ఘన వ్యర్థాలపై కొత్త నిబంధనలు
న్యూఢిల్లీ: ఘన వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించడానికి కేంద్రం కొత్త నిబంధనలను తెచ్చింది. ఇకపై.. చెత్తను బహిరంగంగా కాల్చడాన్ని నేరంగా పరిగణిస్తామని పేర్కొంది. స్త్రీలు, పిల్లల న్యాప్కిన్లు, డైపర్లను ఉపయోగానంతరం పారవేయడానికి చిన్నపాటి సంచులను అందిచాల్సిందిగా తయారీ సంస్థలకు స్పష్టం చేసింది. కొత్త నిబంధనల ప్రకారం.. వంద మందికిపైగా హాజరయ్యే వేడుకల్లో నిర్వాహకులే ఘన వ్యర్థాలను తడి, పొడి చెత్తలుగా వేరుచేసి చెత్త సేకరించే వారికివ్వాలి.
ప్రత్యేక ఆర్థిక మండళ్లు, పారిశ్రామిక వాడలు, ఉద్యానవనాల మొత్తం స్థలంలో కనీసం 5 శాతం స్థలాన్ని చెత్త సేకరణ, రీసైక్లింగ్‌కు కేటాయించాలి. ఫుట్‌పాత్‌లు, వీధుల్లో అమ్మకాలు జరిపేవారు చెత్తను నిల్వ ఉంచేందుకు చెత్త బుట్టలను తప్పక పెట్టాలి. చెత్త సేకరించే కార్మికులను నమోదు చేసుకుని వారిని క్రమబద్ధీకరించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. చెత్త సేకరణలో వీరి పాత్ర ఎంతో ప్రముఖమని పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్ చెప్పారు.