♦ రేపు ఐరాస సమావేశంలో సంతకం చేయనున్న జవదేకర్
♦ పలు కీలక నిర్ణయాలకు కేంద్ర కేబినెట్ పచ్చజెండా
న్యూఢిల్లీ: పారిస్‌లో జరిగిన పర్యావరణ సదస్సు ఒప్పందంపై సంతకం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. శుక్రవారం న్యూయార్క్‌లో జరగనున్న కార్యక్రమంలో భారత్ తరఫున పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈ ఒప్పందంపై సంతకం చేయనున్నారు. గతేడాది నవంబర్‌లో పారిస్‌లో జరిగిన సదస్సులో 190 దేశాలు ముక్త కంఠంతో ఈ ఒప్పందానికి మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. కాగా, పశ్చిమబెంగాల్ మాల్దా జిల్లాలోని ఫరక్కా బ్యారేజీకి చెందిన 59 ఎకరాలను సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్)కు బెటాలియన్ ఏర్పాటుచేసుకునేందుకు కేంద్రం అనుమతిచ్చింది.
నకిలీ కరెన్సీ స్మగ్లింగ్‌కు కేంద్రమైన మాల్దాలో బీఎస్‌ఎఫ్ బెటాలియన్ ఏర్పాటు అవసరమైనందునే కేంద్ర జల వనరుల మంత్రిత్వశాఖ భూమిని రక్షణశాఖకు బదిలీ చేస్తున్నట్లు ప్రధాని అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ‘పరిహారక అటవీకరణ నిధి బిల్లు-2015’కు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. రెండోవిడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న ఈ బిల్లు ద్వారా నిరుపయోగంగా ఉన్న అటవీభూమిలో వృక్షాల పెంపునకు రూ.40 వేల కోట్ల నిధిని కేటాయించనున్నారు. దీంతోపాటు బెహరైన్, కువైట్, నేపాల్, దక్షిణ కొరియా, శ్రీలంక, వియత్నాం, బ్రిక్స్ దేశాలతో కుదుర్చుకున్న యూత్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమాలను కేబినెట్ ప్రశంసించింది.
జాతీయ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్, వధ్వానీ ఆపరేటింగ్ ఫౌండేషన్ (డబ్ల్యూఓఎఫ్) మధ్య ఇంతకుముందే కుదిరిన ఒప్పందానికీ కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఈ ఒప్పందం ద్వారా దేశవ్యాప్తంగా నైపుణ్యాభివృద్ధికోసం కాలేజీలు, వర్సిటీలు నెలకొల్పనున్నారు. దీంతోపాటుచిలీ ప్రభుత్వంతో వ్యాపార బంధాన్ని మరింత విస్తృతం చేసుకునే ఒప్పందం, భూటాన్‌తో ఇంజనీరింగ్ మౌలిక వసతుల విషయంలో సాంకేతిక సహకారం, సామర్థ్య నిర్మాణం విషయంలో ద్వైపాక్షిక సంబంధాల ఒప్పందానికి కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
పర్యావరణ ఒప్పందానికి ఓకే
Published Thu, Apr 21 2016 1:28 AM | Last Updated on Sun, Sep 3 2017 10:21 PM
Advertisement