
సోఫా, రెడ్‌కార్పెట్, ఏసీ వద్దు: సీఎం
లఖ్‌నవూ(ఉత్తరప్రదేశ్): తన పర్యటనల సందర్భంగా ఎటువంటి అదనపు ఏర్పాట్లు చేయొద్దని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల దియోరియా, గోరఖ్‌పూర్‌లలోని అమరులైన సైనిక కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో అధికారులు హడావుడి పడుతూ చేసిన ప్రత్యేక ఏర్పాట్లతో ప్రజలు ఇబ్బంది పడ్డారని సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఇకపై ముఖ్యమంత్రి పర్యటనల సందర్భంగా ఏసీ, రెడ్ కార్పెట్, సోఫాలు సమకూర్చవద్దని అధికారులను ఆదేశించారు. అధికార దర్పాన్ని ప్రదర్శించుకునే ఇటువంటి చర్యలతో సీఎం చాలా అసహనంగా ఉన్నారని ఆ ప్రకటనలో కార్యాలయ అధికారులు వెల్లడించారు.
ఈ మేరకు జిల్లా ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, పరిపాలన విభాగాల అధిపతులకు ఆదేశాలు అందాయి. జూలై 8వ తేదీన గోరఖ్‌పూర్‌లో సీఎం పర్యటించిన సందర్భంగా అధికారులు.. కిలోమీటర్ మేర ఎర్ర తివాచీ పరిచారు. దారి పొడవునా ప్రజలు, నివాసాలు కనిపించకుండా రెండు వైపులా తెల్లటి కర్టెన్లు ఏర్పాటు చేశారు. అమరడైన సైనికుడి కుటుంబాన్నిపరామర్శిండానికి యోగి వెళ్లిన సమయంలో అధికారులు సైనికుడి ఇంట్లో కాషాయ రంగు కర్టెన్లు, ఎయిర్ కూలర్, ఎగ్జాస్ట్ ఫ్యాన్, ఖరీదైన సోఫా ఏర్పాటు చేశారు. మే 12వ తేదీన డియోరియాలో అమర సైనికుడి నివాసానికి వెళ్లిన సందర్భంలోనూ ఇవే హంగులు, ఆర్భాటాలు ఏర్పాటు చేశారు. ఆయన పర్యటన ముగిసిన కొద్ది నిమిషాల్లోనే వాటన్నింటిని తొలగించారు. అప్పట్లోనే వీటి విషయమై సీఎం ఆదిత్యనాథ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ అదే తీరు కొనసాగటంతో సీఎం కార్యాలయం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది.