ర్యాగింగ్ భూతం వెర్రితలలు వేస్తోంది. కర్ణాటకలోని ఓ నర్సింగ్ కాలేజిలో సీనియర్లు జూనియర్ విద్యార్థినితో బలవంతంగా బాత్రూంలు శుభ్రం చేసే యాసిడ్ తాగించారు. గుల్బర్గాలోని అల్ ఖమర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో గత నెలలో ఈ ఘటన జరిగింది. అప్పటినుంచి ఇప్పటివరకు బాధితురాలు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతూనే ఉంది. కేరళకు చెందిన మొదటి సంవత్సరం విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను కోజికోడ్లోని వైద్యకళాశాలకు తరలించారు. ఆమెకు శరీరం లోపలి భాగాల్లో కాలిన గాయాలయ్యాయి. కర్ణాటక ఆస్పత్రిలోని ఐసీయూలో వారం ఉంచిన తర్వాత కోజికోడ్ తీసుకొచ్చారు. ఆమె పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉంది.
బాధితురాలి తల్లి రోజుకూలీగా పనిచేస్తుంటారు. తన కూతురు మంచి నర్సు కావాలన్న ఉద్దేశంతో రూ. 3 లక్షలు అప్పు చేసి మరీ ఆమెను గుల్బర్గా కాలేజిలో చేర్పించారు. తన కూతురు కనీసం తిండి కూడా తినలేకపోతోందని, వాళ్లు ఎందుకిలా చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనను దాదాపు ఐదు నెలలుగా చిత్రహింసలు పెడుతున్నారని, మూడో సంవత్సరం విద్యార్థినులు ఈ ఆగడాలకు పాల్పడ్డారని బాధితురాలు చెప్పింది. తాను నల్లగా ఉన్నానని, అందుకే ఎవరూ తనను ఇష్టపడరని, తనకు తండ్రి లేరని కూడా వాళ్లు కామెంట్లు చేస్తున్నారని వాపోయింది. బలవంతంగా చేతులు పైకెత్తి, తననోరు తెరిచి, యాసిడ్ తాగించారని తెలిపింది.
అయితే ఇది ర్యాగింగ్ కాదని నర్సింగ్ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ ఈస్తర్ అంటున్నారు. ఆమె కుటుంబ సమస్యల కారణంగానే ఫినాయిల్ తాగిందని చెప్పారు. ఈ కేసు విచారణకు గుల్బర్గా పోలీసులు ప్రత్యేక బృందాన్ని నియమించారు.
ర్యాగింగ్: విద్యార్థినితో యాసిడ్ తాగించారు!
Published Wed, Jun 22 2016 9:29 AM | Last Updated on Mon, Sep 4 2017 3:08 AM
Advertisement
Advertisement