Minister Prakash Javadekar
-
యూజీసీ రద్దుకు కేంద్రం నిర్ణయం
న్యూఢిల్లీ: దేశంలోని ఉన్నత విద్యాసంస్థలకు నిధుల్ని అందజేస్తున్న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ)ను రద్దుచేయాలని నిర్ణయించినట్లు కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి జవదేకర్ చెప్పారు. దీనిస్థానంలో హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(హెచ్ఈసీఐ)ను ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకోసం యూజీసీ చట్టం–1951ను రద్దు చేస్తామన్నారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న హెచ్ఈసీఐ కోసం ముసాయిదా బిల్లును రూపొందించామన్నారు. జూలై 18 నుంచి ప్రారంభంకానున్న పార్లమెంటు వర్షకాల సమావేశాల్లో హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా బిల్లు–2018ను ప్రవేశపెడతామన్నారు. తాజా బిల్లు ప్రకారం హెచ్ఈసీఐ కేవలం విద్యా సంబంధమైన విషయాలపై దృష్టి సారిస్తుందనీ, విద్యాసంస్థలకు గ్రాంట్లు జారీచేసే అధికారం మానవవనరుల శాఖకు దక్కుతుందని వెల్లడించారు. అలాగే, విద్యా సంస్థల స్థాపనకు అనుమతులు, నిబంధనలు పాటించని వర్సిటీలు, కళాశాలల గుర్తింపును రద్దుచేసే అధికారం హెచ్ఈసీఐకి ఉంటుందన్నారు. విద్యా ప్రమాణాల్ని మెరుగుపర్చడంలో భాగంగా హెచ్ఈసీఐ సూచనలు ఇచ్చేందుకు సలహా మండలిని ఏర్పాటు చేస్తారు. సలహా మండలిలో అన్ని రాష్ట్రాల ఉన్నత విద్యా మండళ్ల చైర్మన్లు, వైస్ చైర్మన్లు సభ్యులుగా ఉంటారని తెలిపారు. నియంత్రణ యంత్రాంగాన్ని సంస్కరించేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. -
బయోమెట్రిక్ హాజరు అమలయ్యేనా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు అన్నింటిలో దశల వారీగా బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రవేశ పెడతామన్న విద్యాశాఖ ఆచరణలో మాత్రం చేయలేకపోతోంది. రెండేళ్ల కిందటే మొదటి విడతగా 6,391 (25 శాతం) ప్రాథమిక పాఠశాలల్లో ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టినా అమలుకు నోచుకోలేదు. వాటి ఏర్పాటుకోసం మూడుసార్లు టెండర్లు పిలిచినా సదరు సంస్థలు ముందుకు రాకపోవడంతో ఆచరణలోకి తేలేకపోయామని విద్యాశాఖ చెబుతోంది. అయితే టెండర్ల సమస్యతోపాటు నిధుల సమస్యకూడా బయోమెట్రిక్ హాజరు విధానానికి అడ్డంకిగా మారుతుందన్న వాదనలు ఉన్నాయి. ఏదేమైనా ఈ విద్యా సంవత్సరంలో పక్కాగా అమలు చేస్తామని అధికారులు చెబుతున్నా ఎంతమేరకు చేస్తారన్నది తేలాల్సి ఉంది. అవసరమైన చోట వదిలేసి.. బయోమెట్రిక్ హాజరు విధానం అమలు విషయంలో విద్యాశాఖ తీరు పుండు ఒక చోట, మందు మరో చోట అన్న చందంగా తయారైంది. వాస్తవానికి బయోమెట్రిక్ హాజ రు విధానం ముందుగా ప్రవేశపెట్టాల్సింది ప్రాథమిక పాఠశాలల్లో అయినప్పటికీ, ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటుచేసే ఆలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. కానీ ప్రాథమిక పాఠశా లలకు టీచర్లు సరిగ్గా రాకపోవడం, వచ్చినా వెంటనే వెళ్లిపోవడం, ఇద్దరు ఉన్నచోట ఒక్కరే బడికి రావడం, ఒకరు ఒకవారం వస్తే, మరొ కరు ఇంకో వారం బడికి వస్తున్నట్లు విద్యా శాఖ సర్వేల్లోనే తేలింది. అలాంటి పరిస్థితుల వల్లే ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో నమ్మకం సన్నగిల్లింది. టీచర్లే బడికి సరిగ్గా రారు అన్న అపవాదును ఎదుర్కొంటోంది. అంతేకాదు ఆ పరిస్థితుల కారణంగా తల్లిదం డ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడులకు పంపించడం లేదు. ప్రైవేటు స్కూళ్లలో చదివించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ బడులపై నమ్మకం కలగాలంటే ముందుగా ప్రాథమిక పాఠశాలలపై నమ్మకాన్ని పెంచాల్సి ఉంది. ఇందుకు బయోమెట్రిక్ హాజరు విధానం కొంత దోహదం చేస్తుంది. అందుకే ముందుగా ప్రాథమిక విద్య పటిష్టంకోసం వాటిల్లో బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేయాలని విద్యాశాఖకు చెందిన అధికారులే పేర్కొంటున్నారు. నిధుల సమస్య అధిగమించేనా? రెండేళ్ల కిందట 6,391 ప్రాథమిక పాఠశాలల్లో బయోమెట్రిక్ పరికరాల ఏర్పాటుకు ఎస్ఎస్ఏ నిధులను వెచ్చించేందుకు సిద్ధమైంది. ఒక్కో పరికరానికి రూ.7 వేల అంచనాతో విద్యాశాఖ రూ.4.47 కోట్లు వెచ్చించేలా ప్రణాళికలు వేసింది. మిగతా 75 శాతం పాఠశాలల్లో బయోమెట్రిక్ ఏర్పాటుకు నిధులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అప్పట్లో రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు విజ్ఞప్తి చేసినా, ఆశించిన లాభం చేకూరలేదు. దీంతో నిధుల సమస్య కూడా బయోమెట్రిక్ హాజరు విధానం అమలుకు అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో ఈసారి బడ్జెట్లో నిధులను కేటాయించి అమలు చేస్తారా? లేదా? అన్నది త్వరలోనే తేలనుంది. -
నవోదయ’కు 27లక్షల దరఖాస్తులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాల కోసం 27లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఆరో తరగతిలో ప్రవేశాలకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వ తేదీన జరిగే రాత పరీక్షకు గత ఏడాది కంటే 5లక్షల మంది ఎక్కువగా దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఈ పరీక్షకు ఇంతమంది దరఖాస్తు చేసుకోవటం ఇదే ప్రథమమని చెప్పారు. మొత్తం 601 జిల్లాల్లోని 623 పాఠశాలల్లో ఉన్న 45,000 సీట్లను ఈ ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేస్తారని తెలిపారు. -
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీదే అధికారం
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ సాక్షి,బళ్లారి: పార్టీలో నేతలంతా ఏక తాటిపై నడుస్తుండటంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు. ఆయన శనివారం నగరంలోని నక్షత్ర హోటల్లో బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. తాను మూడు రోజులుగా ఉత్తర కర్ణాటకలోని పలు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించానని, ప్రతి తాలూకాలో కూడా బీజేపీకి జనం బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి కులాల మధ్య చిచ్చు పెట్టి విడదీసే ధోరణిలో పని చేస్తున్నారన్నారు. ఆయన వ్యక్తులను, సమాజాన్ని చీలిస్తే తాము ఒకటి చేస్తూ అభివృద్ధి చేస్తున్నామన్నారు. యడ్యూరప్పను కేసుల్లో ఇరికించాలని సీఎం, ఇతర ప్రముఖులు ఎంతో ప్రయత్నించారన్నారు. అయితే వారి ఎత్తులు చిత్తు అయ్యాయని, యడ్యూరప్పకు కోర్టు నుంచి ఊరట లభించిందన్నారు. దీంతో కాంగ్రెస్ వారికి ఏమి మాట్లాడలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతు రుణాలు మాఫీ చేయడంలో సీఎం మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అన్నభాగ్య పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తోందని గొప్పలు చెప్పుకుంటున్నారని, అయితే ఆ పథకానికి మెజార్టీ శాతం నిధులు కేంద్రానివే అనే విషయం ముఖ్యమంత్రి మరువ రాదన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టేందుకు బీజేపీ కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బళ్లారి ఎంపీ శ్రీరాములు, మాజీ ఎమ్మెల్యే సోమశేఖరరెడ్డి, ఎమ్మెల్యేలు సురేష్‌బాబు, నాగేంద్ర, జిల్లా బీజేపీ అధ్యక్షుడు చెన్నబసవనగౌడ తదితరులు పాల్గొన్నారు. -
‘స్వచ్ఛత’ అవార్డులు ప్రదానం చేసిన కేంద్రం
ఉత్తమ గ్రామాల రూపకల్పనలో కలెక్టర్లు అమ్రపాలి, భారతీలకు అవార్డులు సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా స్వచ్ఛతా అభియాన్‌ను పెంచేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ప్రణాళికలు చేస్తోంది. స్వచ్ఛత పాటిం చడంలో ప్రతిభ చూపిన వివిధ విద్యా సంస్థలకు, జిల్లాల్లో మోడల్ గ్రామాలను తయారు చేసిన జిల్లా కలెక్టర్లకు అవార్డులు ప్రదానం చేసింది. జిల్లాల్లో స్వచ్ఛతకు పెద్దపీటవేస్తూ ఆదర్శ గ్రామాలను రూపొందించినందుకుగానూ వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రపాలి, మెదక్ జిల్లా కలెక్టర్ భారతీ హోళికేరి వరుసగా మూడు, నాలుగు ర్యాంకులతో అవార్డులు అందుకున్నారు. గురువారం ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ వీరికి అవార్డులు ప్రదానం చేశారు. వరంగల్ అర్బన్ జిల్లాలోని శంభునిపల్లి, మెదక్ జిల్లాలో ముజ్రంపేట గ్రామాలను స్వచ్ఛత విషయంలో ఆదర్శంగా తీర్చిదిద్దినందుకు కలెక్టర్లకు ఈ అవార్డులు దక్కాయి. అలాగే సాంకేతిక విద్యాసంస్థల విభాగంలో గుంటూరు కేఎల్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ విభాగం రెండో ర్యాంకు సాధించి అవార్డు అందుకుంది. వర్సిటీ తరఫున డీన్ కె.శరత్‌కుమార్ కేంద్ర మంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. -
‘కమిషన్ల’పై దద్దరిల్లిన రాజ్యసభ
- ఎగువసభలో వాయిదాల పర్వం - రియల్ ఎస్టేట్ రంగంలో నియంత్రణకు బీజేపీ ఎంపీ డిమాండ్ న్యూఢిల్లీ: విపక్షాల ఆందోళనలతో రాజ్యసభ మంగళవారం దద్దరిల్లింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కమిషన్లలో ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ విపక్షాలన్నీ ఆందోళన చేపట్టడంతో పలుమార్లు వాయిదా పడింది. ఖాళీల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని కేంద్రం వెల్లడించినా.. వారం రోజుల్లో భర్తీ చేయాలని కాంగ్రెస్, ఎస్పీ, జేడీయూ, బీఎస్పీ డిమాండ్ చేస్తూ సభాకార్యక్రమాలకు ఆటంకం కలిగించాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లో ఉండటం కారణంగానే ఈ ప్రక్రియ ఆలస్యమైందని సామాజికన్యాయం, సాధికారత మంత్రి థావర్‌చంద్ గెహ్లాట్ నిరసనల మధ్యే ప్రకటించారు. 2007, 2010ల్లో కాంగ్రెస్ హయాంలో కమిషన్లలో ఖాళీల భర్తీ ఐదు నెలలు ఆలస్యంగా చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు. అయినా.. ఇప్పుడే దీనిపై వాయిదా తీర్మానం కింద చర్చ జరగాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. దీనికి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ తిరస్కరించారు. ‘అన్ని కమిషన్లు పనిచేస్తున్నాయి. ఖాళీల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. అవన్నీ త్వరలోనే భర్తీ చేస్తాం’ అని వెంకయ్యనాయుడు కూడా సభలో వెల్లడించారు. అయినా విపక్షాల నిరసన తగ్గకపోవటంతో సభను బుధవారానికి వాయిదా వేశారు. నిధుల కొరత లేదు: జవదేకర్ నేషనల్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ, సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ చట్టం– 2007 (సవరణ)ను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి ప్రకాశ్ జవదేకర్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. తిరుపతి, బర్హంపూర్ ఐఐటీలఏర్పాటు నిబంధనల్లో స్వల్ప మార్పు లు చేశామన్నారు. జాతీయ ప్రాముఖ్యత ఉన్న సంస్థలకు నిధుల కొరతేమీ లేదని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. ఈ బిల్లు ఆమోదం ద్వారా ఐఐఎస్ఈఆర్ సంస్థలు ఐదు నుంచి ఏడుకు పెరిగాయి. ప్రతి ఏడాది ఐఐఎస్ఈఆర్లకు రూ.900 కోట్లు, ఐఐఎస్‌సీలకు రూ. 300 కోట్ల బడ్జెట్ కేటాయించనున్నారు. మరోవైపు, దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంలో భాగమైన స్టీల్, సిమెంట్, ఇసుక, ఇటుకలు వంటివాటిపై నియంత్రణ కోసం ఓ సంస్థను ఏర్పాటుచేయాలని బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ సింగ్ డిమాండ్ చేశారు. ట్రాయ్, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్స్ ఉన్నట్లే.. రియల్ ఎస్టేట్ రంగంలోనూ నియంత్రణ అవసరమన్నారు. ట్రయల్ కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేసేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటుచేయాలని సీపీఎం ఎంపీ పీకే శ్రీమతి టీచర్ కేంద్రాన్ని కోరారు. -
‘నీట్’పై అందరితో చర్చిస్తాం
ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్న కు మంత్రి ప్రకాశ్ జవదేకర్ సమాధానం సాక్షి, హైదరాబాద్: ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి జాతీయస్థాయిలో అందరికీ కలిపి ఒకే ప్రవేశ పరీక్ష ‘నీట్’ నిర్వహణపై తుదినిర్ణయం తీసుకునేముందు సంబంధమున్న వారందరితో చర్చిస్తామని కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ రాజ్యసభలో విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకిచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ఇంజినీరింగ్ విద్యలో ప్రవేశానికి దేశవ్యాప్తంగా పలు విధానాలుండటం సరికాదని, ఒక్కొక్కచోట ఒక్కొక్క తీరులో ప్రవేశ పరీక్షలుండటం కూడా ప్రయాసలతో కూడుకున్నదని, అందువల్ల దేశమంతటికీ ఒకే పరీక్ష నిర్వహించడం ఎంతైనా సబబని ఏఐసీటీఈ సాంకేతిక సమీక్ష కమిటీ గట్టిగా సిఫార్సు చేసిందని వివరించారు. జనవరి 17 జరిగిన ఏఐసీటీఈ కౌన్సిల్ సమావేశంలోనూ ఈ సిఫా ర్సులపై విస్తృతంగా చర్చించారని, తుదినిర్ణయం తీసుకునేముందు అందరితో సంప్రదింపులు జరపా లని కూడా నిర్ణయించారని తెలిపారు. కాగా విశాఖ ఐఐఎం డైరెక్టర్ నియామకంలో జాప్యమెందుకు జరుగుతోందని కూడా విజయసాయిరెడ్డి గురువారం ప్రశ్నించారు. దీనిపై కేంద్ర మానవ వనరులశాఖ సహాయమంత్రి మహేంద్రనాథ్ పాండే లిఖితపూర్వక సమాధానమిస్తూ.. సెర్చ్ కమ్ సెలెక్షన్ కమిటీని నియమించామని తెలిపారు. అయితే ఆ జాబితాలో విశాఖ ఐఐఎం డైరెక్టర్‌ను ఎప్పుడు నియమిస్తారో ప్రస్తావించక పోవడం విశేషం. -
అటవీ భూములు డీనోటిఫై
కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ అనంతపురం సెంట్రల్/ న్యూటౌన్: కొత్తగా ఏర్పడే రాష్ట్రాల రాజధాని నిర్మాణానికి అటవీభూములను డీనోటిఫై చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో ఐదు ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. సోమవారం ఆయన అనంతపురంలోని డీఆర్డీఏ అభ్యుదయ హాల్లో ఏర్పాటు చేసిన మేధావుల సదస్సులో పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. విదేశీబ్యాంకుల్లో ఉన్న నల్లధనం ఇప్పటి వరకూ రూ.5 వేల కోట్లు వెలికితీశామని తెలిపారు. వెంకయ్యను అడగండి..: ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని చట్టంలో ఎక్కడైనా ఉందా? లేదు కదా! ఇక ఆ విషయం గురించి మాట్లాడవద్దు’ అని జవదేకర్ అన్నారు. హోదా విషయంపై విలేకరులు ప్రశ్నించగా.. చట్టంలో లేనిదానిపై మాట్లాడవద్దని సూచించారు. ప్రత్యేకహోదా, వెనకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీ విషయాలను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడును అడగాలని సూచించారు. పునర్విభజన చట్టంలో పొందుపర్చిన ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి ఒక్కో జిల్లాకు రూ. 50 కోట్లు మాత్రమే కేటాయిస్తున్నారని ప్రస్తావించగా.. అదీ వెంకయ్యనే అడగాలన్నారు. రాష్ట్రాభివృద్ధికి పూర్తి సహకారం అంతకుముందు అనంతపురంలోని లలితకళాపరిషత్తులో జరిగిన ‘వికాస్‌పర్వ్’ విజయోత్సవ సభలో ప్రకాశ్ జవదేకర్ మాట్లాడారు. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ఉచిత విద్యుత్ కేంద్రం చలవే: హరిబాబు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ హరిబాబు మాట్లాడుతూ రాష్ట్రానికి 24 గంటలూ కరెంటు ఉందంటే కేంద్రం అందిస్తున్న సహకారమే కారణమని తెలిపారు. -
డబ్ల్యూహెచ్ఓ నివేదిక తప్పు
వాయుకాలుష్య నివేదికపై మండిపడ్డ జవదేకర్ భారత్‌నే లక్ష్యంగా చేసుకుంటున్న పాశ్చాత్య దేశాలు న్యూఢిల్లీ: వాయుకాలుష్యం పైప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఇటీవల విడుదల చేసిన నివేదిక పూర్తిగా తప్పుదారి పట్టించేదిలా ఉందని కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వాయుకాలుష్యం పెరిగిపోతున్న 100 నగరాల్లో 30 నగరాలు భారత్‌కు చెందినవే ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నివేదకలో పేర్కొనడాన్ని మంత్రి తీవ్రంగా తప్పుపట్టారు. వాయుకాలుష్యంపై పాశ్చాత్య దేశాలు భారత్‌నే లక్ష్యంగా చేసుకోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అమెరికా, ఐరోపాదేశాలతోపాటు భారత్‌లోని నగరాల్లో కాలుష్యంపై త్వరలోనే పూర్తిస్థాయి నివేదికను విడుదల చేస్తామని తెలిపారు. డబ్ల్యూహెచ్‌వో నివేదికలో సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, బెంజిన్ వంటి కీలక కాలుష్య కారకాలను కారణాలుగా చూపలేదన్నారు. 2012-13 నాటి సమాచారాన్ని విశ్లేషించి ఢిల్లీ నగరం వాయుకాలుష్యంలో 11 వస్థానంలో ఉందని.. దీనిపై ప్రపంచ పర్యావరణ వేత్తలు ఆందోళనలు చేయడం సరికాదన్నారు. పీఎం 2.5 స్థాయి ఆధారంగా నగరాల్ని వర్గీకరించారని..కానీ వీటికంటే వాయుకాలుష్యంను పెంచే ఓజోన్ కాలుష్యం, బె ంజిన్ కాలుష్యం, సల్ఫర్ డైయాక్సైడ్, నైట్రోజన్ డైయాక్సైడ్‌లు మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని మంత్రి తెలిపారు. పీఎం స్థాయి 2.5 ఉన్న నగరాలు ప్రత్యేకంగా అమెరికా, ఐరోపా దేశాల్లో చాలా ఉన్నాయన్నారు. త్వరలో తమ ప్రభుత్వం విడుదల చేయబోయే వాయుకాలుష్య నగరాల జాబితాను డబ్ల్యూహెచ్‌వో నివేదికకు కౌంటర్ పార్ట్ కాదని.. కేవలం ప్రజల అవగాహన కోసమేనని మంత్రి వివరించారు. పీఎం 1 పై పర్యవే క్షణకోసం కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు ప్రణాళికలు రూపొందిస్తుందని మంత్రి తెలిపారు. -
పర్యావరణ ఒప్పందానికి ఓకే
♦ రేపు ఐరాస సమావేశంలో సంతకం చేయనున్న జవదేకర్ ♦ పలు కీలక నిర్ణయాలకు కేంద్ర కేబినెట్ పచ్చజెండా న్యూఢిల్లీ: పారిస్‌లో జరిగిన పర్యావరణ సదస్సు ఒప్పందంపై సంతకం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. శుక్రవారం న్యూయార్క్‌లో జరగనున్న కార్యక్రమంలో భారత్ తరఫున పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈ ఒప్పందంపై సంతకం చేయనున్నారు. గతేడాది నవంబర్‌లో పారిస్‌లో జరిగిన సదస్సులో 190 దేశాలు ముక్త కంఠంతో ఈ ఒప్పందానికి మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. కాగా, పశ్చిమబెంగాల్ మాల్దా జిల్లాలోని ఫరక్కా బ్యారేజీకి చెందిన 59 ఎకరాలను సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్)కు బెటాలియన్ ఏర్పాటుచేసుకునేందుకు కేంద్రం అనుమతిచ్చింది. నకిలీ కరెన్సీ స్మగ్లింగ్‌కు కేంద్రమైన మాల్దాలో బీఎస్ఎఫ్ బెటాలియన్ ఏర్పాటు అవసరమైనందునే కేంద్ర జల వనరుల మంత్రిత్వశాఖ భూమిని రక్షణశాఖకు బదిలీ చేస్తున్నట్లు ప్రధాని అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ‘పరిహారక అటవీకరణ నిధి బిల్లు-2015’కు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. రెండోవిడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న ఈ బిల్లు ద్వారా నిరుపయోగంగా ఉన్న అటవీభూమిలో వృక్షాల పెంపునకు రూ.40 వేల కోట్ల నిధిని కేటాయించనున్నారు. దీంతోపాటు బెహరైన్, కువైట్, నేపాల్, దక్షిణ కొరియా, శ్రీలంక, వియత్నాం, బ్రిక్స్ దేశాలతో కుదుర్చుకున్న యూత్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమాలను కేబినెట్ ప్రశంసించింది. జాతీయ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్, వధ్వానీ ఆపరేటింగ్ ఫౌండేషన్ (డబ్ల్యూఓఎఫ్) మధ్య ఇంతకుముందే కుదిరిన ఒప్పందానికీ కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఈ ఒప్పందం ద్వారా దేశవ్యాప్తంగా నైపుణ్యాభివృద్ధికోసం కాలేజీలు, వర్సిటీలు నెలకొల్పనున్నారు. దీంతోపాటుచిలీ ప్రభుత్వంతో వ్యాపార బంధాన్ని మరింత విస్తృతం చేసుకునే ఒప్పందం, భూటాన్‌తో ఇంజనీరింగ్ మౌలిక వసతుల విషయంలో సాంకేతిక సహకారం, సామర్థ్య నిర్మాణం విషయంలో ద్వైపాక్షిక సంబంధాల ఒప్పందానికి కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. -
ఘన వ్యర్థాలపై కొత్త నిబంధనలు
న్యూఢిల్లీ: ఘన వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించడానికి కేంద్రం కొత్త నిబంధనలను తెచ్చింది. ఇకపై.. చెత్తను బహిరంగంగా కాల్చడాన్ని నేరంగా పరిగణిస్తామని పేర్కొంది. స్త్రీలు, పిల్లల న్యాప్కిన్లు, డైపర్లను ఉపయోగానంతరం పారవేయడానికి చిన్నపాటి సంచులను అందిచాల్సిందిగా తయారీ సంస్థలకు స్పష్టం చేసింది. కొత్త నిబంధనల ప్రకారం.. వంద మందికిపైగా హాజరయ్యే వేడుకల్లో నిర్వాహకులే ఘన వ్యర్థాలను తడి, పొడి చెత్తలుగా వేరుచేసి చెత్త సేకరించే వారికివ్వాలి. ప్రత్యేక ఆర్థిక మండళ్లు, పారిశ్రామిక వాడలు, ఉద్యానవనాల మొత్తం స్థలంలో కనీసం 5 శాతం స్థలాన్ని చెత్త సేకరణ, రీసైక్లింగ్‌కు కేటాయించాలి. ఫుట్‌పాత్‌లు, వీధుల్లో అమ్మకాలు జరిపేవారు చెత్తను నిల్వ ఉంచేందుకు చెత్త బుట్టలను తప్పక పెట్టాలి. చెత్త సేకరించే కార్మికులను నమోదు చేసుకుని వారిని క్రమబద్ధీకరించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. చెత్త సేకరణలో వీరి పాత్ర ఎంతో ప్రముఖమని పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్ చెప్పారు. -
వారే పొగుడుతుంటే.. పోరాడటమెలా?
కేసీఆర్‌కు కేంద్ర మంత్రుల ప్రశంసలపై బీజేపీ రాష్ట్ర నేతల అసంతృప్తి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్రమంత్రులు, బీజేపీ జాతీయ నేతలు ప్రశంసలు కురిపించడం ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి మింగుడుపడటం లేదు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన అధికారిక, అనధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న స్పీకరు, కేంద్రమంత్రులు సీఎం కేసీఆర్‌ను, ఆయన కుటుంబ సభ్యులను పొగుడుతూ మాట్లాడారు. ఇది రాష్ట్రస్థాయిలో పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితిని కల్పిస్తోందంటూ బీజేపీ రాష్ట్ర నాయకత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడటానికి ప్రతిబంధకమవుతోందని భావిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఒక కాలేజీ కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవితను ప్రశంసించారు. నిజామాబాద్‌లో మెగా ఫుడ్‌పార్క్ కార్యక్రమంలో కేంద్రమంత్రి హర్సిమ్రత్ కౌర్ రాష్ట్రంలో పాలనాతీరును కొనియాడారు. వరంగల్ ఉప ఎన్నికలు జరుగుతున్న వేళ టీఆర్ఎస్పై, కేసీఆర్ పాలనపై కేంద్రమంత్రి ప్రశంసలు కురిపించడం రాష్ట్ర నాయకత్వానికి ఇబ్బందికరంగా మారింది. ఆదిలాబాద్‌లో పర్యటించిన కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ కూడా రాష్ట్రంలో పాలన బాగుందన్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే తెలుగురాష్ట్రానికే చెందిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కూడా కేసీఆర్‌ను ప్రశంసించ డం మరోఎత్తని నాయకులు భావిస్తున్నారు. వీటితోపాటు రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కూడా కేసీఆర్‌తోనూ, ప్రభుత్వంలోని ముఖ్యులతోనూ సన్నిహితంగా ఉంటున్నారు. ఇవన్నీ రాష్ట్రంలో ప్రతిపక్షపాత్రలో ఉన్న బీజేపీకి రుచిం చడం లేదు. కేంద్రమంత్రులే పొగుడుతుంటే రాష్ట్రస్థాయిలో ఎలా పోరాడాలంటూ రాష్ట్రనేతలు ఇప్పటికే జాతీయ నాయకత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఒకే పార్టీలోని జాతీయ నేతలు పొగడటం, రాష్ట్రనేతలు విమర్శించడం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపిస్తున్నదంటూ జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. -
చెన్నై తరహాలో అమరావతికి ముప్పు
సాక్షి, న్యూఢిల్లీ: చెన్నై వరద బీభత్సం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని విషయంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారని రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు కేంద్రానికి లేఖ రాశారు. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు రాసిన ఈ లేఖను శనివారం మీడియాకు విడుదల చేశారు. కేవీపీ వేసిన ముఖ్యమైన ప్రశ్నలు ఇవీ.. ► 9వ తేదీన అనుమతులు వస్తే పదో తేదీన జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో ఆ సమాచారాన్ని ఎందుకు దాచిపెట్టారు. ఎన్జీటీ ఆదేశించిన తరువాతే ఎందుకు ప్రచురించారు? రహస్యంగా ఎందుకు ఉంచారు? కేంద్ర పర్యావరణ శాఖ సియా అనుమతులు ఇచ్చేసిందని ఎలా ప్రకటిస్తుంది? ► పర్యావరణ ప్రభావానికి లోనయ్యే ప్రాజెక్టుకు సియా అనుమతి ఎలా ఇస్తుంది? ► ప్రభుత్వ కార్యాలయాలకు, పార్కులకు, వాణి జ్య కేంద్రాలకు, నివాస సముదాయాలకు, పరిశ్రమలకు షరతులతో కూడిన అనుమతి ఉందని పర్యావరణ అనుమతి పత్రంలో ఉంది. పరిశ్రమల వివరాలేవీ లేకుండా పర్యావరణ అనుమతులు ఎలా ఇచ్చారు? ► కొండవీటివాగు వల్ల 15 వేల ఎకరాల భూములు ముంపునకు గురవుతాయని ఏపీసీఆర్డీఏ అధికారికంగా తెలిపింది. ఇదంతా సీఆర్డీఏ పరిధిలోకి వస్తుంది. చె న్నై, శ్రీనగర్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో వరదలు సంభవించిన పరిస్థితుల్లో వరద ముప్పు ఉన్న ప్రాంతంలో రాజధాని నిర్మించడం సమంజసమేనా? ► 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రాజధాని నిర్మిస్తున్నామని, ఇందులో 127 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సారవంతమైన భూములు ఉన్నాయని, అలాగే 30 నుంచి 40 శాతం వరకు ఈ ప్రాంతం కృష్ణా నదీ ప్రాంతంలో ఉందని సీఆర్డీయేనే స్వయంగా చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో నదితో పాటు సహజ వనరులు దెబ్బతినవా? ► నదీ పరీవాహక ప్రాంతమంతా కాంక్రీటు వనమైతే చెన్నై తరహాలో వరద ముప్పు సంభవించదా? -
ఉన్నత కులాల్లోని పేదలకు రిజర్వేషన్లు!
న్యూఢిల్లీ: ఉన్నత కులాల్లోని ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు సంకేతాలిచ్చింది. అయితే, ప్రస్తుతమున్న రిజర్వేషన్ వ్యవస్థలో ఎలాంటి మార్పులు చేయాలనుకోవడం లేదని స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రస్తుతం ఇస్తున్న 50% రిజర్వేషన్లు పోను.. మిగతా 50%లో ఉన్నత కులాల్లోని ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్ల ప్రయోజనం కల్పించడం తమ ప్రభుత్వ ఉద్దేశాల్లో కీలకమైన అంశమని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ‘ఇప్పటికే ఉన్న 50% రిజర్వేషన్ల విషయంలో చర్చ లేదు. అది కాకుండా ఇంకా నిర్ణయాత్మక చర్యలు ఏం తీసుకోగలమనేది ముఖ్యమైన విషయం’ అన్నారు. ‘ఆర్థిక వెనకబాటుదనం ప్రాతిపదికగా ఉన్నత కులాలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించే దిశగా ఈ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేయాలనుకుంటోందా?’ అన్న ప్రశ్నకు.. ఆయన సూటిగా జవాబివ్వలేదు. -
ఆశలన్నీ అమాత్యులపైనే..!
కైకలూరు : కేంద్ర మంత్రుల పర్యటనతో కొల్లేరు గ్రామాల్లో ఉత్కంఠత నెలకొంది. ఈ సారైనా ఎన్నికల హామీలు నెరవేరతాయో లేదో అన్న మీమాంస ప్రజలను వేధిస్తోంది. ఎన్నికల ప్రచారంలో కొల్లేరు సమస్యలను పరిష్కరిస్తామని ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. కొల్లేటి సమస్యల పరిష్కారంపై గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు ఏవీ నెరవేరలేదు.కేంద్ర అటవి, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తొలిసారిగా శుక్రవారం కొల్లేటికోటకు వస్తున్నారు. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లోని కొల్లేరు గ్రామాల నుంచి 25 వేల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. కాంటూరు లెక్కల్లో గందరగోళం కొల్లేరు కాంటూరు లెక్కల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో +5 కాంటూరు పరిధి వరకు 77 వేల 138 ఎకరాలను అభయారణ్యంగా 1999లో విడుదల చేసిన 120 జీవోలో పేర్కొన్నారు. ఇప్పుడు కొల్లేరు ప్రజలు కోరినట్లుగా +5 కాంటూరు నుంచి +3 కాంటూరు వరకు కుదిస్తే 33 వేల 361 ఎకరాలకు తగ్గుతుంది. అంటే 43 వేల 777 ఎకరాలు మిగులు భూమిని రెండు జిల్లాల్లోని 90 వేల కుటుంబాలకు పంపిణీ చేయవచ్చు. కైకలూరుకు చెందిన సామాజిక కార్యకర్త గూడపాటి కృష్ణమోహన్ మాత్రం +5 కాంటూరు వరకు లక్షా 21 వేల 600 ఎకరాల అభయారణ్య భూమి ఉందన్నారు. కొందరు కావాలనే 77వేల 138 ఎకరాలుగా చూపించారని, కొల్లేరు ఆపరేషన్ సమయంలో కృష్ణాజిల్లాలో 7500 ఎకరాలు అదనంగా ధ్వంసం చేశారనే వాదనలో నిజం లేదని తేల్చిచెప్పారు. కొల్లేరులో +5 కాంటూరు వరకు ఇంకా 45 వేల భూములను అభయారణ్యం పరిధిలోకి తీసుకోవాల్సి ఉందని, ప్రస్తుతం పంపిణీ చేస్తామంటున్న 7500 ఎకరాలను ఏ విధంగా నిర్ణయిస్తారని ప్రశ్నిస్తున్నారు. సుప్రీంకోర్టు పరిధిలో అంశం కొల్లేరు అంశం సుప్రీకోర్టు పరిధిలో ఉంది. అక్కడ కేంద్ర సాధికారిత కమిటీ నిర్ణయాల ప్రకారం కొల్లేరులో పనులు జరగాలి. ఈ కారణంగానే కొల్లేరు పెద్దింట్లమ్మ వారిధి నిర్మాణం నిలిచింది. కొల్లేరు కాంటూరు కుదింపు జరగాలంటే ప్రధాని ఛైర్మన్‌గా ఉన్న పర్యావరణ కమిటీ నిర్ణయం తీసుకుని పార్లమెంటులో బిల్లు పెట్టాలి. ఇటీవల కొల్లేరులో అక్రమ చెరువులు పెరిగాయంటూ కొందరు కోర్టులో పిల్ వేశారు. మంత్రులు చూద్దాం.. చేద్దాం.. అంటే మరోసారి నిరసన వ్యక్తమయ్యే అవకాశం ఉంది. -
భారీగా పెరిగిన పులులు
న్యూఢిల్లీ: దేశంలో పులుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఇటీవల నిర్వహించిన పులులగణనలో దేశవ్యాప్తంగా వాటి సంఖ్య 2,226కు చేరినట్లు తేలింది. నాలుగేళ్ల కిందటి సంఖ్యతో పోల్చితే ఇది 30 శాతం అధికం. 2010నాటి గణన ప్రకారం 1,706 పులులు ఉన్నట్లు నిర్ధారించారు. 2014లో చేపట్టిన లెక్కింపులో పులుల సంఖ్య బాగా పెరిగినట్లు వెల్లడైంది. ఈ నివేదికను కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా పులులు తగ్గిపోతుంటే భారత్‌లో మాత్రం వాటి సంఖ్య పెరుగుతోందన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోని పులుల్లో 70 శాతం భారత్‌లోనే ఉన్నాయన్నారు. వాటి సంఖ్యను భారీగా పెంచడంలో విజయం సాధించామని పేర్కొన్నారు. ప్రస్తుతం పులుల సంఖ్య 1,945 నుంచి 2,491 మధ్య ఉండొచ్చని అంచనా వేసినట్లు చెప్పారు. కర్ణాటకలో అత్యధిక పులులు ఉన్నాయన్నారు. -
అక్రమ వర్తకాన్ని సహించబోం
న్యూఢిల్లీ: వన్యప్రాణుల అవయవాల అక్రమ వర్తకాన్ని సహించబోమని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ హెచ్చరించారు. స్థానిక జంతుప్రదర్శనశాలలో ఆదివారం ఉదయం గతంలో స్వాధీనం చేసుకున్న వన్యప్రాణుల అవయవాలను దహనం చేశారు. ఇదే సమయంలో జూకి వచ్చిన కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ మీడియాతో మాట్లాడుతూ ఇలా స్వాధీనం చేసుకున్న ఉత్పత్తుల విక్రయం ద్వారా వచ్చిన సొమ్మును ఉగ్రవాద కార్యకలాపాలు, నేరాల నిరోధానికి వినియోగిస్తున్న విషయం నిజమేనని అంగీకరించారు. అయితే ఇకమీదట వన్యప్రాణుల సంరక్షణ కోసం వినియోగిస్తామన్నారు. వన్యప్రాణుల అవయవాల వర్తకంపై నిషేధం అమల్లో ఉందని, అటువంటి కార్యకలాపాలను సహించబోమనే సందేశాన్ని పంపాలనే ఉద్దేశంతోనే వాటిని ఇప్పుడు దహనం చేశామన్నారు. వన్యప్రాణుల చర్మం, కొమ్ములు, దంతాలకు మార్కెట్లో మంచి ధర పలుకుతుందన్నారు.