
పన్నీర్‌కు ఒకటి, నాకొకటి: పళనిస్వామి
చెన్నై: విలీనం తర్వాత అన్నాడీఎంకే పార్టీ కన్వీనర్‌గా పన్నీర్ సెల్వం ఉంటారని తమిళననాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి తెలిపారు. పన్నీర్ సెల్వం తన వర్గాన్ని విలీనం చేసిన సందర్భంగా పార్టీ ప్రధాన కార్యాలయంలో అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. తాను, కేపీ మనుస్వామి సహ కన్వీనర్లు ఉంటామని చెప్పారు. 11 మంది సభ్యులు సమన్వయ కమిటీ పార్టీని నడుపుతుందని వెల్లడించారు.
రెండాకుల గుర్తును నిలబెట్టుకోవడమే ప్రస్తుతం తమ మొదటి ప్రాధాన్యమని అన్నారు. అమ్మ ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని ప్రకటించారు. తాను చనిపోయిన తర్వాత కూడా పార్టీ వందేళ్లు పైగా వర్ధిల్లాలని జయలలిత ఆకాంక్షిచారని, అమ్మ ఆశయాలకు అనుగుణంగా పార్టీని నడుపుతామని హామీయిచ్చారు. ఇప్పటికీ పార్టీలో బేదాభిప్రాయాలు ఉన్నాయని, కలిసికట్టుగా వీటిని పరిష్కరించుకుంటామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కలిసి పనిచేయాలని కార్యకర్తకలు పిలుపునిచ్చారు.
ఇటీవల కాలంలో పార్టీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొందని సీనియర్ నేత కేపీ మునుస్వామి వ్యాఖ్యానించారు. ఎంజీఆర్ మరణించిన తర్వాత కూడా ఇలాగే జరిగిందని గుర్తు చేశారు. పళనిస్వామి, పన్నీర్ సెల్వం ముందుకు వచ్చి పార్టీని ఒక్కటి చేశారని ప్రశంసించారు.