రైల్వే చార్జీలు తగ్గే ప్రసక్తి లేదు!
రైల్వే చార్జీలు తగ్గించే ప్రసక్తే లేదని రైల్వే శాఖ సహాయమంత్రి మనోజ్ సిన్హా స్పష్టం చేశారు. చార్జీల మోత భరించాల్సిందేనన్నారు. ఇప్పటికే రైలు టిక్కెట్ల ధరలు, ఇతరమైనవి చాలా తక్కువగా ఉన్నాయని, అంతకంటే తగ్గించలేమని చెప్పారు. ఫిబ్రవరి 26న పార్లమెంటులో రైల్వే బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఈ సమాధానమిచ్చారు.
పరిమిత వనరులతో పాటు అనేక సబ్సిడీలు భరిస్తున్న కారణంగా తమ శాఖకు ఆదాయం రాకపోగా మరింత భారం మోయాల్సి వస్తున్నదన్నారు. రైల్వే బడ్జెట్ను బ్యాలెన్స్ చేయాల్సినవసరం ఉందని చెప్పారు. రైల్వే శాఖలో మౌలిక సదుపాయాల అభివద్ధి కోసం, భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని విదేశీ పెట్టుబడులను ఎఫ్డీఐలను 100 శాతం అంగీకరిస్తామన్నారు. రైల్వే రక్షణ దళానికి (ఆర్పీఎఫ్) మరిన్ని అధికారాలు కట్టబెట్టే బిల్లును ఈ సమావేశాల్లో ప్రవేశపెడతామని చెప్పారు.