సాక్షి, హైదరాబాద్: సీజనల్ వ్యాధులను నియంత్రిస్తూనే.. కరోనా వంటి వైరస్‌లను అరికట్టేందుకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కేలెండర్ రూపొందించింది. ఏ సీజన్లో ఏయే వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది... ప్రభుత్వం, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి అన్న సమాచారాన్ని అందులో వివరించింది. జూలై నుంచి అక్టోబర్ మధ్య డెంగీ, మలేరియా, సీజనల్ జ్వరాలు, నవంబర్–మార్చి మధ్య స్వైన్‌ఫ్లూ, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు, ఏప్రిల్–జూన్ మధ్యకాలంలో వడదెబ్బ, డయేరియా వంటివి ఇబ్బంది పెడతాయని వెల్లడించింది.
ఈ మేరకు సవివర సీజనల్ కేలెండర్‌ను విడుదల చేసింది. కానీ కరోనా మాత్రం సీజన్‌కు సంబంధం లేకుండా ఏడాది పొడవునా ఎప్పుడైనా సోకే ప్రమాదం ఉంటుందని హెచ్చరించింది. ఇప్పటికే కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. పైగా కరోనా, డెంగీ వంటి వాటి లక్షణాలు సమీపంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో సీజనల్ వ్యాధులను ఎదుర్కొనడానికి అన్ని ప్రభుత్వ శాఖలు కలిసి పనిచేయాలని, కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖ సూచించింది.
గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు కీలక పాత్ర పోషించాలని.. పారిశుధ్యంపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని కోరింది. ఇక సీజనల్ అంటువ్యాధులను ఎదుర్కొనేందుకు 24 గంటలూ నడిచే ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసింది. అంటువ్యాధులకు సంబంధించిన సమస్యలను ఈ సెల్ ద్వారా ఉన్నతాధికారులకు తెలియజేయవచ్చని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment