‘కమిషన్ల’పై దద్దరిల్లిన రాజ్యసభ
- ఎగువసభలో వాయిదాల పర్వం
- రియల్ ఎస్టేట్ రంగంలో నియంత్రణకు బీజేపీ ఎంపీ డిమాండ్
న్యూఢిల్లీ: విపక్షాల ఆందోళనలతో రాజ్యసభ మంగళవారం దద్దరిల్లింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కమిషన్లలో ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ విపక్షాలన్నీ ఆందోళన చేపట్టడంతో పలుమార్లు వాయిదా పడింది. ఖాళీల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని కేంద్రం వెల్లడించినా.. వారం రోజుల్లో భర్తీ చేయాలని కాంగ్రెస్, ఎస్పీ, జేడీయూ, బీఎస్పీ డిమాండ్ చేస్తూ సభాకార్యక్రమాలకు ఆటంకం కలిగించాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లో ఉండటం కారణంగానే ఈ ప్రక్రియ ఆలస్యమైందని సామాజికన్యాయం, సాధికారత మంత్రి థావర్‌చంద్ గెహ్లాట్ నిరసనల మధ్యే ప్రకటించారు.
2007, 2010ల్లో కాంగ్రెస్ హయాంలో కమిషన్లలో ఖాళీల భర్తీ ఐదు నెలలు ఆలస్యంగా చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు. అయినా.. ఇప్పుడే దీనిపై వాయిదా తీర్మానం కింద చర్చ జరగాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. దీనికి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ తిరస్కరించారు. ‘అన్ని కమిషన్లు పనిచేస్తున్నాయి. ఖాళీల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. అవన్నీ త్వరలోనే భర్తీ చేస్తాం’ అని వెంకయ్యనాయుడు కూడా సభలో వెల్లడించారు. అయినా విపక్షాల నిరసన తగ్గకపోవటంతో సభను బుధవారానికి వాయిదా వేశారు.
నిధుల కొరత లేదు: జవదేకర్
నేషనల్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ, సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ చట్టం– 2007 (సవరణ)ను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి ప్రకాశ్ జవదేకర్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. తిరుపతి, బర్హంపూర్ ఐఐటీలఏర్పాటు నిబంధనల్లో స్వల్ప మార్పు లు చేశామన్నారు. జాతీయ ప్రాముఖ్యత ఉన్న సంస్థలకు నిధుల కొరతేమీ లేదని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. ఈ బిల్లు ఆమోదం ద్వారా ఐఐఎస్‌ఈఆర్ సంస్థలు ఐదు నుంచి ఏడుకు పెరిగాయి. ప్రతి ఏడాది ఐఐఎస్‌ఈఆర్‌లకు రూ.900 కోట్లు, ఐఐఎస్‌సీలకు రూ. 300 కోట్ల బడ్జెట్ కేటాయించనున్నారు.
మరోవైపు, దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంలో భాగమైన స్టీల్, సిమెంట్, ఇసుక, ఇటుకలు వంటివాటిపై నియంత్రణ కోసం ఓ సంస్థను ఏర్పాటుచేయాలని బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ సింగ్ డిమాండ్ చేశారు. ట్రాయ్, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్స్ ఉన్నట్లే.. రియల్ ఎస్టేట్ రంగంలోనూ నియంత్రణ అవసరమన్నారు. ట్రయల్ కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేసేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటుచేయాలని సీపీఎం ఎంపీ పీకే శ్రీమతి టీచర్ కేంద్రాన్ని కోరారు.