటీఎంలున్నాయి. ఈ ఏటీఎంలలో అత్యధికం బ్రౌన్ లేబుల్ కాగా.. దీన్నొక వ్యాపారంగా భావించి వైట్‌లేబుల్ ఏటీఎంలు కూడా నాలుగేళ్ల కింద రంగంలోకి దిగాయి.
ప్రైవేటు సంస్థల ‘వైట్ లేబుల్’
ఏ ఏటీఎంపై అయినా దాని బ్యాంకు లోగో ముద్రించి ఉంటుంది. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ.. ఇలా ముద్రించి ఉన్నవన్నీ బ్రౌన్ లేబుల్ ఏటీఎంలే. వైట్ లేబుల్ ఏటీఎంలకు బ్యాంకు లోగోలుండవు. వీటిని పూర్తిగా ప్రైవేట్ కంపెనీలు నిర్వహిస్తుంటాయి. అంటే ఏటీఎం యంత్రాన్ని కొనటం నుంచి సాఫ్ట్‌వేర్, నిర్వహణ, నగదు సరఫరా వరకు అన్ని సేవలూ ప్రైవేట్ సంస్థలే నడిపిస్తాయి. ఈ కంపెనీలకు ఏం లాభమంటే? మనం ఏ బ్యాంకు క్రెడిట్/డెబిట్ కార్డుతో ఆ ఏటీఎంలో లావాదేవీలు నిర్వహిస్తామో ఆ బ్యాంకు వైట్ లేబుల్ సంస్థలకు ఇంటర్‌చేంజ్ చార్జీలను చెల్లిస్తుంది.
⇒ ఇంటర్‌చేంజ్ చార్జీలు నగదు లావాదేవీలకైతే ఒక్కో దానికి రూ.15, నాన్ –క్యాష్ లావాదేవీలకు అంటే ఖాతా వివరాలు, మినీ స్టేట్‌మెంట్, చెక్‌బుక్ రిక్వెస్ట్, పిన్ చేంజ్ వంటి వాటికైతే ఒక్కోదానికి రూ.5 చొప్పున ఉంటాయి.
⇒ టాటా కమ్యూనికేషన్స్ , ఎన్ సీఆర్, ముత్తూట్ ఫైనాన్స్ , హిటాచీ, వక్రంగి, ఏజీఎస్ తదితర 15 కంపెనీలు ఈ రంగంలో సేవలందిస్తున్నాయి.
బ్యాంకులు+ ఔట్‌సోర్సింగ్ = బ్రౌన్ లేబుల్
⇒ బ్యాంకు లోగోలున్నవన్నీ బ్రౌన్ లేబుల్ ఏటీఎంలే. వీటిలో బ్యాంకు ఆవరణలో ఉండేవి ఆన్ సైట్, ఇతర ప్రాంతాల్లో ఉండేవి ఆఫ్‌సైట్ ఏటీఎంలు. ఈ ఏటీఎంలలో చాలావరకూ బ్యాంకులు ఔట్‌సోర్సింగ్‌కే ఇస్తాయి.
⇒ నగదు సరఫరా, ఏటీఎం స్థలాన్ని ఎంపిక చేయటం మాత్రమే బ్యాంకులు చేస్తాయి. వాటిలో విద్యుత్ సరఫరా, స్టేషనరీ, మౌలిక ఏర్పాట్లు, సెక్యూరిటీ గార్డు వంటివన్నీ ప్రైవేట్ సంస్థలే నిర్వహిస్తాయి. ఇందుకు బ్యాంకులు నెలవారీ చార్జీలు చెల్లిస్తాయి.
⇒ ఎన్ సీఆర్, టాటా, హిటాచీ, ఐసీఐసీ ఐ, ధనలక్ష్మి, రత్నా కర్ తదితర సంస్థ లు ఈ నిర్వహణ రంగంలో ఉన్నాయి.
వైట్‌లేబుల్ మూత..బ్యాంకులకూ నష్టమే
బ్యాంకులు తమ ఆదాయంలో 20–25 శాతాన్ని ఏటీఎంలపై ఖర్చు చేస్తుంటాయి. వాటివల్ల బ్యాంకులకు ఆదాయమేమీ రాకపోయినా ఖాతాదారులకు అందుబాటులో ఉండటానికి ఆ ఖర్చు తప్పదు. ఒక్కో ఏటీఎం నిర్వహణకు బ్యాంకుకు నెలకు రూ.50 వేల వరకు ఖర్చవుతోంది. దీన్ని బ్యాంకులు రికవరీ చేయాలంటే ఆయా ఏటీఎం నుంచి నెలకు 5 వేలు లేదా రోజుకు 170 లావాదేవీలు జరగాల్సి ఉంటుంది.
కానీ నోట్ల రద్దు తర్వాత ఈ లావాదేవీల సగటు 120కి పడిపోయినట్లు ఆలిండియా బ్యాంకు ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ చెప్పారు. ‘‘దీంతో బ్యాంకుల ఏటీఎంలూ నష్టాల్లోనే నడుస్తున్నాయి. కానీ బ్యాంకులకు ఇతరత్రా ఆదాయ మార్గాలుంటాయి కనక ఈ వ్యయాన్ని భరిస్తున్నాయి’’ అని పేర్కొన్నారు. ప్రైవేటు సంస్థలు నిర్వహించే వైట్ లేబుల్ ఏటీఎంలు ఈ వ్యయాన్ని భరించలేక.. నగదు కొరతతో ఏటీఎంలను మూసేస్తున్నాయి.
వైట్ లేబుల్ ఏటీఎంల నష్టం రూ.600 కోట్లు
2012లో వైట్ లేబుల్ ఏటీఎంలకు ఆర్‌బీఐ అనుమతిచ్చింది. ప్రస్తుతం ఇవి దేశవ్యాప్తంగా 13,900 దాకా ఉన్నాయి. టాటా కమ్యూనికేషన్స కు 9,060, బీటీఐ పేమెంట్స్‌కు 4,096, హిటాచీ పేమెంట్స్‌కు 652, వక్రంగీకి 328, ముత్తూట్‌కు 207, ఏటీఎస్‌కు 218 ఏటీఎంలు ఉన్నాయి. వాటిలో 45 శాతం గ్రామీణ, ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనే ఉన్నాయి. ప్రస్తుతం అవన్నీ మూతపడి ఉన్నాయి. నోట్ల రద్దు నుంచి ఇప్పటివరకు వైట్ లేబుల్ ఏటీఎంల నిర్వహణ కంపెనీలకు రూ.600 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా.
60 వేల మంది ఉద్యోగుల భవిష్యత్తేంటి?
దేశంలో ఎన్ సీఆర్, ఒర్టెక్స్, ఏసీజీ, క్యాష్ కనెక్ట్, డైబోల్డ్ నిక్స్‌డోర్ఫ్, ఎఫ్‌ఎస్‌ఎస్, టీఎండీ సెక్యూరిటీ, జీఎంవీ వంటి 20కి పైగా కంపెనీలు ఏటీఎంల తయారీలో ఉన్నాయి. ఇవి ఏటీఎం తయారీతో పాటూ సాఫ్ట్‌వేర్, సీఆర్‌ఎం, నగదు నిర్వహణ, నెట్‌వర్క్ మేనేజ్‌మెంట్ వంటి సేవలు కూడా అందిస్తుంటాయి. నవంబర్‌లో పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని ప్రకటన చేయటానికి వారం రోజుల ముందే 18–20 వేల కొత్త ఏటీఎంల తయారీ కోసం వాటికి ఆర్డర్లు వచ్చాయి. కానీ నోట్ల రద్దు తరవాత పరిస్థితి మారిపోయింది. ఉన్న ఏటీఎంలనే తగ్గించుకోవటానికి బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయి. ‘‘ఉన్న ఏటీఎంలకే డబ్బులివ్వలేకపోతున్నాం.
అంతా డిజిటల్‌వైపు మళ్లుతున్న తరుణంలో కొత్త ఏటీఎంలు ఇకపై అవసరం ఉండకపోవచ్చు’’ అని ఓ బ్యాంకు ప్రతినిధి వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని తాము ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) తరఫున ఆర్‌బీఐకి ప్రతిపాదించనున్నట్లు తెలిపారు. దీంతో బ్యాంకులు ఆర్డర్లను వెనక్కి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘‘అలాగని చెప్పలేం. ఈ పరిస్థితి కొద్ది కాలమే ఉంటుంది. మరో 6 నెలల్లో పరిస్థితి సానుకూలంగా మారుతుంది’’ అని హిటాచీ పేమెంట్ సర్వీసెస్ ఎండీ లినోయ్ ఆంటోని ‘సాక్షి’తో చెప్పారు. ప్రస్తుతం దేశంలోని ఏటీఎం తయారీ సంస్థల్లో సుమారు 60 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇప్పుడు వారికి చేతినిండా పనిలేదు. ఏటీఎంల ఆర్డర్లు లేక సతమతమవుతున్న కంపెనీలు ఉద్యోగులకు వేతనాలు చెల్లించటం భారంగా మారుతున్నట్లు ఓ కంపెనీ ప్రతినిధి వ్యాఖ్యానించారు.
సెక్యూరిటీ గార్డుల జీతాలూ తగ్గాయి!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో 800 ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలున్నాయి. వాటిలో నాలుగు లక్షల మంది ఉద్యోగులున్నారు. వీరిలో 50 వేల మంది ఏటీఎం సెక్యూరిటీ గార్డులేనని అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ అధ్యక్షుడు సి.భాస్కర్‌రెడ్డి ‘సాక్షి’తో చెప్పారు. ‘‘గార్డుల విభాగంలో 20 శాతం కొరత ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో గార్డు ఉద్యోగం అంటే చిన్నచూపు. అందుకే అస్సాం, బిహార్, మహారాష్ట్ర నుంచి తీసుకుంటుంటాం. వారికి ఎక్కువ పనిగంటలు కల్పిస్తూ వేతనాలు ఎక్కువొచ్చేలా చేస్తాం. అంటే 8 గంటల పని దినాలను 4 గంటల ఓవర్‌టైం కలిపి 12 గంటలు చేస్తాం.
దీంతో వారికి రూ.10–11 వేల జీతం వస్తుంది. నోట్ల రద్దు తర్వాత ఏటీఎంలు ఖాళీగా ఉంటుండడంతో బ్యాంకులు సెక్యూరిటీ గార్డులు వద్దంటున్నాయి. వారికి పని కల్పించడం కోసం మిగతా వాళ్ల పని గంటలను తగ్గిస్తున్నాం. దీంతో గార్డుల వేతనాల స్థాయి రూ.6 వేలకు పడిపోయింది’’ అని వివరించారు. ఇంకా చెప్పాలంటే ఏటీఎం సెక్యూరిటీ గార్డులకు కేటాయించే 3 జతల దుస్తులు, షూలు ఇప్పుడు పనికిరాకుండా మూల నపడున్నాయి. వాటి మీద ఆధారపడి ఉన్న బట్టలు కుట్టేవాళ్లు, లాండ్రీ షాపులు వంటి వ్యాపారులకూ ఇబ్బందే. ఇక ఏటీఎంల కోసం షట్టర్లు కేటాయిస్తే ఎక్కువ అద్దె వస్తుందని ఆశపడేవారికీ చుక్కెదురే. ఇవన్నీ చెబుతూ పోతే... ఏటీఎంల చుట్టూ చాలా పెద్ద ఆర్థిక వ్యవస్థే ఉంది. మరి ఇదంతా డిజిటల్‌కు మళ్లుతుందా? ఏమో!
నగదు సరఫరా సంస్థలూ దెబ్బతిన్నాయ్!
బ్యాంకు నుంచి ఏటీఎంకు నగదును సరఫరా చేసేందుకు ప్రత్యేకంగా క్యాష్ లాజిస్టిక్ సంస్థలున్నాయి. దేశంలో ఎక్సెల్ క్యాష్ మేనేజ్‌మెంట్, చెక్‌మేట్, బ్రింక్స్ ఆర్య ఇండియా, ఐఎస్‌ఎస్–ఎస్‌డీబీ, ఎస్‌ఐఎస్ క్యాష్ సర్వీసెస్, సీఎంఎస్ సెక్యూరిటీస్, రింటర్ సేఫ్‌గార్డ్ వంటి 50కి పైగా సంస్థలు ఈ రంగంలో ఉన్నాయి. ఇవన్నీ స్ట్రాంగ్ రూమ్స్, ఏటీఎం రీప్లేస్‌మెంట్, క్యాష్ పికప్, డెలివరీ, క్యాష్ ఇన్ ట్రాన్సిట్, స్మార్ట్ కార్డ్స్, పాస్‌పోర్ట్, డాక్యుమెంట్స్ వంటి సేవలు అందిస్తున్నాయి. ఈ సంస్థల్లో లక్షకు పైగా లాజిస్టిక్ వాహనాలు, 2 లక్షల మంది ఉద్యోగులుంటారని క్యాష్ లాజిస్టిక్స్ అసోసియేషన్ (సీఎల్‌ఏ) చెబుతోంది. నగదు సరఫరా లేక ఈ వాహనాలు ఖాళీగా ఉంటున్నాయని, దీంతో ఈ సంస్థలకు రూ.170 కోట్ల నష్టం వాటిల్లిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 14 క్యాష్ లాజిస్టిక్స్ సంస్థలు, 42 వేల వాహనాలున్నాయి. క్యాష్ లాజిస్టిక్ సంస్థల్లో డ్రైవర్లు, గన్ మన్లు, కస్టోడియన్లు, లోడర్స్, క్యాష్ ఆపరేటర్స్, మేనేజర్లు.. ఇలా 85 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఒక్క ఏటీఎంలో నెలకు 10 సార్లు నగదు నింపితే వీరికి చెల్లించేది రూ.7 వేలు. ఒక ఏటీఎంలో నగదును నింపటానికి డ్రైవర్, గన్ మన్, కస్టోడియన్, క్యాష్ లోడర్, క్యాష్ ఆపరేటర్ మొత్తం ఐదుగురు ఉద్యోగుల అవసరముంటుంది.
‘‘నోట్ల రద్దుకు ముందువరకూ ఈ సంస్థలు రోజుకు రూ.15,000 కోట్ల నగదును సరఫరా చేసేవి. ఇపుడు రూ.5,000 కోట్లు కూడా కష్టంగా మారింది. కనీసం 10 వేల వాహనాలు కూడా తిరగటం లేదు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజుకు రూ.15–20 లక్షల నష్టం వాటిల్లుతోంది’’ అని ఎక్సెల్ క్యాష్ మేనేజ్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ సి.మురళీ మాధవన్ ‘సాక్షి’తో చెప్పారు. క్యాష్ సరఫరా వాహనాలు ప్రత్యేకంగా తయారు చేసేవి కనుక వీటిని ఇతర అవసరాలకు వినియోగించలేరు.
వాహనాలను ఖాళీగా ఉంచటం, ఉద్యోగులకు వేతనాలు చెల్లించాల్సి రావటంతో.. ఇప్పటికే హైదరాబాద్‌కు చెందిన 3 కంపెనీలు బోర్డు తిప్పేశాయి. క్యాష్ ట్రాన్సిట్ సేవలతో పాటూ ఇతర వ్యాపారాలు కూడా చేస్తున్న ఒకటిరెండు పెద్ద కంపెనీలు మినహా మిగిలినవన్నీ నష్టాల్లోనే ఉన్నాయి. అమెరికాకు చెందిన బ్రింక్స్.. ఇండియాలోని బ్రింక్స్ ఆర్య ఇండియా యూనిట్‌ను రూ.400 కోట్లకు విక్రయించేందుకు సిద్ధమైంది కూడా.