భారీగా పెరిగిన పులులు
న్యూఢిల్లీ: దేశంలో పులుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఇటీవల నిర్వహించిన పులులగణనలో దేశవ్యాప్తంగా వాటి సంఖ్య 2,226కు చేరినట్లు తేలింది. నాలుగేళ్ల కిందటి సంఖ్యతో పోల్చితే ఇది 30 శాతం అధికం. 2010నాటి గణన ప్రకారం 1,706 పులులు ఉన్నట్లు నిర్ధారించారు. 2014లో చేపట్టిన లెక్కింపులో పులుల సంఖ్య బాగా పెరిగినట్లు వెల్లడైంది. ఈ నివేదికను కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా పులులు తగ్గిపోతుంటే భారత్‌లో మాత్రం వాటి సంఖ్య పెరుగుతోందన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోని పులుల్లో 70 శాతం భారత్‌లోనే ఉన్నాయన్నారు. వాటి సంఖ్యను భారీగా పెంచడంలో విజయం సాధించామని పేర్కొన్నారు. ప్రస్తుతం పులుల సంఖ్య 1,945 నుంచి 2,491 మధ్య ఉండొచ్చని అంచనా వేసినట్లు చెప్పారు. కర్ణాటకలో అత్యధిక పులులు ఉన్నాయన్నారు.