వారే పొగుడుతుంటే.. పోరాడటమెలా?
కేసీఆర్‌కు కేంద్ర మంత్రుల ప్రశంసలపై బీజేపీ రాష్ట్ర నేతల అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్రమంత్రులు, బీజేపీ జాతీయ నేతలు ప్రశంసలు కురిపించడం ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి మింగుడుపడటం లేదు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన అధికారిక, అనధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న స్పీకరు, కేంద్రమంత్రులు సీఎం కేసీఆర్‌ను, ఆయన కుటుంబ సభ్యులను పొగుడుతూ మాట్లాడారు. ఇది రాష్ట్రస్థాయిలో పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితిని కల్పిస్తోందంటూ బీజేపీ రాష్ట్ర నాయకత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడటానికి ప్రతిబంధకమవుతోందని భావిస్తున్నారు.
ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఒక కాలేజీ కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవితను ప్రశంసించారు. నిజామాబాద్‌లో మెగా ఫుడ్‌పార్క్ కార్యక్రమంలో కేంద్రమంత్రి హర్‌సిమ్రత్ కౌర్ రాష్ట్రంలో పాలనాతీరును కొనియాడారు. వరంగల్ ఉప ఎన్నికలు జరుగుతున్న వేళ టీఆర్‌ఎస్‌పై, కేసీఆర్ పాలనపై కేంద్రమంత్రి ప్రశంసలు కురిపించడం రాష్ట్ర నాయకత్వానికి ఇబ్బందికరంగా మారింది. ఆదిలాబాద్‌లో పర్యటించిన కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ కూడా రాష్ట్రంలో పాలన బాగుందన్నారు.
ఇవన్నీ ఒక ఎత్తయితే తెలుగురాష్ట్రానికే చెందిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కూడా కేసీఆర్‌ను ప్రశంసించ డం మరోఎత్తని నాయకులు భావిస్తున్నారు. వీటితోపాటు రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కూడా కేసీఆర్‌తోనూ, ప్రభుత్వంలోని ముఖ్యులతోనూ సన్నిహితంగా ఉంటున్నారు. ఇవన్నీ రాష్ట్రంలో ప్రతిపక్షపాత్రలో ఉన్న బీజేపీకి రుచిం చడం లేదు. కేంద్రమంత్రులే పొగుడుతుంటే రాష్ట్రస్థాయిలో ఎలా పోరాడాలంటూ రాష్ట్రనేతలు ఇప్పటికే జాతీయ నాయకత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఒకే పార్టీలోని జాతీయ నేతలు పొగడటం, రాష్ట్రనేతలు విమర్శించడం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపిస్తున్నదంటూ జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం.