రైల్వేలో హౌజ్ కీపింగ్‌కు ప్రత్యేక విభాగం
న్యూఢిల్లీ: రైళ్లలో, ప్లాట్‌ఫామ్‌లపై శుభ్రతాపరమైన కార్యక్రమాల నిర్వహణ కోసం భారతీయ రైల్వే ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. రైళ్లలో, రైల్వే స్టేషన్లలో పరిశుభ్రత, ఆరోగ్యకర ప్రమాణాలు పాటించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఈ హౌజ్ కీపింగ్ పనులు వేర్వేరు విభాగాలు చేస్తున్నాయి. దీనివల్ల శుభ్రతాపరమైన నాణ్యతా ప్రమాణాల నిర్వహణలో పరిమితులు ఏర్పడటంతో పాటు, ఈ విభాగంలో ఆధునిక పద్దతులను వినియోగించడం సాధ్యం కాలేదని గురువారం రైల్వే శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.
ప్రస్తుతానికి ఈ నూతన సమగ్ర హౌజ్ కీపింగ్ విభాగం సేవలు ఉత్తర, దక్షిణ మధ్య, దక్షిణ రైల్వే జోన్‌లలో ప్రారంభమవుతాయన్నారు. ప్రస్తుతం రాజధాని, శతాబ్ది, దురంతో సహా 540 రైళ్లలో 'ఆన్‌బోర్డ్ హౌజ్ కీపింగ్' సేవలు అందుబాటులో ఉన్నాయి. రైల్వే స్టేషన్లు, ప్లాట్‌ఫామ్‌లు, వెయిటింగ్ రూమ్‌లు, రైల్వే బోగీలను శుభ్రపరచడం మొదలైన పనులు హౌజ్ కీపింగ్ విభాగం చేస్తుంది.