
తండోప తండాలుగా.... తరలినారు చూడు
భువనేశ్వర్: అది చల్లటి నీడనిచ్చే వేప చెట్టు. మొన్నటి వరకు కళ్లు నులుముకొని చూసినా అక్కడ ఎవరూ కనిపించే వారు కాదు. ఇప్పుడు లక్షలాది మంది జనం మధ్య అది పులకించి పోతోంది. దేశంలోని దారులన్నీ అటే దారి తీస్తున్నాయి. తండోప తండాలుగా జనం తరలి వస్తూ ఆ చెట్టును దర్శించుకొని తన్మయత్నంలో తాదామ్యం చెందుతున్నారు. అందుకు కారణం....12వ శతాబ్దంనాటి పూరి జగన్నాథ ఆలయంలో జూన్‌లో జరుగనున్న ఉత్సవం కోసం భగవాన్ సుదర్శనుడి విగ్రహాన్ని తయారు చేయడం కోసం ఆ చెట్టును ఎంపిక చేయడమే.
జగన్నాథ ఆలయం ఆనవాయితీ ప్రకారం జూన్ నెలలో జరిగే ఉత్సవం కోసం నవకళావర్ పేరిట పూరి జగన్నాథుడు, దేవి సుభద్ర, బలభద్రుడు, సుదర్శనుడి విగ్రహాలను కొత్తవి చేయిస్తారు. అందుకు నలుగురి దేవతా విగ్రహాల కోసం నాలుగు పవిత్రమైన వేప చెట్లను ఎంపిక చేస్తారు. ముందుగా సుదర్శనుడి కోసం, తర్వాత బలభద్రుడి కోసం, ఆ తర్వాత దేవి సుభద్ర కోసం, చివరన జగన్నాథుడి కోసం పవిత్ర చెట్లను ఎంపిక చేస్తారు. ఒకే చెట్టులో శంఖం, చక్రం, గధ, పద్మం ఆకృతులు కనిపిస్తేనే ఆ చెట్టును ఈ దేవతల విగ్రహాల తయారీకి ఉపయోగిస్తారు.
ఈ ప్రక్రియలో భాగంగానే ముందుగా సుదర్శనుడి విగ్రహం కోసం భువనేశ్వర్‌కు పది కిలోమీటర్ల దూరంలోవున్న గడకుంటాయక్ గ్రామంలోని ఓ వేప చెట్టును ఆదివారం నాడు ఆలయ నిర్వాహకులు ఎంపిక చేశారు. ఈ సమాచారం నలు దిశలా వ్యాపించడంతో ప్రతి దిక్కు నుంచి భక్తజనం తరలి వస్తున్నారు. పూజాది కార్యక్రమాలు నిర్వహించి పులకించి పోతున్నారు. ఈ చెట్టుకు మరో విశేషం కూడా ఉంది. 1999లో ఒరిస్సాలో బీభత్సం సృష్టించిన పెను తుపాను తాకిడికి కూడా ఇది చెక్కు చెదరలేదు. తన రూపాన్ని సంతరించుకోబోతున్న ఆ చెట్టును ఆ భగవంతుడే రక్షించి ఉంటాడని ఓ భక్తురాలి వ్యాఖ్యానం.
సాక్షాత్తు దైవ స్వరూపం సంతరించుకోనున్న ఆ పవిత్ర వేపచెట్టును కడసారి దర్శించుకునే భాగ్యాన్ని దక్కించుకునేందుకు వస్తున్న అశేష భక్తులకు ఎలాంటి భద్రతాపరమైన చిక్కులు ఏర్పడకుండా చూసేందుకు ఏకంగా 24 బెటాలియన్ల పోలీసులను ఏర్పాటు చేశారు. దైవ కృతుల కోసం ఏతెంచిన పూజారులకు అవసరమైన వసతి ఏర్పాట్లు కూడా ఘనంగా చేశారు.
గడకుంటాయక్ గ్రామానికి, పవిత్రమైన వేపచెట్టున్న ప్రాంతానికి 24 గంటలపాటు విద్యుత్, నీటి సరఫరాలు చేస్తున్నామని సంబంధిత అధికారులు తెలిపారు. ఇక బల భద్రుడు, దేవి సుభద్ర, జగన్నాథుడి విగ్రహాల కోసం పవిత్ర చెట్లను వారం రోజుల్లో ఎంపిక చేస్తామని పూరి జగన్నాథ ఆలయం ప్రధాన పాలనాధికారి, సీనియర్ ఐఏఎస్ అధికారి సురేశ్ చంద్ర మహాపాత్ర తెలిపారు. ఇలా ఎంపిక చేసిన చెట్లను మహాదారు అని పిలుస్తారు.