బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియమ్, యువరాణి కేట్ మిడిల్టన్ భారత్‌లో పిచ్చాపాటిగా విహారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులు ఇప్పటికే దేశంలో క్రికెట్ ఆడారు. విలువిద్యలో తమ నైపుణ్యాన్ని పరీక్షించుకున్నారు. ఖాజీరంగ పార్కులో వన్యప్రాణులతో ప్రేమగా గడిపారు. పనిలోపనిగా సంభవించిన భూప్రకంపనలు చవిచూశారు.
అయితే, వీటన్నింటి కంటే కూడా విలియమ్, కేట్ దంపతులు ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసిన ఘట్టం నెటిజన్ల దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. ప్రధాని మోదీ తనను కలిసేందుకు ఎవరూ వచ్చినా వారికి గట్టిగా షేక్‌హ్యాండ్ ఇచ్చి.. ఆలింగనం చేసుకోవడం తెలిసిందే. అదే తరహాలో యువరాజు విలియమ్ చెయ్యి పట్టుకొని గట్టిగా షేక్ హ్యాండ్ ఇచ్చారు. మోదీ ఎంత గట్టిగా నొక్కారో తెలియదు కానీ ఈ షేక్ హ్యాండ్ దెబ్బకు విలియమ్ చెయ్యి దాదాపు కమిలిపోయింది. ఎర్రని ఆయన చెయ్యి మోదీ షేక్‌హ్యాండ్ ఇచ్చిన మేరకు రంగుమారిపోయింది.
ఎండకు కందే సుకుమారుడైన తన భర్తతో మోదీ అలా గట్టిగా కరచాలనం చేస్తుండగా పక్కనే ఉన్న కేట్ మౌనంగా చూస్తూ ఉండిపోయింది. విలియం చెయ్యి స్పష్టంగా కమిలినట్టు కనిపిస్తున్న ఈ ఫొటోలను షేర్ చేస్తూ నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. అదే అత్యంత పవర్‌ఫుల్ షేక్‌హ్యాండ్ అని సెటైర్లు వేస్తున్నారు. గతంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ భారత పర్యటన సందర్భంగా ఆయనను ఆలింగనం చేసుకొనే సందర్భంలో మోదీ ఇచ్చిన ఓ పోజు కూడా ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే.
మోదీ 'షేక్' హ్యాండ్ తో రాజుగారికి కమిలిపోయింది!
Published Thu, Apr 14 2016 7:37 PM | Last Updated on Fri, Aug 24 2018 1:52 PM
Advertisement
Advertisement