
పుట్టుకతోనే కాంగ్రెస్ వాడిని: సిద్ధూ
న్యూఢిల్లీ: పుట్టుకతోనే తాను కాంగ్రెస్ వాడినని మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ అన్నారు. అనేక నాటకీయ పరిణామాల అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో సిద్ధూకు పార్టీ సీనియర్ నేత అజయ్ మాకెన్, పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాలఇన్‌చార్జ్ ఆషా కుమారి పార్టీలోకి సోమవారం ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సిద్ధూ విలేకరులతో మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్‌లోనే పుట్టానని, ఎన్నో ఏళ్ల తర్వాత తిరిగి తన మూలాలు వెతుక్కుంటూ సొంత గూటికి చేరినట్లుందన్నారు. పార్టీ ఆదేశిస్తే ఎక్కడనుంచైనా పోటీ చేస్తానన్నారు. తన తండ్రి భగవంత్ సింగ్ సిద్ధూ స్వాతంత్య్ర సమరయోధుడని.. ఆయన కాంగ్రెస్‌లో 40 ఏళ్లు ఉన్నారని తెలిపారు. రాముడిని అడవులకు పంపిన కైకేయిగా బీజేపీని, రాముడిని కన్నకౌసల్యగా కాంగ్రెస్ పార్టీని అభివర్ణించారు.