పబ్లిక్‌గా మూత్రవిసర్జన..ఏంటని ప్రశ్నించినందుకు
నోయిడా :
స్వచ్ఛ భారత్ నినాదంతో ఓ వైపు దేశాన్ని పరిశుభ్రంగా ఉంచాలని పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తుంటే.. బహిరంగ మూత్ర విసర్జన చేయడమే కాకుండా అడ్డుకున్న వారిపై దాడులు పెరిగిపోతున్నాయి. పబ్లిక్‌గా అందరిముందే మూత్రవిసర్జన ఏంటని ప్రశ్నించినందుకు ఓ న్యాయవాదిపై దాడి చేయడమే కాకుండా, మద్యం మత్తులో అతని ఇంటికి కూడా వెళ్లి ఇష్టానుసారంగా ప్రవర్తించారు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో సెక్టర్ 49లో చోటుచేసుకుంది. మద్యం మత్తులో అందరూ చూస్తుండగానే మూత్రవిసర్జన చేస్తున్న వ్యక్తిని 32 ఏళ్ల న్యాయవాది గౌరవ్ వసోయా అడ్డుకున్నారు. అయితే ఆ సమయంలో మూత్రవిసర్జన చేసిన వ్యక్తితో పాటూ మరో నలుగురు కూడా అక్కడే ఉన్నారు.
వీరందరూ కలిసి ఒక్కసారిగా గౌరవ్‌పై దాడికి దిగారు. దీంతో వారి నుంచి తప్పించుకొని వెళ్లినా, గౌరవ్‌ను వెంబడించి అతని ఇంటివరకు వెళ్లారు. వారందరూ తమ ఇంటి ఆవరణను మొత్తం నాశనం చేశారని గౌరవ్ తండ్రి కుషాల్‌పాల్ సింగ్ తెలిపారు. పీకల్లోతు వరకు మద్యం సేవించిన వారందరూ ఓ కార్లో వచ్చారని సింగ్ పోలీసులకు చెప్పారు. రాళ్లతో కొడుతూ ఇంట్లోని కూర్చితో గౌరవ్‌పై దాడి చేశారని ఆరోపించారు.
ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశామని ఎస్పీ అరుణ్ కుమార్ సింగ్ తెలిపారు. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నామన్నారు.