కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్
సాక్షి,బళ్లారి: పార్టీలో నేతలంతా ఏక తాటిపై నడుస్తుండటంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు. ఆయన శనివారం నగరంలోని నక్షత్ర హోటల్‌లో బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. తాను మూడు రోజులుగా ఉత్తర కర్ణాటకలోని పలు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించానని, ప్రతి తాలూకాలో కూడా బీజేపీకి జనం బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి కులాల మధ్య చిచ్చు పెట్టి విడదీసే ధోరణిలో పని చేస్తున్నారన్నారు. ఆయన వ్యక్తులను, సమాజాన్ని చీలిస్తే తాము ఒకటి చేస్తూ అభివృద్ధి చేస్తున్నామన్నారు. యడ్యూరప్పను కేసుల్లో ఇరికించాలని సీఎం, ఇతర ప్రముఖులు ఎంతో ప్రయత్నించారన్నారు. అయితే వారి ఎత్తులు చిత్తు అయ్యాయని, యడ్యూరప్పకు కోర్టు నుంచి ఊరట లభించిందన్నారు.
దీంతో కాంగ్రెస్ వారికి ఏమి మాట్లాడలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతు రుణాలు మాఫీ చేయడంలో సీఎం మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అన్నభాగ్య పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తోందని గొప్పలు చెప్పుకుంటున్నారని, అయితే ఆ పథకానికి మెజార్టీ శాతం నిధులు కేంద్రానివే అనే విషయం ముఖ్యమంత్రి మరువ రాదన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టేందుకు బీజేపీ కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బళ్లారి ఎంపీ శ్రీరాములు, మాజీ ఎమ్మెల్యే సోమశేఖరరెడ్డి, ఎమ్మెల్యేలు సురేష్‌బాబు, నాగేంద్ర, జిల్లా బీజేపీ అధ్యక్షుడు చెన్నబసవనగౌడ తదితరులు పాల్గొన్నారు.