జయలలిత
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే విషయంలో ఏఐఏడీఎంకే అధినేత్రి జె.జయలలిత వెనక్కు తగ్గారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటక హైకోర్టు ఆమెను నిర్దోషిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆమె మళ్లీ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని అనుకున్నారు. అయితే అన్నా డీఎంకేకు ప్రస్తుతం అప్పీళ్ల భయం పట్టుకుంది. హైకోర్టు తీర్పుపై అప్పీలు చేయాలని తమిళనాడులోని పార్టీలు కర్ణాటక ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ రోజు కూడా పీఎంకే(పట్టలి మక్కల్ కట్చి) అధ్యక్షుడు జీకే మీనన్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలిశారు. కర్ణాటక హైకోర్టు తీర్పుపై స్టే కోసం అప్పీలు చేయాలని కోరారు.
ఇదిలా ఉండగా, కర్ణాటక ప్రభుత్వం అప్పీలుకు వెళ్లకుంటే తాము అప్పీలు చేస్తామని డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ చెప్పారు. ఈ పరిస్థితులలో జయలలిత సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం మంచిదికాదని ఆ పార్టీ వారు భావిస్తున్నారు. దాంతో ప్రస్తుతానికి జయలలిత ప్రమాణస్వీకారం ఇప్పట్లో లేనట్లేనని తెలుస్తోంది.