Neem Tree Dying Mysteriously Here Are Reasons - Sakshi
Sakshi News home page

ఉన్నట్టుండి వేప చెట్లు ఎండిపోతున్నాయి.. కారణం తెలియట్లేదు!!

Published Tue, Oct 26 2021 11:23 AM | Last Updated on Tue, Oct 26 2021 3:06 PM

Neem Trees Dying Mysteriously Here Are Reasons - Sakshi

వ్యవసాయంలో చీడ పీడల నియంత్రణతోపాటు ఆయుర్వేదంలోనూ కీలక పాత్ర నిర్వహించే వేప చెట్టుకు పెను కష్టం వచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో వేప చెట్లు చిగుర్ల దగ్గర నుంచి కింది వరకు క్రమంగా నిలువునా ఎండిపోతున్నాయి. 

అనంతపురం, కర్నూలు తదితర రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాలోనూ వేపచెట్లు ఎండిపోతున్నాయని సమాచారం. మొవ్వులు, చిగుర్లు, లేత కొమ్మలు, ఆకులు ఎర్రగా మారి రాలిపోతున్నాయి. పూత, కాయలు కుళ్లిపోతున్నాయి. తీవ్రత ఎక్కువగా ఉంటే ఎంత ముదురు చెట్టయినా కొద్ది రోజుల్లోనే చనిపోతున్నది. కొన్ని ప్రాంతాల్లో దాదాపు పది శాతం చెట్లు చనిపోయినట్లు చెబుతున్నారు. పొలాలు, బంజరు భూముల్లోనే కాకుండా.. బెంగళూరు, హైదరాబాద్, అనంతపురం వంటి నగర, పట్టణ ప్రాంతాల్లోనూ వేప చెట్లు చనిపోతున్నాయి. 

కారణం ఏమిటి?
‘డై బ్యాక్‌ డిసీజ్‌’ అని కొందరు, కాదు ‘టి మస్కిటో బగ్‌’ వల్ల అని మరికొందరు నిపుణులు చెబుతుండటంతో స్పష్టత కరువైంది. మట్టి ద్వారా వ్యాపించే తెగుళ్లు, పంటలను నష్టపరిచే పురుగులను వికర్షింపుజేయటంలో వేప పిండి, వేప నూనె కీలకపాత్ర నిర్వహిస్తాయి. ముఖ్యంగా సేంద్రియ/ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటించే రైతులు ఈ తెగులుతో వేప చెట్లు ఉన్నట్టుండి చనిపోతుండటం, కాయలు కుళ్లిపోతుండటం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

తెగులు/పురుగు బారిన పడిన వేప చెట్టు భాగాలను తొలగించి నాశనం చేయటం ద్వారా వ్యాప్తిని అరికట్ట వచ్చని అంటున్నారు. శిలీంధ్ర నాశనులైన పురుగుమందులను చెట్లపై పిచికారీ చేయాలని కొందరు చెబుతుంటే.. ఏ శాఖ వారు పిచికారీ చేయాలన్నది సమసోయ. చెట్టు మొదటు చుట్టూ మందు కలిపిన నీటిని పోయటం ద్వారా వేపచెట్లను రక్షించుకోవచ్చని మరికొందరు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేరళ, కర్ణాటక, తమిళనాడు, గోవా, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో జీడిమామిడి పంటకు ఎక్కువగా టీ మస్కిటో పురుగు ఆశిస్తున్నదని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జామ, చింత, మిరప, ఆపిల్, కోకోకూ ముప్పు ఉందట.

అటవీ శాఖ ఆధ్వర్యంలో విస్తృత పరిశోధనలు అవసరం వేప చెట్లకు ఈ బెడద కొత్తది కాదు. గత కొన్ని సంవత్సరాలుగా ఇటువంటి సమస్య ఎదురవుతూనే ఉందని చెబుతున్నారు. తెగులు/పురుగు తీవ్రత చాలా ఎక్కువగా ఉంటే చెట్టు చనిపోతున్నట్లు గుర్తించారు. ఒక మోస్తరుగా ఉంటే ఆ సీజన్‌కు ఆకులు ఎండిపోయినా, తర్వాత వర్షాకాలంలో మళ్లీ చిగురిస్తున్నట్లు చెబుతున్నారు. 

అటవీ శాఖ పరిధిలోని పరిశోధనా స్థానాల శాస్త్రవేత్తలు, జాతీయ పరిశోధనా సంస్థలు ఈ సమస్యపై ఇప్పటి వరకు దృష్టి కేంద్రీకరించినట్లు సమాచారం లేదు. వ్యవసాయ విశ్వవిద్యాలయాల సమన్వయంతో విస్తృతంగా పరిశోధనలు జరిపి వేపను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు, రైతులు అభిప్రాయపడుతున్నారు. 



‘టీ మస్కిటో బగ్‌’తోనే చెట్లు ఎండుతున్నాయి
►‘టీ మస్కిటో బగ్‌’ రాత్రిళ్లు వేప చెట్లపై చేరి రసం పీల్చటమే కారణం  
►సుడి భాగం నుంచి క్రమంగా వేర్లతో సహా ఎండిపోతున్న చెట్లు 

అనంతపురం జిల్లా వ్యాప్తంగా వందలాది వేప చెట్లు ఎండుముఖం పడుతున్న పరిస్థితి నెలకొంది. అటవీ శాఖ లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా 10 లక్షల సంఖ్యలో వేప చెట్లు ఉన్నాయి. అందులో ఇప్పటికే 20 శాతం చెట్లు ఎండుముఖం పట్టినట్లు అంచనా వేస్తున్నారు.

టీ మస్కిటో బగ్‌ అనే పురుగు ఆశించడం వల్ల వేపచెట్లు ఎండుతున్నట్లు ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుబంధంగా ఉన్న వ్యవసాయ పరిశోధనా కేంద్రం (ఏఆర్‌ఎస్‌), కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) శాస్త్రవేత్తలు తెలిపారు. ‘టీ మస్కిటో బగ్‌’ అనే పురుగు ఆశించడం వల్ల సుడి భాగం క్రమంగా రెమ్మలు, కొమ్మలు, కాండం ఎండిపోయే పరిస్థితి ఉంటుందన్నారు. నాలుగైదు సంవత్సరాలకు ఒకసారి ఇలా జరుగుతూ ఉంటుందని తెలిపారు. 

టీ మస్కిటో బగ్‌ సగటు జీవిత కాలం 22 రోజులు. ఈ పురుగు ఉదయం, సాయంత్రం వేప చెట్లను ఆశించి రసం పీల్చడం వల్ల చెట్లు ఎండుతున్నదని అంటున్నారు. పగటి సమయం ఎక్కడైనా పొదల్లో దాక్కుని ఉంటుందని తెలిపారు. అధిక వర్షాలకు కూడా ఇలా జరుగుతుందన్నారు. ఇది నల్లటి తల, ఎర్రటి గోధుమ రంగులో ఉంటుందన్నారు.
 
పూర్తి స్థాయి పరిశోధనలు జరగాలి
సర్వరోగ నివారణిగా, పరమ పవిత్రంగా భావించే వేప చెట్లకు ఇలాంటి పరిస్థితి రావడం వల్ల రైతులు, గ్రామీణ ప్రాంత ప్రజలు ఆవేదన చెందుతున్నారు. మా కళాశాల ఆవరణలో ఉన్న వేప చెట్టు పూర్తిగా ఎండిపోయింది. దీనిపై పూర్తిస్థాయి పరిశోధనలు జరగాలి. నివారణ చర్యలు చేపట్టాలి. సమస్య ఉన్న చెట్లపై బావిస్టన్‌ మందు పిచికారీ చేస్తే ఫలితం ఉంటుంది. 
– డాక్టర్‌ ఎల్‌.నాగిరెడ్డి (90529 36150), 
వృక్ష శాస్త్ర సహాయ ఆచార్యులు, 
మాస్టర్‌ మైండ్స్‌ డిగ్రీ కళాశాల, అనంతపురం


అప్పుడప్పుడు ఇంతే.. ఆందోళన వద్దు..
‘టీ మస్కిటో బగ్‌’ ఆశించడం వల్ల వేప చెట్లు ఎండుతున్నాయి. అధిక వర్షాలు, వాతావరణ మార్పుల వల్ల అప్పుడపుడు ఇది ఆశిస్తుంది. పురుగు ఉధృతి మరీ ఎక్కువగా ఉంటే 10 శాతం లోపు చెట్లు చనిపోవచ్చు. లేదంటే, చలికాలం తగ్గిన తర్వాత చెట్లన్నీ తిరిగి కొత్త చిగుర్లు వేయడం గతంలో చూశాం. ఈ పురుగు నివారణకు 2 మి.లీ. ప్రొపినోఫాస్‌ లేదా 0.2 గ్రాముల థయోమిథాక్సామ్‌ లేదా 2 మి.లీ. డయోమిథోయేట్‌ లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేస్తే ఫలితం ఉంటుంది. 
– డాక్టర్‌ పి.రాధిక  (94905 40120), 
ప్రధాన శాస్త్రవేత్త, కీటక శాస్త్ర విభాగం, 
వ్యవసాయ పరిశోధనా స్థానం, 
రేకులకుంట, అనంతపురం జిల్లా 


గోరింటాకు ద్రావణం పిచికారీ చేయాలి
సహజ ఔషధ గుణాలున్న వేప చెట్లు ‘వేప డై బాక్‌ వ్యాధి’ నాశనం అవుతున్నాయి. ఈ శిలీంధ్రపు వ్యాధిని మొదటగా డెహ్రాడూన్‌ అడవుల్లో 1997లో కనుగొన్నారు. ఇది ‘ఫామోఫ్సిస్‌ ఆజాడిరక్టే’ అనే శిలీంద్రం వల్ల వస్తుందని మైసూర్‌ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సతీష్, శంకర్‌ భట్, దేవకి గుర్తించారు. లేత చిగుళ్లు, కొమ్మలు నల్లగా మాడిపోవడం, పూలు వాడిపోవడం, కాయలు కుళ్ళి పోవటం దీని ముఖ్య లక్షణాలు. వర్షాకాలంలో ప్రారంభమై చలికాలం వరకు తీవ్రంగా ఉంటుంది. సంవత్సరం అంతా ఈ వ్యాధి ప్రబలుతూనే ఉంటుంది. దీని వల్ల నూటికి నూరు శాతం కాయలు కుళ్ళి పోతాయి. ఈ వ్యాధి వర్షం నీరు, కీటకాలు, గాలి ద్వారా వ్యాపిస్తుంది. చాలా తక్కువ సమయంలోనే వేప చెట్లు చనిపోయే అవకాశం ఉంది. దీని నివారణకు గోరింటాకును ముద్దగా నూరి కొమ్మల చివర్లపై పిచికారీ చెయ్యాలి. అంతే కాక బావిస్టీన్, కాలిజిన్, మోనోక్రోటోపాస్‌ లాంటి శిలీంద్ర నాశక మందులు లేదా నీలగిరి నూనె, మిరియాల నూనె వంటి వాటితో కూడా తగ్గే అవకాశం వుంది. 
– డా. బి.సదాశివయ్య(99635 36233), 
వృక్ష శాస్త్ర సహాయ ఆచార్యులు, 
డా. బీఆర్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జడ్చర్ల 

సేంద్రియ పత్తిపై శిఖరాగ్రసభ

అంతర్జాతీయంగా పత్తి సాగు విస్తీర్ణంలో ఒక్క శాతం మాత్రమే సేంద్రియ పద్ధతుల్లో సాగువుతోంది. పత్తి సాగును మరింత ఎక్కువ విస్తీర్ణంలో సేంద్రియం వైపు మళ్లించి, సేంద్రియ పత్తితో తయారు చేసిన వస్త్రాలను మార్కెట్‌లోకి తేవటం ద్వారా రైతు ఆదాయం పెంపొందించవచ్చు. భూమి ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కూడా జరుగుతాయని న్యూజిలాండ్‌కు చెందిన లాభాపేక్ష లేని సంస్థ ‘ఆర్గానిక్‌ కాటన్‌ యాక్సిలరేటర్‌’ భావిస్తోంది. సేంద్రియ పత్తి సాగును విస్తరింపజేయడానికి ఉన్న అవకాశాలు, సవాళ్లపై చర్చించేందుకు నవంబర్‌ 8,9 తేదీల్లో అంతర్జాతీయ శిఖరాగ్రసభను ఈ సంస్థ నిర్వహిస్తోంది. ఆసక్తి గల వారు వర్చువల్‌గా జరుగుతున్న ఈ సభలో ఉచితంగా రిజిస్టర్‌ చేసుకొని పాల్గొనవచ్చు.. www.organiccottonaccelerator.org

ప్రకృతి వ్యవసాయంపై 6 వారాల శిక్షణ
బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ‘భూమి కాలేజి’ ప్రకృతి వ్యవసాయంపై ఔత్సాహికులకు లోతైన అవగాహన కల్పించే లక్ష్యంతో 6 వారాల పాటు ఆంగ్ల మాధ్యమంలో రెసిడెన్షియల్‌ శిక్షణ ఇవ్వనుంది. డిసెంబర్‌ 6 నుంచి జనవరి 15 వరకు.  ఇప్పటికే ప్రకృతి వ్యవసాయం చేస్తూ అనుభవం గడించిన వారు పాఠాలు చెబుతారు. పొలాలు చూపిస్తారు. నలుగురితో కలిసి మెలసి స్వయంగా వ్యవసాయ పనులు చేయటం, ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని స్వీకరించడం వంటి అంశాలపై శిక్షణ ఇస్తారు. ఫీజు రూ. 40 వేలు. వివరాలకు.. www.bhoomicollege.org

చదవండి: 65 ఏళ్ల ఎదురుచూపు.. మరణం వరకు.. అద్భుత ప్రేమ గాథ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement