
బుల్లెట్ నుంచి బ్యాలెట్‌కు...మళ్లీ బుల్లెట్ వైపు
న్యూఢిల్లీ: హింసాత్మక సంఘటనల మధ్య 1988 నుంచి రాష్ట్రపతి పాలనలో కొనసాగుతున్న కశ్మీర్‌లో 1996లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగుతాయని ఎవరూ ఊహించలేదు. ఆ రాష్ట్రంలో అనేక పర్యాయాలు రాష్ట్రపతి పాలనను పొడిగిస్తూ విసిగిపోయిన కేంద్ర ప్రభుత్వం కశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించేందుకు రిస్క్ తీసుకుంది. ఆనాటి ప్రయోగం విజయవంతం అవడంతో కశ్మీర్‌కు మరింత స్వయం ప్రతిపత్తిని కల్పిస్తామని, కశ్మీర్ స్వేచ్ఛను కోరుకుంటున్న తిరుగుబాటుదారులతో చర్చలు జరిపి కశ్మీర్ సమస్యకు రాజకీయ పరిష్కారం కనుక్కుంటామన్న వరుస హామీలతో వరుసగా ఎన్నికలు నిర్వహిస్తూ వచ్చారు. అప్పట్లో హిజ్‌బుల్ ముజాహిద్దీన్ సంస్థతోని కూడా కేంద్రం చర్చలు జరిపింది.
భారీగా పెరిగిన పోలింగ్
ఫలితంగా 2004, 2009, 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కశ్మీర్‌లో వరుసగా 35శాతం, 39 శాతం, 50 శాతం పోలింగ్ నమోదవుతూ వచ్చింది. రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఓట్ల శాతం మరింత మెరుగ్గా ఉండింది. 1996లో 53 శాతం, 2002లో 43 శాతం, 2008లో 61 శాతం, 2014లో 66 శాతం పోలింగ్ నమోదైంది. బుల్లెట్‌ను ఆశ్రయించిన కశ్మీర్ ప్రజలు క్రమంగా బ్యాలెట్‌వైపు మొగ్గుతున్నారని ఒక్క భారతే కాకుండా యావత్ ప్రపంచం నమ్ముతూ వచ్చింది. 9–11 టెర్రరిస్టుల దాడుల నేపథ్యంలో పాకిస్తాన్ వైఖరిలో కూడా మార్పు వచ్చింది. ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ లాంటి ఎన్నికైన నాయకులతో చర్చలు జరపాలనుకుంది. వీరిద్దరు కూడా పాకిస్తాన్ వెళ్లి అక్కడి నాయకులతో కశ్మీర్ అంశంపై చర్చలు జరిపి వచ్చారు.
7 శాతానికి పడిపోయిన పోలింగ్
ఇటీవల శ్రీనగర్ పార్లమెంట్ సీటుకు జరిగిన ఉప ఎన్నికల్లో ఏడు శాతం ఓట్లు మాత్రమే నమోదవడం, ఆ తర్వాత 38 కేంద్రాల్లో జరిగిన రీ పోలింగ్‌లో కేవలం రెండు శాతం ఓట్లు మాత్రమే నమోదవడం ఒక్కసారిగా కశ్మీర్ ప్రజల వైఖరిలో వచ్చిన మార్పును తెలియజేస్తోంది. బుల్లెట్ నుంచి బ్యాలెట్ వైపుకు మళ్లిన ప్రజలు తిరిగి బుల్లెట్ వైపు వెళుతుండడమే ఆ మార్పుగా కనిపిస్తోంది. 2014లో జరిగిన పార్లమెంట్, కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు గతంకన్నా ఉత్సాహంగా పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 50 శాతం, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 66 శాతం ఓట్లు నమోదవడం వారి ఉత్సాహానికి నిదర్శనం.
కోరుకున్న ప్రభుత్వాలు రాలేదు
రాష్ట్రానికి మరింత అటానమీ కల్పిస్తానన్న యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో, కశ్మీర్ స్వేచ్ఛకు కషిచేస్తానని చెప్పిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ సంపూర్ణ మెజారిటీతో రాష్ట్రంలో అధికారంలోకి రాకపోవడం కశ్మీర్ ప్రజలను నిరాశపర్చింది. హిందుత్వ బీజేపీ, శాంతియుతంగా కశ్మీర్ స్వేచ్ఛను కోరుకుంటున్న పీడీపీ పార్టీలు కలిస్తే తమ డిమాండ్ల పరిష్కారానికి కషి జరుగకపోతుందా అని కూడా ఆశించారు. కశ్మీర్‌కు మరింత అటానమీని కల్పించాల్సిన అంశాన్ని పక్కన పెట్టి కశ్మీర్‌ను భారత్‌లో పూర్తిగా విలీనం చేయాలని, ప్రత్యేక హక్కులను కల్పిస్తున్న 370 అధికరణను పూర్తిగా రద్దు చేయాలని బీజేపీ నాయకులు బహిరంగంగానే మాట్లాడడం మళ్లీ కశ్మీర్ యువతలో మంటలు రేపింది.
ఎవరి మాట విననన్న మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కలసి అప్పటి కశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ కశ్మీర్ అంశానికి సంబంధించి తాను ప్రపంచంలో ఎవరి సలహాలను వినే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు కూడా పరోక్షంగా మిలిటెంట్లకు మద్దతిస్తున్న కశ్మీర్ యువతను ప్రత్యక్ష మద్దతుకు పురిగొల్పాయి. కశ్మీర్ మిలిటెంట్ బుర్హాణి ఎన్‌కౌంటర్, పాకిస్తాన్ భూభాగంలో సర్జికల్ దాడులు, రాళ్లు రువ్వే యువకులను కూడా మిలిటెంట్లుగానే పరిగణిస్తామని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ హెచ్చరించడం తదితర పరిణామాలు కశ్మీర్ ప్రజలను ఎన్నికలకు దూరం చేశాయి. పర్యవసానంగా కశ్మీర్ సమస్యకు రాజకీయ పరిష్కారం లభించే అవకాశం కనుచూపు మేరలో లేకుండా పోయింది.