బెంగళూరులో ఏం జరగలేదా? | 'no evidence' of bengaluru mass molestation, says police chief Pravin Sood | Sakshi
Sakshi News home page

బెంగళూరులో ఏం జరగలేదా?

Published Fri, Jan 6 2017 9:30 AM | Last Updated on Tue, Sep 5 2017 12:35 AM

బెంగళూరులో ఏం జరగలేదా?

బెంగళూరులో ఏం జరగలేదా?

బెంగళూరు: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు న్యూఇయర్‌ వేడుకల్లో మహిళలు, యువతులపై జరిగిన భారీ లైంగిక వేధింపుల ఘటనపై మొన్న ఆ రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర వ్యాఖ్యలు చేయగా తాజాగా సిటీ పోలీస్‌ బాస్‌ ప్రవీణ్‌ సూద్‌  వ్యాఖ్యలు చేశారు. అసలు బెంగళూరులో పెద్ద మొత్తంలో లైంగిక వేధింపులు జరిగినట్లు ఆధారాలే లేవని అన్నారు. 30 సెకన్లపాటు జరిగిన దాన్ని మాత్రమే పదేపదే చూపించి హడావుడి చేశారని, దానికి ముందు దానికి వెనుక ఏంజరిగిందో ఎవ్వరికీ తెలియదంటూ సమాధానం ఇచ్చారు.

అయినా, దాదాపు కోటి జనాభా ఉండే బెంగళూరులో ఇలాంటివి జరిగి ఉండొచ్చని తర్వాత అన్నారు. ఈ ఘటనను మాస్‌ మోలెస్టేషన్‌(పెద్దమొత్తంలో జరిగిన లైంగిక వేధింపులు) అంటూ పిలవడాన్ని తాను ఒప్పుకోనని, మహిళల విషయంలో పెద్ద తప్పు జరిగిందని మాత్రం చెప్పారు. బెంగళూరులోని ఎంజీ రోడ్డులో న్యూఇయర్‌ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంలో పెద్దమొత్తంలో అమ్మాయిలు, మహిళలపై యువకులు లైంగిక వేధింపులకు పాల్పడిన విషయం తెలిసిందే.

దీనికి సంబంధించి పలు కథనాలు వచ్చాయి, ఫొటోలు కొన్ని వీడియోలు కూడా ఆ సంఘటనను రుజువు చేశాయి. దీంతో అక్కడి పోలీసులపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో వారికి మొన్న రాష్ట్ర హోంమంత్రి అండగా నిలవగా తాజాగా సీటీ పోలీస్‌ చీఫ్‌ ప్రవీణ్‌ సూద్ మద్దతిచ్చారు. 'డిసెంబర్‌ 31న పోలీసులు అక్కడే ఉన్నారు. 20 మీడియాలకు చెందిన ఓబీ వాహనాలు ఎంజీ రోడ్డులోనే ఉన్నాయి. అక్కడి అవాంఛనీయ ఘటనలు జరిగినట్లు జనవరి 1వ తేదిన ఏ ఒక్కరూ రిపోర్టు చేయలేదు.

నిజంగా ఏదైనా తప్పు జరిగితే ఈ రోజుల్లో క్షణాల్లో వైరల్‌గా మారుతుంది.. కనీసం ఏ ఒక్కరు కూడా ఆరోజు ఈ విషయాన్ని లేవనెత్తలేదు' అని మీడియాతో అన్నారు. అంటే ఆ రోజు బెంగళూరులో ఏమీ జరగలేదని అంటారా అన్న ప్రశ్నకు బదులిస్తూ 'అది జరగలేదనే నేను చెబుతున్నాను' అంటూ బదులిచ్చారు. అయితే, పది మిలియన్ల జనాభా ఉన్న బెంగళూరులో ఇలాంటి కార్యక్రమం(న్యూఇయర్‌ వేడుక) సందర్భంలో ఏం జరగలేదని మాత్రం చెప్పలేము.

నిజంగా మూడు రోజుల కిందట ఏదైనా జరిగి ఉంటే తప్పకుండా తమవద్దకు వస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఆ రోజు ఫుటేజీ మొత్తాన్ని మీడియా వక్రీకరించిందని, 30 సెకన్ల వీడియోని మాత్రమే పదేపదే చూపిందని, కానీ దాని తర్వాత ఏం జరిగిందో మాత్రం చూపలేదని అన్నారు. అయితే డిసెంబర్‌ 31 తేదిన రాత్రి ఎం,జీ, రోడ్డు, బ్రిగేడ్‌ రోడ్డులో మహిళలపై దాడుల్లో మీడియాలో వచ్చిన ఆధారాల ప్రకారం సిటీలోని అశోక్‌నగర, ఇందిరానగర, కబ్బన్‌ పార్కు పోలీస్‌ స్టేషన్లలో సుమోటోగా మూడు కేసులు నమోదు చేసినట్లు ప్రవీణ్‌ సూద్‌ తెలిపారు. ఎవరైనా పూర్తి ఆధారాలు అందజేస్తే కేసును మరింత వేగవంతంగా దర్యాప్తు చేస్తామని చెప్పారు.

కాగా న్యూఇయర్‌ వేడుకలను కవర్‌ చేసిన 45 సీసీటీవీ కెమెరాలన్నింటిలో అమ్మాయిలు భయంతో కేకలు వేస్తూ పరుగులు తీసిన సన్నివేశాలు  వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement