
లెక్క చూపని ఆదాయం రూ.71,941 కోట్లు!
► గత మూడేళ్లలో సోదాల్లో ఐటీ శాఖ కనుగొన్న మొత్తమిది
► సుప్రీంకోర్టుకు వివరాలు వెల్లడించిన కేంద్రం
న్యూఢిల్లీ: గత మూడేళ్లలో ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ జరిపిన సోదాలు, స్వాధీనం, సర్వేల్లో రూ.71,941 కోట్ల లెక్క చూపని ఆదాయాన్ని కనుగొన్నట్టు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. నోట్ల రద్దు సమయమైన 2016 నవంబర్ 9 నుంచి ఈ ఏడాది జనవరి 10 వరకు రూ.5,400 కోట్లకు పైగా ఆదాయానికి మించిన ఆస్తులు బహిర్గ తమైనట్టు వెల్లడించింది.
అలాగే 303.367 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కోర్టుకు సమ ర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది. 2014 ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 28 వరకు గల మూడేళ్ల కాలంలో (నోట్ల రద్దు సమయంతో కలిపి) పన్ను చెల్లించని ఆదా య వివరాలను కోర్టు ముందుంచింది.ఈ మూడేళ్ల కాలంలో నిర్వహించిన సోదాల ద్వారా రూ.36,051 కోట్లు, 15 వేల సర్వేల ద్వారా రూ.33,000 కోట్లు లెక్క చూపని ఆదాయాన్ని కనుగొన్నట్టు వెల్లడించింది. ఇదికాక రూ.2,890 కోట్లు స్వాధీనం చేసుకున్నామని ఆర్థిక శాఖ పేర్కొంది.