దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు
పనాజీ: సుపరిపాలన దినోత్సవంపై ఇంకా తాము ఏ నిర్ణయం తీసుకోలేదని గోవా ప్రభుత్వం తెలిపింది. డిసెంబర్ 25 క్రిస్టమస్ డే కాగా, అదే రోజును దేశ వ్యాప్తంగా సుపరిపాలన దినోత్సవంగా పాటించాలని ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయం పట్ల పలువురు క్రైస్తవులు, క్రైస్తవ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అయితే, క్రైస్తవులు అధికంగా ఉండే గోవాలో ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. అక్కడి ప్రతిపక్షాలు దీన్నే ప్రధాన అంశంగా తీసుకొని బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావించగా దీనికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ బదులిచ్చారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై తాము ఇంకా ఏం నిర్ణయించుకోలేదని తెలిపారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పాయ్ పుట్టిన రోజును సుపరిపాలన దినోత్సవంగా పాటించాలని నిర్ణయించింది.