వ్యవసాయ విశ్వవిద్యాలయ ల్యాబ్ పరీక్షలో కనిపించిన ఫంగస్ కణాలు
సాక్షి, హైదరాబాద్: గతేడాది వేప చెట్లను అతలాకుతలం చేసిన ఫంగస్ ఇక కొన్నేళ్లపాటు ఆ వృక్ష జాతి పాలిట ‘సీజనల్ వ్యాధి’గా కొనసాగనుంది. వచ్చే ఐదారేళ్లపాటు ఆగస్టు, సెప్టెంబర్ సమయంలో ఆ శిలీంధ్రం ఆశించి వేప చెట్లకు నష్టం చేసే అవకాశం ఉంది. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన విభాగం తాజాగా ఈ విషయం గుర్తించింది. ఈ నెల 15 నుంచి జరిపిన పరిశోధనలో, గతేడాది తీవ్ర ప్రభావం చూపిన ఫోమోప్సిస్ అజాడిరెక్టే, ఫ్యుజేరియం అనే ఫంగస్ వేప చెట్లకు మళ్లీ ఆశించినట్టు తేల్చారు.
గతేడాది ప్రభావం తీవ్రంగా ఉండగా, ఈసారి కాస్త తక్కువగా ఉంది. దాదాపు 20 శాతం చెట్లు చనిపోతాయన్న అంచనా గతేడాది వ్యక్తమైనా, చివరకు ఔషధ వృక్షంగా పేరుగాంచిన వేప తనను తాను బతికించుకుంది. అతి తక్కువ సంఖ్యలోనే చెట్లు చనిపోయాయి. ప్రభావం తీవ్రంగా ఉన్నా చివరకు ప్రమాదం నుంచి వాటంతట అవే బయపడడాన్ని చూసి శిలీంధ్రాన్ని విజయవంతంగా జయించినట్టేనని, ఇక ఆ శిలీంద్రం అంతమైనట్టేనని భావించారు.
కానీ, సరిగ్గా మళ్లీ గత ఆగస్టు చివరికల్లా కొన్ని ప్రాంతాల్లో చెట్ల కొమ్మల చివర్లు ఎండిపోవటం మొదలైంది. క్రమంగా సమస్య పెరుగుతుండటంతో ఈ నెల రెండో వారంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన విభాగం సంచాలకులు జగదీశ్వర్ ఆదేశం మేరకు డాక్టర్ సి.నరేందర్‌రెడ్డి, డాక్టర్ ఎస్‌జే రహమాన్, డాక్టర్ జి.ఉమాదేవి, డాక్టర్ ఎస్.హుస్సాని, డాక్టర్ ఎం.లక్ష్మీనారాయణ, డాక్టర్ ఎం.వెంకటయ్య, డాక్టర్ బి.రాజేశ్వరి, డాక్టర్ మాధవిలతో కూడిన బృందం వివిధ ప్రాంతాల్లో పర్యటించి వేప నమూనాలు సేకరించి యూనివర్సిటీ ల్యాబ్‌లో వారం పాటు బీఓడీ ఇంక్యుబేటర్‌లో ఉంచి పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఫొమోప్సిస్ అజాడిరెక్టే, ఫ్యుజేరియం ఫంగస్ భారీగానే ఉన్నట్టు తేలింది. అయితే ఈసారి వాటిపై రసాయనాలు పిచికారీ చేయాల్సిన అవసరం లేదని, మళ్లీ పొడి వాతావరణం వచ్చేసరికి ఫంగస్‌ను వేప జయిస్తుందని
పరిశోధన విభాగం సంచాలకులు జగదీశ్వర్ పేర్కొన్నారు.
భారీ వర్షాలతోనే..
గతేడాది ఆశించిన శిలీంధ్రం పూర్తిగా మాయం కాకముందే వరసపెట్టి భారీగా కురిసిన వర్షాలతో మళ్లీ అది ఉత్తేజితం అయిందని జగదీశ్వర్ చెప్పారు. మధ్యలో దాదాపు పక్షం రోజుల పాటు పూర్తి పొడి వాతావరణం కొనసాగిన సమయంలో వీచిన గాలులకు శిలీంద్రం వాతావరణంలో కలిసి మిగతా ప్రాంతాలకు వేగంగా విస్తరించిందని పేర్కొన్నారు. అయితే దాన్ని తట్టుకునే శక్తి వేపకు ఈపాటికే వచ్చిందని, భారీ నష్టం లేకుండానే క్రమంగా అది తగ్గుముఖం పడుతుందని వివరించారు. కానీ సీజనల్ వ్యాధి మాదిరి కొన్నేళ్లపాటు వేపను ఆశించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
గతేడాది క్రిమినాశకాలు, శిలీంధ్ర నాశకాలను ప్రభుత్వానికి సిఫారసు చేసినప్పటికీ, ఈ సారి మాత్రం అలాంటి సిఫారసులు చేయటం లేదని తెలిపారు. నర్సరీల్లో పెంచే వేప మొక్కలకు మాత్రం మందులను పిచికారీ చేయాల్సిన అవసరం ఉంటుందని పేర్కొన్నారు. కార్బెండిజమ్, మాంకోజెబ్, థియామెథాక్సమ్, అసెటామాప్రిడ్‌లను పిచికారీ చేయొచ్చని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment