
ఆంధ్రప్రదేశ్ @159 తెలంగాణ @132
రాష్ట్రపతి ఎన్నికలో మారిన తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓటు విలువలు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికకు సంబం ధించి తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓటు విలువ మారింది. గత రాష్ట్రపతి ఎన్నికలో ఉమ్మడి ఏపీలోని ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ 148 కాగా ఈసారి ఏపీకి చెందిన ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ 159కి పెరిగింది.తెలంగాణలో 132కు తగ్గింది. 1971 జనాభా లెక్కల ఆధారంగా కసరత్తు చేసిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం ఈ విలువలను ఖరారు చేసింది. మరోవైపు రాష్ట్రపతి ఎన్నికను జూలై 17న నిర్వహిస్తామంటూ బుధవారం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిప్పటికీ పోటీలో నిలిచే అభ్యర్థులపై ఇంతవరకు స్పష్టతలేదు.
రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ప్రతిపక్షాలను సంప్రదిస్తామని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఇప్పటికే ప్రకటించినప్పటికీ, ఆ ప్రక్రియ ఇంకా మొదలవలేదు. దీంతో ప్రతిపక్షాలు కూడా తమ అభ్యర్థి విషయంలో ఎటూ తేల్చుకోలేక పోతున్నాయి. అయితే ఎన్డీయే తరఫున లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్ము, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పేర్లు రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి వినిపిస్తున్నాయి. అటు ప్రతిపక్ష కూటమి నుంచి మహాత్మాగాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్, జేడీయూ నేత శరద్ యాదవ్, ఎన్సీపీ నేత శరద్ పవార్ పేర్లు ప్రస్తావనకు వస్తున్నాయి.
అభ్యర్థి ఎంపికకు విపక్షాల ఉపసంఘం
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి ఎంపికపై ఏకాభిప్రాయం కోసం విపక్షాలు ఓ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశాయి. రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, జేడీయూ నాయకుడు శరద్ యాదవ్, ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్‌లతో పాటు వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ, బహుజన్ సమాజ్ పార్టీ, ఎన్సీపీ, డీఎంకే నేతలు ఈ ఉపసంఘంలో సభ్యులుగా ఉండనున్నారు.
వచ్చేవారం సమావేశం కానున్న ఉపసంఘం ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఎన్నికల కమిషన్ జూన్ 14న అధికారికంగా నోటిఫికేషన్ వెలువరించిన తర్వాతే విపక్షాలు తమ అభ్యర్థిని ప్రకటించే అవకాశమున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.