సైకిల్ గుర్తు రిజర్వ్!
• ఎస్పీ గుర్తుపై ఇరువర్గాల వాదలను విన్న ఈసీ
• వీలైనంత త్వరలో నిర్ణయం వెలువరుస్తామని ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్‌లోని అధికార సమాజ్‌వాదీ పార్టీ గుర్తు (సైకిల్)పై రేగిన వివాదంలో తమ నిర్ణయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం రిజర్వ్ చేసింది. యూపీ శాసనసభ ఎన్నికలకు జనవరి 17 నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభమవుతున్న తరుణంలో గుర్తుపై శుక్రవారం తేలుతుందని భావించినా.. ఫలితం కోసం వేచిచూడక తప్పలేదు. పార్టీ పేరు, ఎన్నికల గుర్తు సైకిల్‌పై దాదాపుగా 5 గంటలసేపు ములాయం వర్గం, అఖిలేష్ వర్గాల వాదనలను విన్న ఈసీ.. తమ నిర్ణయాన్ని సాధ్యమైనంత త్వరగా వెలువరుస్తామని స్పష్టం చేసింది. ములాయం తరపున శివ్‌పాల్, అమర్‌సింగ్.. అఖిలేశ్ వర్గం తరపున రాంగోపాల్ యాదవ్, నరేశ్ అగర్వాల్ ఈసీ ముందు హాజరయ్యారు.
మాదంటే మాదే!
కేంద్ర ఎన్నికల సంఘం ముందు యూపీ సీఎం అఖిలేశ్ తరపున కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్, రాజేశ్ ధవన్ వాదనలను వినిపించారు. అటు ములాయం వర్గం కూడా గుర్తు తమకే ఇవ్వాలని కోరింది. ఇరు వర్గాల వాదనలు విన్న ఎన్నికల సంఘం ఆదేశాలను రిజర్వ్ చేసింది. ఇరువర్గాలు సమర్పించిన వివరాల ప్రకారం ఏ గ్రూపునకు మెజారిటీ ఉందో తేల్చిన తర్వాతే గుర్తుపై ఈసీ స్పష్టత నిస్తుంది. సదరు వర్గానికి ఎన్నికల గుర్తును కేటాయించే విషయం పరిశీలనకు వస్తుంది. గుర్తు స్తంభింపజేసే ఆప్షన్ ఈసీ ముందున్నది నిపుణులంటున్నారు. గుర్తు తమకే దక్కుతుందని అఖిలేశ్ వర్గం ధీమాగా ఉంది. త్వరలోనే తమ వర్గం అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని తెలిపింది. అటు, అఖిలేశ్ వర్గంతో కూటమికట్టే విషయాన్ని కాంగ్రెస్ ఖండించలేదు. పరిస్థితులకు అనుగుణంగా ఎటువంటి నిర్ణయాలైనా వెలువడొచ్చని కాంగ్రెస్ తెలిపింది.