భువనేశ్వర్: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇవ్వాలని అనుకుంటున్నట్లు ఒడిశాకు చెందిన మౌంట్‌మ్యాన్ దైతరి నాయక్ (71) తెలిపారు. తాను పడ్డ కష్టానికి దక్కిన పురస్కారం కారణంగా.. ఆయన ఇప్పుడు చాలా బాధపడుతున్నారు. పర్వత శ్రేణుల్లోని జల ప్రవాహాన్ని తన స్వగ్రామానికి తీసుకురావడానికి దైతరి నాయక్ మూడు కిలోమీటర్ల మేర కాలువ నిర్మించిన విషయం తెలిసిందే. కుటుంబ పోషణకు కూలి చేసుకుంటూ, ఖాళీ సమయాల్లో ఈ కాలువను చిన్న చిన్న పనిముట్ల సహాయంతో నిర్మించారు. పరిసర కొండపై పడిన వర్షపు నీటిని గ్రామ అవసరాలకు ఉపయోగించుకునే విధంగా కాలువను తవ్వారు. అనేక సంవత్సరాలపాటు కష్టపడి ఈ కాలువను నిర్మించిన ఆయన గొప్పతనాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆయనకు పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
పద్మశ్రీ పురస్కారమే తనకు శాపంగా మారిందని దైతరి నాయక్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ గుర్తింపు రాకముందు తాను వ్యవసాయ పనులకు వెళ్ళి, తన కుటుంబాన్ని పోషించుకునేవాడినని, ప్రస్తుతం తనను పనులకు ఎవరూ పిలవడం లేదన్నారు. దీంతో తన రోజువారీ అవసరాలను తీర్చుకోవడానికి సైతం కష్టంగా ఉందని వాపోయారు. ‘ఒడిశా కాలువ మనిషి’గా ప్రసిద్ధి పొందిన ‘పద్మశ్రీ’ దైతరి నాయక్ ప్రస్తుతం మామిడి పండ్లు అమ్ముకుంటూ జీవిస్తున్నారు. ఆయనకు మరో ఆవేదన కూడా ఉంది. తాను నిర్మించిన కాలువను అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఆ హామీ ఇప్పటికీ నెరవేరడం లేదని ఆయన తెలిపారు. కేందుఝర్ అభివృద్ధిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తనకు ప్రభుత్వం ఇచ్చిన ‘పద్మశ్రీ’ని తిరిగి ఇచ్చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు.
దీనిపై స్థానిక సబ్ కలెక్టర్ సోమనాథ్ ప్రధాన్ మాట్లాడుతూ ‘పద్మశ్రీ’ని తిరిగి ఇచ్చేయవద్దని తాను దైతరి నాయక్‌ను కోరానని తెలిపారు. ఈ పురస్కారానికి ఆయన అర్హుడని తెలిపారు. నాయక్ ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉన్నందువల్ల ఆయనకు సహాయపడటానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వంతో మాట్లాడి ఆయనకు పక్కా ఇల్లు మంజూరు చేస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment