
ఒక్క మంత్రీ ఆస్తులు చెప్పలేదు!
మహారాష్ట్రలో ఇటీవల కొలువుదీరిన దేవేంద్ర ఫడ్నవిస్ మంత్రివర్గంలోని ఒక్క మంత్రి కూడా తమ ఆస్తులు, అప్పులు ఎంతన్న విషయాన్ని వెల్లడించలేదు. ఈ విషయం సమాచారహక్కు కింద అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిసింది. అనిల్ గల్గాలి అనే ఆర్టీఐ కార్యకర్త మంత్రుల ఆస్తులు, అప్పుల గురించి సమాచారం కోరారు. అయితే.. అలాంటి సమాచారం ఏదీ తమకు అందుబాటులో లేదని సాధారణ పరిపాలన శాఖ అండర్ సెక్రటరీ డీకే నాయక్ సమాధానమిచ్చారు.
ఈ విషయమై తాను రెండుసార్లు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్కు కూడా లేఖలు రాశానని ఆర్టీఐ కార్యకర్త చెప్పారు. తన ఆస్తులు, అప్పులు ఎంత ఉన్నాయన్న విషయాన్ని ముఖ్యమంత్రి గవర్నర్కు తెలియజేయాలి. అలాగే మంత్రులు, సహాయ మంత్రులు ముఖ్యమంత్రికి చెప్పాలి. ప్రస్తుతం మంత్రివర్గంలో 18 మంది కేబినెట్ మంత్రులు, 12 మంది సహాయ మంత్రులు ఉన్నారు.